న్యూఢిల్లీ: ఢిల్లీలో వీధి కుక్కల సమస్య తీవ్రరూపం దాల్చడంతో ఢిల్లీ హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకుంది. జాతీయ రాజధానిలో వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలును పర్యవేక్షించేందుకు హైకోర్టు సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యంను ప్రారంభించింది. ఈ అంశంపై జూలై 31 నాటికి సమగ్ర నివేదికను సమర్పించాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్,కేంద్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ సమస్య ప్రజాసమస్యగా మారిందని ధర్మాసనం పేర్కొంది. నగరంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని వ్యాఖ్యానించిన న్యాయస్థానం.. ఢిల్లీ హైకోర్టు ప్రాంగణంలో కూడా కుక్కలు సంచరిస్తున్నాయని చెబుతూ సమస్య తీవ్రతను గుర్తుచేసింది. జంతు సంక్షేమం, ప్రజల రక్షణ మధ్య సమతుల్యత పాటించాలని ధర్మాసనం నొక్కిచెప్పింది. పెరుగుతున్న వీధి కుక్కల దాడుల ఘటనల వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు పేర్కొంది. అదే సమయంలో, తీసుకునే ఏ చర్యయినా జంతు సంక్షేమ చట్టాలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. వీధి కుక్కల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇటీవల జారీ చేసిన ఆదేశాల అమలుకు సంబంధించి పూర్తి వివరాలను హైకోర్టు కోరింది.


