గుండెకు క్యాన్సర్ ఎందుకు రాదో తెలుసా? | Why The Beating Heart Defeats Cancer | Sakshi
Sakshi News home page

గుండెకు క్యాన్సర్ ఎందుకు రాదో తెలుసా?

Apr 26 2026 12:56 PM | Updated on Apr 26 2026 1:17 PM

Why The Beating Heart Defeats Cancer

శరీరంలోని దాదాపు అన్ని అవయవాలకు క్యాన్సర్  ముప్పు ఉంటుంది. కానీ ఎప్పుడైనా గుండెకు క్యాన్సర్ సోకడం గురించి విన్నారా? క్యాన్సర్ బారిన పడని ఏకైక అవయవం గుండె మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. ఈ దశాబ్దాల మిస్టరీని శాస్త్రవేత్తలు ఎట్టకేలకు ఛేదించారు. నిరంతరం కొట్టుకునే గుండె చప్పుడే, అందులో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ‘మెకానికల్ ఫోర్సెస్’ క్యాన్సర్ జన్యువుల పనితీరును మార్చేస్తాయని తేల్చిచెప్పిన ఈ పరిశోధన వైద్య రంగంలో ఒక సంచలనంగా నిలిచింది.

నిరంతర శ్రమతోనే క్యాన్సర్‌కు చెక్
ప్రముఖ ‘సైన్స్’జర్నల్‌లో ప్రచురితమైన ఈ తాజా అధ్యయనం ప్రకారం.. గుండె నిరంతరం రక్తాన్ని పంప్ చేస్తూ తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. ఈ యాంత్రిక ఒత్తిడి కారణంగా గుండె కణాల విభజన వేగం తగ్గుతుంది. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (ఐసీజీఈబీ)కి చెందిన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో, గుండె లోపలి ఈ ప్రత్యేకమైన వాతావరణం క్యాన్సర్ కణాల పెరుగుదలను క్రియాశీలంగా అడ్డుకుంటుందని తేలింది.

ఎలుకల ప్రాజెక్టులో సంచలన నిజాలు
దీనిని నిరూపించడానికి పరిశోధకులు ఎలుకలపై ఒక ప్రయోగం చేశారు. వారు ఒక దాత గుండెను ఎలుక మెడ భాగంలో అమర్చారు. ఈ కొత్త గుండెకు రక్తప్రసరణ జరుగుతుంది కానీ, రక్తాన్ని పంప్ చేసే యాంత్రిక ఒత్తిడి ఉండదు. ఆ తర్వాత ఈ ఒత్తిడి లేని గుండెలోకి, అలాగే సహజంగా రక్తాన్ని పంప్ చేస్తూ పనిచేస్తున్న ఎలుక సొంత గుండెలోకి మానవ క్యాన్సర్ కణాలను ఎక్కించి, కణతుల వృద్ధిని తులనాత్మకంగా పరిశీలించారు.

పనిచేసే గుండెలో పెరగని కణాలు
ఈ ప్రయోగ ఫలితాలు క్యాన్సర్ పరిశోధనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. రక్తాన్ని పంప్ చేయని, అంటే మెకానికల్ ఒత్తిడి లేని మెడలోని గుండెలో క్యాన్సర్ కణాలు వేగంగా వృద్ధి చెంది, కణతులుగా మారాయి. కానీ సహజంగా నిరంతరం కొట్టుకుంటూ, ఒత్తిడిని ఎదుర్కొంటున్న అసలైన గుండెలో మాత్రం క్యాన్సర్ కణాలు పెరగలేదు. వివిధ రకాల క్యాన్సర్లలో కూడా ఇదే తరహా ఫలితాలు వచ్చాయి. దీనిని బట్టి గుండె పడే యాంత్రిక శ్రమే క్యాన్సర్‌ను అడ్డుకునే ప్రధాన ఆయుధం అని స్పష్టమైంది.

‘నెస్ప్రిన్-2’.. క్యాన్సర్‌ను అడ్డుకునే హీరో
అసలు ఈ ఒత్తిడి క్యాన్సర్‌ను ఎలా ఆపుతుందనే విషయానికొస్తే.. ఇక్కడే ‘నెస్ప్రిన్-2’ (Nesprin-2) అనే ప్రొటీన్ కీలకంగా వ్యవహరిస్తుంది. గుండె కొట్టుకునేటప్పుడు ఏర్పడే భౌతిక సంకేతాలను ఈ ప్రొటీన్ కణ కేంద్రకానికి చేరవేస్తుంది. ఈ సంకేతాలు కణాలలోని డీఎన్‌ఏ అమరికను, హిస్టోన్ మిథైలేషన్ ప్రక్రియను మారుస్తాయి. దీనివల్ల క్యాన్సర్ కణాల వృద్ధికి కారణమయ్యే జన్యువులు బలహీనపడి, కణతుల పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది.

భవిష్యత్ క్యాన్సర్ చికిత్సలకు కొత్త ఆశ
పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాల్లోని ఈ నెస్ప్రిన్-2 ప్రొటీన్‌ను సైలెంట్ (నిష్క్రియం) చేసి చూడగా, చురుగ్గా పనిచేసే గుండెలో కూడా క్యాన్సర్ కణాలు పెరగడం ప్రారంభించి కణతులు ఏర్పడ్డాయి. ఈ అద్భుతమైన ఆవిష్కరణ భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో కొత్త శకానికి నాంది పలకనుంది. కణాలు అనుభవించే ఈ యాంత్రిక ఒత్తిడిని కృత్రిమంగా సృష్టించడం లేదా అనుకరించడం ద్వారా శరీరంలోని ఇతర భాగాల్లో వచ్చే క్యాన్సర్‌ను కూడా అరికట్టే సరికొత్త థెరపీలను అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

ఇది కూడా చదవండి: భోపాల్ విషాద సాక్షి.. రఘు రాయ్ ఇకలేరు

Advertisement
 
Advertisement
Advertisement