వాషింగ్టన్: 74 సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన పాన్ యామ్ విమాన శకలాలు అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపించాయి. 1952లో ప్యూర్టో రికో తీరంలో 69 మంది ప్రయాణికులతో కూలిపోయిన ఈ విమాన ఆచూకీని ఎయిర్ సీ హెరిటేజ్ ఫౌండేషన్ గుర్తించింది. అట్లాంటిక్ మహాసముద్రంలో దాదాపు 2,000 అడుగుల లోతులో ఈ శకలాలు రెండు పెద్ద భాగాలుగా చీలిపోయి ఉన్నట్లు జూన్ 2న తాము కనుగొన్నట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆ సంస్థ వెల్లడించింది.
అధునాతన హై-రిజల్యూషన్ సోనార్, అటానమస్ అండర్ వాటర్ వెహికల్ (సముద్ర అంతర్భాగ వాహనం) సహాయంతో ఈ విమానాన్ని కనుగొన్నారు. ఈ ప్రమాదంలో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విమాన అన్వేషణ కోసం డిస్కవరీ ఛానెల్‌కి చెందిన ‘ఎక్స్‌పెడిషన్ అనౌన్’, ‘డీప్ సీ విజన్’ సంస్థలు గతంలో ఎన్నో ఏళ్లుగా శ్రమిస్తూ వచ్చాయి.
‘క్లిప్పర్ ఎండీవర్’ పేరుతో న్యూయార్క్ నగరానికి బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్లు విఫలమవడంతో పైలట్ సముద్రంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, ఆ తర్వాత ప్రయాణికులను ఎలా రక్షించాలనే దానిపై సరైన సమాచారం, సమన్వయం లేకపోవడం, భాషా సమస్యల కారణంగా తీవ్ర గందరగోళం చెలరేగింది. విమానంలో నీరు చేరి కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే అది మునిగిపోయింది.
ఈ విషాద ఘటనే నేడు విమానాలలో మనం చూస్తున్న భద్రతా ప్రమాణాలకు పునాది వేసింది. విమానం టేకాఫ్ అయ్యే ముందు ఫ్లైట్ అటెండెంట్లు ప్రదర్శించే సేఫ్టీ బ్రీఫింగ్స్ అప్పట్లో ఈ ప్రమాదం తర్వాతే ప్రారంభమయ్యాయి. సివిల్ ఏరోనాటిక్స్ బోర్డు దీనిని తప్పనిసరి చేసింది.
ఎయిర్ సీ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రస్ మాథ్యూస్ పాత ప్రమాద నివేదికలను పరిశోధించి, 2019లో శాన్ జువాన్ తీరంలో పలు సర్వేలు నిర్వహించడంతో ఈ అన్వేషణ మళ్లీ ఊపందుకుంది. ‘ఎక్స్‌పెడిషన్ అనౌన్’ బృందంతో కలిసి చేసిన అన్వేషణలో కీలక క్లూస్ లభించాయి. యూఎస్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లు తయారు చేసిన మ్యాప్ ఆధారంగా, రీసెర్చ్ వెసెల్ సహాయంతో అండర్ వాటర్ డ్రోన్‌ను ఉపయోగించి మొదటి ప్రయత్నంలోనే ఈ శకలాలను గుర్తించారు. ఈ ఫొటోలలో పాన్ అమెరికన్ లోగో, విమానం పేరు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


