రాజకీయాలలో ఎప్పుడూ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదన్నది ఒక అభిప్రాయం. అన్నిసార్లు కాకపోయినా, కొన్నిసార్లు బొద్దింకలు కూడా తిరగబడతాయన్న సత్యాన్ని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పక్షాన యువత రుజువు చేసింది. ఎంత బలాఢ్యుడైనా ఆ తిరుగుబాటుకు తలొగ్గక తప్పదని రుజువైంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ పర్వం దేశానికే ఒక స్పూర్తిదాయక ఘట్టంగా నిలిచింది. ఇలాంటి లీక్‌లు జరిగినా, లేదా స్కామ్‌ల ఆరోపణలు ఆధారాలతో సహా బయటపడినా సంబందిత బాధ్యులు పదవి నుంచి వైదొలగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ యువత ఆందోళన తేల్చి చెప్పింది.
కేంద్రంలోనేనా ఇలా రాజీనామాలు జరగవలసింది? మరి రాష్ట్రాలలో జరిగే లీక్‌లు, ఇతర కుంభకోణాల పరిస్థితి ఏమిటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే ఏపీలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పదవి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా తెరపైకి వచ్చింది. డీఎస్సీ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ ఆరోపణ, టీచర్ల ఎంపికలో అవకతవకలు, స్పోర్ట్ కోటా టీచర్ల ఎంపికలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధారసహింతంగా ఆరోపణలు చేసినా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. బహుశా ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం గురించి స్పందించకుండా జాగ్రత్తపడ్డారు. కాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఉద్యమం చేస్తున్న యువతపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విమర్శకు గురయ్యారు.
కాక్రోచ్ ఉద్యమానికి కాంగ్రెస్ తదితర విపక్షాలు రంగంలోకి దిగడంతో తీవ్రరూపం దాల్చింది. ఒకరకంగా రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేలు ప్రధాని ఇంటిముందు ధర్నాకు దిగడంతో బీజేపీ కంగుతిన్నట్లనిపించింది. సీజేపీతో చర్చలకు సిద్దమని బీజేపీ కూడా చెప్పవలసి వచ్చింది. రాహుల్ గాంధీపై విమర్శలు చేసినా, బీజేపీ కొంత డిఫెన్స్‌లో పడినట్లయింది. కాక్రోచ్ ఉద్యమంతో పాటు, కాంగ్రెస్ ధర్నా ప్రభావం వివిధ రాష్ట్రాలలో కూడా పడింది. కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ యాక్టివ్ అయ్యాయి. వారికి పోటీగా బీజేపీ కూడా ఎదురుదాడి చేయడానికి యత్నించింది.
ఏపీ, తెలంగాణలలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇదో గొడవగా మారింది. తెలంగాణలో రెండు పార్టీలు కర్రలతో ఘర్షణకు దిగాయి. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. విజయవాడలో కాంగ్రెస్ ఆఫీస్‌పై బీజేపీ దాడికి యత్నించడం ఆశ్చర్యంగానే ఉంది. ఏపీలో ఈ రెండు పార్టీలకు పెద్దగా బలం లేకపోయినా, ఈ అవకాశం ద్వారా తమ ఉనికి కోసం ప్రయత్నించినట్లు అనిపిస్తుంది.
23 లక్షల మంది విద్యార్ధులు మెడికల్ కాలేజీలలో సీట్ల నిమిత్తం రాసిన నీట్ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వైనం, ఆ తర్వాత ఆ విషయాలు బయటకు వచ్చి దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ చేసిన ఒక అనవసర వ్యాఖ్యతో దేశంలో కొత్తగా పుట్టుకువచ్చిన క్రాకోచ్ జనతాపార్టీ యువతను ఆకర్షించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌కు సంబంధించి కొందరిని ప్రభుత్వం అరెస్టు చేసింది. కాని తొలి నీట్ పరీక్ష రద్దు కావడంతో సుమారు ఇరవైమంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆవేదనకు గురి చేసింది. మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించినప్పటికీ, నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌కు నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను కాక్రోచ్ జనతా పార్టీ చేసింది. అలాగే ఆత్మహత్య చేసుకున్న విద్యార్ధుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని వీరు కోరారు.
ఇలా వివిధ డిమాండ్లతో సాగుతున్న వీరి ఉద్యమం ఒక దశలో ముగిసిపోయిందని అనుకున్నారు. కాని వాంగ్ చుక్ అనే ఉద్యమకారుడు నిరాహారదీక్షకు దిగడంతో తిరిగి ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. వేలాదిగా తరలివచ్చిన యువత పార్లమెంటు ముట్టడికి వెళ్లడం, ఆ క్రమంలో పోలీసులు లాఠీచార్జీ చేయడం వంటివి పరిస్థితిని ఉద్రిక్తం చేశాయి. పోలీసులు విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్లు పలువురిని లాఠీలతో కొట్టారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది సంబంధం లేని పిల్లలను కూడా పోలీసులు కొట్టిన తీరు విమర్శలకు గురి అయింది. ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
ప్రధాని మోదీ తొలిసారిగా నీట్ ప్రశ్నాపత్రాల లీక్‌పై స్పందించి అది మహాపాపమని అభివర్ణించారు. ఈ వ్యవహారంలో గట్టిగా స్పందిస్తున్నామన్న సంకేతం ఇవ్వడానికి యత్నించారు. బీజేపీ, జనసేన వంటి పార్టీలు ఈ ఉద్యమంలో దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని, ఇతరత్రా ఆరోపణలు చేసినా, ప్రధాని ఆ యువతను స్నేహితులు అని అడ్రస్ చేయడం విశేషం. ఈ కేసులో నిందితులకు సత్వరమే శిక్ష పడడానికి వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. వాంగ్ చుక్ దీక్ష విరమించినా, ఉద్యమం కొనసాగడం, దేశం అంతటా దీని ప్రభావం పడుతుండడం గమనించి మోదీ స్పందించారు. వెంటనే డామేజ్ కంట్రోల్‌కు చర్యలు చేపట్టారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు ఉద్యమకారుల డిమాండ్లను అంగీకరించినట్లు కేంద్ర మంత్రులు ప్రకటించారు. దాంతో కాక్రోచ్ సంబరాలు అంబరాన్ని అంటాయి.
నిజానికి కాక్రోచ్ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వం మొదట తేలికగా తీసుకున్నట్లుగా ఉంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కొన్ని వందలమంది దేశ యువతకు ప్రతినిధులుగా కేంద్రం ఆలోచించలేకపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల ఇంటర్‌నెట్ బంద్ చేశారంటే, 18 మెట్రో రైల్వేస్టేషన్‌లను బంద్ చేశారంటేనే ఈ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఇదంతా యువత స్వచ్చందంగా చేసిందే.
కొన్నేళ్ల క్రితం ఢిల్లీలో రైతుల ఆందోళన కుదిపేసింది. వారు కోరినట్లు కొన్ని చట్టాలను కేంద్రం ఉపసంహరించుకుంది. అయినా ఆనాడు సమర్థంగా హాండిల్ చేశామన్న భావన కేంద్ర పెద్దలకు ఉండి ఉండవచ్చు. ఆ పరిస్థితి వేరు. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితి వేరు. ఒక్కసారి యువతలో గూడుకట్టిన అసంతృప్తి ఎగసిపడితే, అది దేశ వ్యాప్తంగా పాకితే ఎంత ప్రమాదమో బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. అందులోనూ పలు ఇతర దేశాలలో యువత ఈ మధ్యకాలంలో ఎంతటి క్రియాశీలకపాత్ర పోషించి ప్రభుత్వాలే మారిపోయేలా చేసిందో ఇటీవలి చరిత్రే.
ఈ క్రమంలో పార్లమెంటు సమావేశాలలో సహజంగానే విపక్షం దీనిని ప్రధాన అస్త్రంగా మార్చుకుంది. మంత్రి ప్రధాన్ రాజీనామాకు విపక్షం కూడా పట్టుబట్టింది. ఎప్పుడో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం సంచలనం అయింది. తర్వాతకాలంలో కొందరు కేంద్ర మంత్రులు వివిధ కారణాలతో రాజీనామాలు చేయకపోలేదు. రైల్వే ప్రమాదాల కారణంగానే నితీష్ కుమార్, మమత బెనర్జీ వంటివారు రాజీనామా చేశారు. విమాన ప్రమాదం జరిగినప్పుడు మాధవరావు సింధియా రాజీనామా చేశారు. ఉగ్రదాడికి బాధ్యత వహిస్తూ శివరాజ్ పాటిల్ పదవి నుంచి తప్పుకున్నారు.
అలాగే, ఆయా స్కామ్‌ల ఆరోపణలపై దయానిది మారన్, ఎ.రాజా తదితరులు రాజీనామా చేశారు. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్‌కు బాధ్యత వహిస్తూ అప్పటి విద్యా మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు రాజీనామా చేశారు. క్యాబినెట్ ఎజెండాను లీక్ చేశారన్న కారణంగా 31 మంది మంత్రుల నుంచి ఎన్టీరామారావు రాజీనామాలు తీసుకున్నారు. చంద్రబాబు టైమ్‌లో వివిధ ఆరోపణలు వచ్చినా ఆయన నైతిక బాధ్యత వహించడానికి సిద్దపడలేదు. గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట కారణంగా 29 మంది మరణిస్తే, చంద్రబాబు ఎదురు బుకాయించారు తప్ప బాధ్యత తీసుకోలేదు. పూరి జగన్నాథ రథయాత్రలో జరగలేదా? కుంభమేళాలో జరగలేదా? రోడ్డు ప్రమాదాలలో మరణించడం లేదా అంటూ డబాయించారు. ఆ ఘటనలో ఒక్క కానిస్టేబుల్‌పై కూడ కేసు రాకపోవడం చిత్రంగానే అనిపిస్తుంది.
తిరుమలలో 20 మంది తమిళ కూలీలు ఎన్ కౌంటర్‌కు గురి కావడం వివాదాస్పదం అయినా, అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది పడలేదు. అవన్ని ఎందుకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయినా, ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసే లేకుండా చేసుకోగలిగారు. ఒకప్పుడు చెన్నారెడ్డి ప్రభుత్వంలో హౌసింగ్ స్కామ్ జరిగితే అప్పటి మంత్రి కోనేరు రంగారావుతో రాజీనామా చేయించారు. తదుపరి ఆ ఆరోపణలు రుజువు కాలేదని తిరిగి మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు డీఎస్సీ అక్రమాలకు వైఎస్సార్‌సీపీ ఎన్నో ఆధారాలు చూపి సీబీఐ విచారణ కోరుతోంది. వాటికి చంద్రబాబు లేదా లోకేష్ ఎక్కడా నేరుగా జవాబు ఇవ్వలేదు. టీడీపీ ఇతర నేతలతో ఎదురుదాడి చేయించారు.
ఈ నేపథ్యంలో డీఎస్సీ అక్రమాలపై ఉద్యమించాలని వైఎస్సార్‌సీపీ తలపెట్టింది. దీనికి యువత కూడా తోడైతే అది సీరియస్‌గా మారవచ్చు. అయితే వారిని అణచివేయడానికి చంద్రబాబు సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇది ఏ రూపు దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. కాకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా లోకేష్‌పై ఒత్తిడి పెంచుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యమం చేసిన కాక్రోచ్ యువతపై కక్ష కట్టకుండా ఉండాలని ఆశిద్దాం. ఏది ఏమైనా కాక్రోచ్‌లే కదా అని తేలికగా చూడరాదన్న విషయం అర్థం అవుతోంది కదా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


