దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితురాలు సోనమ్‌కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఆమె బెయిల్‌ను గురువారం రద్దు చేస్తూ ఆదేశాలు వెలువరించింది. అంతేకాదు.. మూడు వారాల్లోగా ట్రయల్ కోర్టు ఎదుట లొంగిపోవాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆమె బెయిల్‌పై సుప్రీం కోర్టు ఇదివరకే అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఇండోర్‌కు చెందిన సోనమ్ రఘువంశీ.. 2025 మేలో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లింది. అక్కడే వీరిద్దరూ అదృశ్యం కాగా.. కొద్ది రోజుల తర్వాత రాజా మృతదేహం ఓ లోయలో లభ్యమైంది. దర్యాప్తులో భాగంగా రాజా హత్య వెనుక సోనమ్ కుట్ర ఉందని పోలీసులు అనుమానించారు. తన తండ్రి దగ్గరే పని చేసే ప్రియుడి రాజ్ కుశ్వాహాతో కలిసి ఆమె ప్లాన్ వేసినట్లు గుర్తించారు. ఈ ఇద్దరూ.. సుపారీ గ్యాంగ్‌తో కలిసి రఘువంశీని హత్య చేసినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి.
బెయిల్ ఎలా వచ్చింది?
ఈ కేసులో సోనమ్‌కు షిల్లాంగ్ ట్రయల్ కోర్టు ఏప్రిల్‌లో బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు సమయంలో నిబంధనల ప్రకారం కారణాలు సరిగ్గా తెలియజేయలేదన్న సాంకేతిక అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం మేఘాలయ హైకోర్టు కూడా ఆ బెయిల్ ఉత్తర్వులను సమర్థించింది. అయితే, బెయిల్ మంజూరును సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అరెస్టు మెమోలోని తప్పు కేవలం టైపింగ్ లేదా క్లరికల్ పొరపాటు మాత్రమేనని, దాని ఆధారంగా బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వం వాదించింది.
విచారణకు ఆటంకం కలిగే అవకాశం
జస్టిస్ ఎంఎం సుంద్రేశ్, జస్టిస్ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి.. ప్రస్తుత దశలో సోనమ్ బెయిల్‌పై బయట ఉండటం న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. విచారణ వేగంగా కొనసాగకపోతే ఆరు నెలల తర్వాత ఆమె మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.
సోనమ్ వాదన
తనపై అభియోగాలను సోనమ్ ఖండించింది. తాను నిర్దోషినని, కేసు పూర్తిగా పరిస్థితుల ఆధారిత సాక్ష్యాలపైనే ఆధారపడి ఉందని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. కేవలం ఆరోపణల ఆధారంగా తనను దోషిగా చూడలేమని కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా.. బెయిల్‌ను రద్దు చేస్తూ మూడు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో మేఘాలయా హనీమూన్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.


