న్యూఢిల్లీ: గతేడాది మేఘాలయలో హనీమూన్ సమయంలో భర్తను చంపించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. జైలు అధికారుల ఎదుట లొంగిపోయి, ఈ కేసు విచారణను ఎదుర్కోవాలని సూచించింది. వ్యాపారవేత్త రాజా రఘువంశీని చంపినట్లు ఆరోపణలున్న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సోనమ్‌ను గతేడాది జూన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆమెకు బెయిలిస్తూ మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మేఘాలయ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలేల ధర్మాసనం విచారణ చేపట్టింది.
‘మీ ప్రవర్తనను మీరు ఎలా సమరి్థంచుకుంటారు? మీరు భర్తతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్లారు. అక్కడే అతడిపై దాడి జరిగింది. అతడు మరణించాడు. అప్పుడు, ఆ తర్వాత మీరేం చేశారు? ఇది ప్రాథమికంగా ఉత్పన్నమయ్యే ప్రశ్న. అరెస్ట్‌కు కారణాలేంటని మీరు మొదట్లోనే పోలీసులను అడిగారా?..ఇది రెండో ప్రశ్న’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘పిటిషన్‌లో పేర్కొన్న ఆధారాలను బట్టి తగు ఆదేశాలు జారీ చేయడం లేదా నిందితురాలు సోనమ్‌ను లొంగిపోయి విచారణను ఎదుర్కోవాలని ఆదేశించడం గానీ చేస్తాం. వీటికి సిద్ధపడి రండి..’అంటూ సోనమ్ తరఫు లాయర్‌తో వ్యాఖ్యానించిన ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.


