PC: BCCI
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత్-‘ఎ’ జట్టు సత్తా చాటింది. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, వైభవ్ సూర్యవంశీ ఈసారి సత్తా చాటగా.. రుతురాజ్ గైక్వాడ్, కెప్టెన్ తిలక్ వర్మ మరోసారి రాణించారు. ఫలితంగా నిర్ణీత 49 ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 349 పరుగులు సాధించింది.
తొలి మ్యాచ్ శ్రీలంకతో
శ్రీలంక వేదికగా ఆతిథ్య లంక, భారత్, అఫ్గన్ ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ మంగళవారం మొదలైంది. తొలి మ్యాచ్‌లో భారత్- శ్రీలంక తలపడగా.. తిలక్ వర్మ సేన ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.
లంకతో మ్యాచ్‌లో ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ (101) శతకంతో రాణించాడు. తిలక్ వర్మ 60 పరుగులతో రాణించాడు. ఇక తొలి మ్యాచ్‌లో గట్టెక్కిన భారత్.. రెండో మ్యాచ్‌లో భాగంగా గురువారం అఫ్గన్‌పై భారీ స్కోరు సాధించింది.
అఫ్గన్‌పై చెలరేగిన ఓపెనర్లు
దంబుల్లా వేదికగా టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69 బంతుల్లో 84), వైభవ్ సూర్యవంశీ (22 బంతుల్లోనే 44) శుభారంభం అందించారు. ప్రభ్‌సిమ్రన్ ఆచితూచి ఆడగా.. వైభవ్ ధనాధన్ దంచికొట్టాడు.
రుతు, తిలక్ మరోసారి..
వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియాన్ష్ ఆర్య (8) విఫలం కాగా.. రుతురాజ్ గైక్వాడ్ 80 బంతుల్లో 66 పరుగులు సాధించాడు. కెప్టెన్ తిలక్ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 రన్స్ రాబట్టాడు. మిగిలిన వారిలో ఆయుశ్ బదోని డకౌట్ కాగా.. సూయాన్ష్ షెడ్గే (40) రాణించాడు. అనుకుల్ రాయ్ 16 పరుగులతో అజేయంగా నిలవగా.. అర్షద్ ఖాన్ (1), విప్రాజ్ నిగమ్ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు.
49 ఓవర్లు ఎందుకంటే?
వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగులు సాధించింది. అఫ్గన్ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
అఫ్గన్ లక్ష్యం 294
వర్షం మరోసారి ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం అఫ్గనిస్తాన్ టార్గెట్‌ను 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు.
చదవండి: ఆసీస్ జట్టులో నిఖిల్ చౌదరి


