బెంగాల్ కోటలో సెలబ్రిటీలకు షాక్ | Bengal 2026 The End of Celebrity Politics | Sakshi
Sakshi News home page

బెంగాల్ కోటలో సెలబ్రిటీలకు షాక్

Apr 27 2026 7:35 AM | Updated on Apr 27 2026 12:26 PM

Bengal 2026 The End of Celebrity Politics

బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు గ్లామర్ ఉంటే గెలుపు ఖాయమనే నమ్మకం బలంగా ఉండేది. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికలు ఈ పాత ఫార్ములాను పూర్తిగా మార్చేస్తున్నాయి. కేవలం ముఖ పరిచయం, సినిమా క్రేజ్ చూసి ఓట్లు వేసే రోజులు పోయాయని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండూ గ్రహించాయి. అందుకే ఈసారి ఎన్నికల బరిలో సినీ, క్రీడా తారల సందడి అంతగా కనిపించలేదు. ఇది కేవలం టికెట్ల పంపిణీలో జరిగిన  పరిణామం మాత్రమే కాదు.. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, ఇరు పార్టీలు వ్యూహాత్మకంగా తీసుకున్న కఠిన నిర్ణయం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు, భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే క్రమంలో కేవలం ఆకర్షణపైననే ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని రెండు పార్టీల అధిష్టానాలు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చాయి.

గత అనుభవాలతో దెబ్బతిన్నాక..
కొన్నేళ్ల క్రితం వరకు రాజకీయ ముఖచిత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉండేది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ.. సినీ తారలు నుస్రత్ జహాన్, మిమీ చక్రవర్తిలను బరిలోకి దించి ఘన విజయం సాధించింది. ఆ విజయాల ఉత్సాహంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఇదే ‘సెలబ్రిటీ మోడల్’ను గుడ్డిగా అనుసరించాయి. టీఎంసీ తరపున సాయోని ఘోష్, జూన్ మాలియా.. బీజేపీ తరపున లాకెట్ ఛటర్జీ, రుద్రనీల్ ఘోష్, పాయెల్ సర్కార్ వంటి ఎంతోమంది తారలు పోటీ పడ్డారు. అయితే ఫలితాలు మాత్రం రెండు పార్టీల అంచనాలను దారుణంగా తలకిందులు చేశాయి. సాయోని ఘోష్, జూన్ మాలియా లాంటి కొద్దిమంది మినహా, చాలామంది తారలు తమ క్రేజ్‌ను ఓట్లుగా మార్చుకోవడంలో విఫలమయ్యారు. ఎన్నికల తర్వాత ఓడిపోయిన చాలామంది తారలు రాజకీయాలకు దూరమయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి భిన్నం
పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసమే తారల వైఫల్యానికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లోక్‌సభ ఎన్నికలు భారీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతాయి. అక్కడ అభ్యర్థి ఇమేజ్, పార్టీ జెండా, అధినేత చరిష్మా ఎక్కువగా పనిచేస్తాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి దానికి భిన్నంగా ఉంటుంది. ఒక ఎమ్మెల్యే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. స్థానిక సమస్యల పరిష్కారం, బూత్ స్థాయి కార్యకర్తలతో సమన్వయం ఇక్కడ అత్యంత కీలకం. షూటింగులతో బిజీగా ఉండే సెలబ్రిటీలు ఈ స్థాయిలో ప్రజలతో మమేకం కావడంలో, క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌ను నడపడంలో విఫలమవుతున్నారు. అందుకే కేవలం ప్రచార ఆకర్షణగా మిగిలిపోయే తారల కన్నా, 24 గంటలు జనంలో ఉండే నాయకులకే టికెట్లు ఇవ్వాలని పార్టీలు నిర్ణయించాయి.

