గగన్‌యాన్ మిషన్ కోసం డీఆర్‌డీవో(DRDO)కు చెందిన డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (DFRL) అనేక అంతరిక్షం కోసం భారతీయ వంటకాలను సిద్ధం చేసినప్పటికీ, కఠిన పరీక్షల తర్వాత కేవలం మూడింటిని మాత్రమే తీసుకెళ్లినట్టు భారత వ్యోమగామి శుభాంషు శుక్లా తాజాగా వెల్లడించారు.
రాజ్ షమానీ పాడ్‌కాస్ట్‌లో శుక్లా మాట్లాడుతూ.. భారత గగన్‌యాన్ మిషన్ కోసం ఆహారాన్ని తయారుచేస్తున్న డీఆర్‌డీవో ల్యాబ్ అంతరిక్షం కోసం అనేక భారతీయ వంటకాలతో పెద్ద మెనూనే సిద్ధం చేసిందని తెలిపారు. అయితే అత్యంత కఠినమైన పరీక్షల తర్వాత కేవలం మూడు వంటకాలు మాత్రమే అంతరిక్ష ప్రయాణానికి అర్హత సాధించాయన్నారు. ముఖ్యంగా గాజర్ కా హల్వా, మూంగ్ దాల్ హల్వా, ఆమ్‌రస్‌కు (మామిడి జ్యూస్) మాత్రమే అంతరిక్ష ప్రయాణానికి అనుమతి లభించిందని శుక్లా చెప్పారు. గత ఏడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్ళినప్పుడు, శాస్త్రవేత్తలు అనుకున్నదానికంటే చాలా తక్కువ పరిమాణంలోనే మన దేశీయ రుచులను తనతో తీసుకెళ్లగలిగారు.
ఆహార పదార్థాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లడానికి ఆమోదం పొందడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. సొరకాయ/కూరగాయలు, కిచిడీ, పులావ్, ఇతర ప్రముఖ భారతీయ వంటకాలు ప్రాథమిక మెనూలో ఉన్నప్పటికీ ఆ వంటకాలు ఎంపిక కాకపోవడానికి సమయాభావమే ప్రధాన కారణమని శుక్లా వివరించారు.
అంతరిక్ష ఆహారానికి ఉండే కఠినమైన నిబంధనలు
అంతరిక్షంలోకి తీసుకెళ్లే ఆహారం ఫ్రిజ్ (Refrigeration) అవసరం లేకుండా నెలల తరబడి సురక్షితంగా, పౌష్టికంగా మరియు పాడవకుండా ఉండాలి.
రాకెట్ లాంచ్ సమయంలో వచ్చే తీవ్రమైన ప్రకంపనలను తట్టుకోవాలి.
జీరో గ్రావిటీ (Microgravity) వాతావరణంలో సురక్షితంగా తినేలా ఉండాలి.
గాలిలో తేలే చిన్న చిన్న మెతుకులు లేదా అదనపు తేమ ఉత్పత్తులు కాకూడదు (ఇవి స్పేస్ స్టేషన్ పరికరాలకు హాని కలిగిస్తాయి).
క్రిమిరహిత (Microbial safety) ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలి.
అయితే ఈ మూడు భారతీయ వంటకాలను కూడా శుక్లా తినలేకపోయారు. వాటన్నింటినీ అంతర్జాతీయ వ్యోమగాముల బృందం చాలా ఆస్వాదించడం విశేషం. "నా సహచరులందరూ ఈ వంటకాలను బాగా ఇష్టపడ్డారు. అంతరిక్షంలో ఆహారాన్ని అందరితో పంచుకోవడం కంటే గొప్ప విషయం ఏముంటుంది?" అని శుక్లా సంతోషం వ్యక్తం చేశారు.
అయినప్పటికీ, మిషన్ 13వ రోజు నాటికి తనకు ఇంటి వంటల రుచులు బాగా గుర్తొచ్చాయని శుక్లా ఒప్పుకున్నారు. జీరో గ్రావిటీ వల్ల శరీరంలోని ద్రవాలు తల వైపునకు చేరడంతో వ్యోమగాములకు ముక్కు దిబ్బడ వేసినట్లు అనిపిస్తుంది. దీనివల్ల రుచి, వాసన తెలిపే సామర్థ్యం తగ్గుతుంది. అంతేకాకుండా, వ్యోమగాముల ఆరోగ్యం కోసం నాసా (NASA) వారి ఆహారంలో ఉప్పు (Sodium) శాతాన్ని చాలా తక్కువగా ఉంచుతుంది.
ఇదీ చదవండి: వందే భారత్‌లో నాన్న ఫస్ట్ రైడ్... ఓ పుత్రుడి ఎమోషనల్ స్టోరీ
బాగా ఉప్పగా, కారంగా ఉండే ఆహారం తినాలనిపించింది. అందుకే ఫ్లైట్ సర్జన్‌కి ఫోన్ చేసి ఉప్పుగా ఉండేది ఏదైనా దొరుకుతుందా అని కూడా అడిగానని శుక్లా గుర్తుచేసుకున్నారు.ఆయన కోరిక మేరకు భూమిపై దిగిన వెంటనే, భారతీయ ఫ్లైట్ సర్జన్ బనానా చిప్స్, భాకర్వాడి (Bhakarwadi) లతో ఆయనకు స్వాగతం పలికారు. భవిష్యత్తులో జరగబోయే గగన్‌యాన్ మిషన్ వ్యోమగాములకు మరింత విస్తృతమైన, రుచికరమైన భారతీయ స్పేస్ ఫుడ్ మెనూని అందించడానికి DFRL కి ఈ అనుభవం ఎంతో ఉపయోగపడనుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: రూ. 20 లక్షలు ఖర్చు పెళ్లికి అవసరమా? నెట్టింట తీవ్ర చర్చ


