బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథ్యంలో సిరీస్‌లో పాల్గొనే పదిహేడు మంది సభ్యుల పేర్లను తాజాగా వెల్లడించింది. ఈ జట్టులో భారత్‌కు చెందిన నిఖిల్ చౌదరికి సెలక్టర్లు చోటివ్వడం విశేషం.
మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు ఆసీస్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ మొదలుకాగా.. జూన్ 17, 19, 21 తేదీల్లో మూడు టీ20ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక
ఈ నేపథ్యంలో సీఏ తాజాగా బంగ్లాతో సిరీస్‌కు టీ20 జట్టును ప్రకటించింది. బిగ్‌బాష్ లీగ్‌లో రాణించిన ఆటగాళ్లకు సెలక్టర్లు ఈ జట్టులో చోటిచ్చారు. హోబర్ట్ హారికేన్స్ తరఫున సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకున్న నిఖిల్ చౌదరి (Nikhil Chaudhary)కి తొలిసారి జాతీయ జట్టులో అవకాశం దక్కింది.
ఆల్‌రౌండ్ నైపుణ్యాలున్న 30 ఏళ్ల నిఖిల్ చౌదరి బంగ్లాదేశ్‌తో సిరీస్‌తో గనుక అరంగేట్రం చేస్తే.. 62 ఏళ్ల తర్వాత ఆసీస్‌కు ఆడిన జన్మతః భారతీయుడైన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. కలకత్తా వేదికగా 1964లో రెక్స్ సెల్లార్స్ అనే భారతీయుడు ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగాడు. గుజరాత్‌లో జన్మించిన రెక్స్ లెగ్ స్పిన్నర్. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు నిఖిల్‌కు అవకాశం వచ్చింది.
ఎవరీ నిఖిల్ చౌదరి?
ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. భారత టెస్టు, వన్డే జట్ల ప్రస్తుత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సహా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్‌తో కలిసి పంజాబ్ జట్టుకు ఆడాడు.
అదే విధంగా టీమిండియా స్టార్లు అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్‌లతో కలిసి పంజాబ్ తరఫున లిస్ట్-ఎ క్రికెట్ బరిలో దిగాడు. కానీ అతడికి ఆశించినంతగా అవకాశాలు రాలేదు. ఇక 2020లో క్వీన్స్‌లాండ్‌లో ఉన్న తన అంకుల్‌ను చూసేందుకు నిఖిల్ చౌదరి ఆస్ట్రేలియాకు వెళ్లాడు.
అయితే, కోవిడ్ కారణంగా ప్రయాణాలపై నిషేధం విధించడంతో నిఖిల్ అక్కడే చిక్కుకుపోయాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోనే ఉండాలని నిర్ణయించుకున్న అతడు.. శాశ్వత నివాస హోదా పొందాడు. గత మూడేళ్లుగా బిగ్‌బాష్ లీగ్‌లో సత్తా చాటుతున్న నిఖిల్.. 2024-25లో హోబర్ట్ హారికేన్స్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
అలా దేశీ క్రికెట్‌లో అవకాశం
లెగ్‌స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ నిఖిల్‌కు ఊహించని రీతిలో ఆసీస్ దేశీ క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం లభించింది. స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్ జాతీయ జట్టు విధుల్లోకి వెళ్లగా అతడి స్థానంలో టాస్మేనియా నిఖిల్‌ను పిలిపించింది.
ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ షెఫీల్డ్ షీల్డ్‌లో టాస్మేనియాకు ఆడుతూ.. న్యూ సౌత్ వేల్స్‌తో మ్యాచ్‌లో శతకం (184 బంతుల్లో 163) సాధించి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఆసీస్ దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీలో శతక్కొట్టిన భారత మూలాలున్న తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
ఏదేమైనా భారత్‌లో అవకాశాలు లేక ఆసీస్‌కు వెళ్లిన నిఖిల్ చౌదరి.. ఇప్పుడిలా అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటూ ఏకంగా ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికకావడం నిజంగా విశేషమే.
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్(కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, నిఖిల్ చౌదరి, కూపర్ కానొలీ, టిమ్ డేవిడ్, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మాథ్యూ కుహ్నెమాన్, రైలీ మెరెడిత్, జోష్ ఫిలిప్, మాథ్యూ రెన్‌షా, ఆడమ్ జంపా.