2026 ఎన్నికల్లో ప్రక్షాళన 
ఈ వ్యత్యాసాన్ని పూర్తిస్థాయిలో అర్థం చేసుకున్న టీఎంసీ, బీజేపీలు 2026 ఎన్నికల్లో ప్రక్షాళన చేపట్టాయి. కేవలం గ్లామర్ కోసమే వచ్చిన వారిని పక్కనపెట్టి, పార్టీ సిద్ధాంతాలతో మమేకమైన వారినే అంటిపెట్టుకున్నాయి. 2021లో శిబ్‌పూర్ నుంచి గెలిచిన మాజీ క్రికెటర్ మనోజ్ తివారీకి టీఎంసీ ఈసారి మొండిచెయ్యి చూపింది. అలాగే నటులైన ఎమ్మెల్యేలు కంచన్ ముల్లిక్, రాజ్ చక్రవర్తిలకు కూడా సీట్లు దక్కలేదు. సోహమ్ చక్రవర్తి, అదితి మున్షీ లాంటి ఒకరిద్దరికి మాత్రమే పార్టీలో మినహాయింపు దొరికింది. మరోవైపు టీఎంసీని వీడి బీజేపీలో చేరిన టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు సైతం కాషాయ పార్టీ టికెట్ నిరాకరించింది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయినా పార్టీని అంటిపెట్టుకుని, టీఎంసీ ఒత్తిళ్లను తట్టుకుని నిలబడిన రుద్రనీల్ ఘోష్‌కు మాత్రం బీజేపీ మరోసారి అవకాశం ఇచ్చింది.

ప్రజాకర్షణ ఒక్కటే సరిపోదు
పశ్చిమ బెంగాల్‌లో స్పష్టంగా కనిపిస్తున్న ఈ మార్పు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ ధోరణికి ఇది అద్దం పడుతోంది. ఒకప్పుడు తమిళనాడులో ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి లాంటి వారు సినిమా గ్లామర్‌తో పాటు రాజకీయాల్లో క్షేత్రస్థాయిలో కష్టపడి తిరుగులేని ప్రజా నాయకులుగా ఎదిగారు. కానీ ప్రస్తుత తరం తారలకు ఆ మోడల్‌ను పునరావృతం చేయడం సాధ్యం కావడం లేదు. కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చినా, పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రజనీకాంత్ వెనక్కి తగ్గారు. దళపతి విజయ్ సొంత పార్టీతో 2026 పోరుకు సిద్ధమవుతున్నా.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అంత సులభంగా లేవు. పంజాబ్‌లో సీఎం భగవంత్ మాన్ సక్సెస్ అయినా, హిమాచల్ ప్రదేశ్‌లో ఎంపీ కంగనా రనౌత్ లాంటి వారు నిత్య రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం కష్టమని తేలింది. గతంలో సన్నీ డియోల్ లాంటి వారు కూడా చేతులెత్తేసిన పరిస్థితిని మనం చూశాం.

క్షేత్రస్థాయిలో పనిచేసే నేతలకే..
ఈ పరిణామాలన్నీ భారత ఎన్నికల వ్యవస్థలో వస్తున్న ఒక స్పష్టమైన, ప్రాథమిక మార్పును సూచిస్తున్నాయి. ప్రచార సభలకు జనాన్ని ఆకర్షించడానికి, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి రాజకీయాల్లో చరిష్మా ఇంకా పనిచేస్తుండవచ్చు. కానీ.. ఆ గ్లామర్.. ఓట్లను బూత్ దాకా తీసుకురాలేదు. సంస్థాగత బలాన్ని భర్తీ చేయలేదు. ఓట్లను సమీకరించడం, సామాజిక వర్గాలను ఏకం చేయడం, క్షేత్రస్థాయిలో బూత్‌లను మేనేజ్ చేయడం లాంటి కఠినమైన పనులు చేయగలిగిన వారే ఇప్పుడు పార్టీలకు అవసరం. కేవలం ప్రచారానికి ‘ముఖచిత్రం’గా ఉండే తారల కంటే, ఎన్నికలను క్షేత్రస్థాయిలో నడిపించే వారికే రాజకీయ పార్టీలు పెద్దపీట వేస్తున్నాయి. బెంగాల్ నేర్పుతున్న ఈ పాఠం దేశవ్యాప్తంగా విస్తరిస్తే, భారత ఎన్నికల రూపురేఖలు మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

ఇది కూడా చదవండి: గుండెకు క్యాన్సర్ ఎందుకు రాదో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement