శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఒక పోలీసు కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. అమర్‌నాథ్ యాత్ర భద్రతా విధుల్లో భాగంగా మోహరించిన పోలీసుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఉగ్రదాడి జరిగింది. బుధవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటల సమయంలో అనంతనాగ్‌లోని లాల్ చౌక్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమర్‌నాథ్ యాత్ర భద్రతా విధుల్లో ఉన్న పోలీసు పార్టీపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు.
ఈ కాల్పుల ఘటనలో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ ఖురేషీ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను అనంతనాగ్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదులకోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.


