సౌరవ్యవస్థ కీలక సమాచారం చిక్కనుందా..? | New Horizons spacecraft ready to resume operations | Sakshi
Sakshi News home page

సౌరవ్యవస్థ కీలక సమాచారం చిక్కనుందా..?

Jul 9 2026 2:44 PM | Updated on Jul 9 2026 4:19 PM

New Horizons spacecraft ready to resume operations
  •  భూమికి 950 కోట్ల కిలోమీటర్ల 
  • దూరంలో నాసా వ్యోమనౌక. 
  •  సూర్యుడి బాహ్యవ్యవస్థపై పరిశీలన. 
  •  ఇక ‘టెర్మినేషన్ షాక్’ హద్దుపై అధ్యయనం.

‘న్యూ హొరైజన్స్’… అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 2006లో గ్రహాంతర అన్వేషణ కోసం ప్రయోగించిన వ్యోమనౌక. ప్రస్తుతం భూమికి 950 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్లూటో ఆవల దాదాపు ఏడాదిగా సుప్తావస్థలో ఉన్న ఈ ప్రోబ్ తాజాగా జాగృతమైంది. విశ్వంలో సుదూర ప్రయాణం చేసే ఇలాంటి వ్యోమనౌకలను అప్పుడప్పుడు నిద్రావస్థలోకి పంపుతుంటారు శాస్త్రవేత్తలు. వ్యోమనౌకలోని కొన్ని వ్యవస్థలు, పరికరాలను పనిచేయించడం నిలిపివేసి పవర్ ఆదా చేయడమే దీని ఉద్దేశం.

వ్యోమనౌక సుప్తావస్థలో ఉన్నప్పటికీ అందులోని కీలక పరికరాలు యథావిధిగా సమాచార సేకరణ కొనసాగిస్తూ, అధ్యయనం జరుపుతూనే ఉంటాయి. గత ఏడాది ఆగస్టులో నిద్రలోకి జారుకున్న ‘న్యూ హొరైజన్స్’, ప్రస్తుతం ‘మంచి ఆరోగ్యంతో’ మేల్కొన్నట్టు నాసా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యోమనౌక నుంచి భూమికి రేడియో సంకేతాలు అందడానికి 9 గంటలు పడుతోంది. నిద్ర మత్తు వదిలించుకున్న ‘న్యూ హొరైజన్స్’… గత 321 రోజులుగా తాను సేకరించిన డేటాను ఇక భూమికి ప్రసారం చేయనుంది. 

ప్లూటో, దాని చంద్రుళ్ల అధ్యయనం కోసం ప్రయోగించిన తొలి, ఏకైక మిషన్ ‘న్యూ హొరైజన్స్’. ఈ నౌక 2015లో ప్లూటోకు 12 వేల కిలోమీటర్ల దగ్గరగా వెళ్లి పరిశోధించింది. ఆ తర్వాత నాలుగేళ్లకు 2019 జనవరి 1న ప్లూటోకు 160 కోట్ల కిలోమీటర్ల ఆవల ఉన్నప్పుడు... సౌరకుటుంబంలో అత్యంత దూరంలో ‘క్యూపర్ బెల్ట్’లో ‘మంచు మనిషి’ ఆకారంలో ఉన్న గ్రహశకలం ‘అరాకోట్’ (2014MU69/అల్టిమా థూలే) చెంతకు వెళ్లి అధ్యయనం చేసింది. ఈ నౌక ప్రస్తుతం భూమి నుంచి ఏడాదికి 48 కోట్ల కిలోమీటర్ల వంతున దూరంగా వెళుతోంది.

బాహ్య హీలియోస్ఫియర్ ఉదజనిపై గురి!

‘న్యూ హొరైజన్స్’ వ్యోమనౌక మరో మూడు వారాల్లో సూర్యుడి ‘బాహ్య హీలియోస్ఫియర్’లోని హైడ్రోజన్ గురించి పరిశోధన నిర్వహించనుంది. సూర్యుడి నుంచి నిరంతరం అంతరిక్షంలోకి విడుదలయ్యే అత్యంత శక్తిమంతమైన ఆవేశపూరిత కణాల ప్రవాహాన్ని ‘సౌర గాలి’ (సోలార్ విండ్) అంటారు. ఈ సౌర పవనం- మన సౌరవ్యవస్థలోని గ్రహాలను కూడా దాటి అంతరిక్షంలో ఓ భారీ ప్లాస్మా బుడగ ఆకృతిలో ‘హీలియోస్ఫియర్’ను ఏర్పరుస్తుంది. సాగదీసిన అశ్రుబిందువులా కనిపించే హీలియోస్ఫియర్... హానికర కాస్మిక్ రేడియేషన్, నక్షత్రాంతర ధూళి నుంచి మన సౌరవ్యవస్థను ఓ రక్షణ కవచంలా కాపాడుతుంది. సౌరవ్యవస్థ అంచుల్లో బాహ్య హీలియోస్ఫియర్ ఉదజనిపై ‘న్యూ హొరైజన్స్’ చేపట్టబోయేది ఓ కొత్త తరహా పరిశోధన. బాహ్య సౌరవ్యవస్థకు, నక్షత్రాంతర రోదసి (ఇంటర్స్టెల్లార్ స్పేస్)కి సరిహద్దుగా ఉండే ప్రాంతాన్ని ‘టెర్మినేషన్ షాక్’ అంటారు. మన సూర్యుడి మాదిరిగానే పాలపుంతలోని ఇతర నక్షత్రాల నుంచి దూసుకొచ్చే ఆవేశిత కణాలను గెలాక్టిక్ రేడియేషన్ అంటారు.

ఈ ఆవేశిత కణాలతో కూడిన నక్షత్రాంతర మాధ్యమం (ఇంటర్స్టెల్లార్ మీడియం)ను సూర్యుడి బాహ్యవ్యవస్థ నిలువరించే సరిహద్దు ప్రాంతమే ‘టెర్మినేషన్ షాక్’. సూర్యుడి నుంచి గంటకు 30 లక్షల కిలోమీటర్ల ప్రచండ వేగంతో దూసుకొచ్చే సౌర గాలి ఈ ‘టెర్మినేషన్ షాక్’ హద్దును చేరుకోగానే నక్షత్రాంతర మాధ్యమ పీడనాన్ని ఎదుర్కొని వేగం కోల్పోతుంది. నక్షత్రాంతర మాధ్యమాన్ని ఢీకొని చివరికి ధ్వని వేగం కంటే కూడా తక్కువకు సౌర గాలి వేగం పడిపోతుంది. ‘టెర్మినేషన్ షాక్’ హద్దు వద్ద ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఇకపై శాస్త్రవేత్తలకు అవకాశం లభించనుంది. 11 ఏళ్ల పాటు కొనసాగే సౌరచక్రంలో సౌర గరిష్ఠం, సౌర కనిష్ఠం దశల సందర్భంగా ఉండే సూర్యుడి స్థితి ఆధారంగా పై హద్దులు వ్యాకోచిస్తూ, సంకోచిస్తూ మారుతుంటాయి. నాసా ప్రయోగించిన వోయేజర్-1, వోయేజర్-2 జంట వ్యోమనౌకలు 2012, 2018 సంవత్సరాల్లో హీలియోస్ఫియర్ దాటి ముందుకెళ్లాయి.

అయితే బాహ్య సౌరవ్యవస్థ అన్వేషణార్థం ప్రస్తుతం ‘న్యూ హొరైజన్స్’లో ఉన్న అధునాతన శాస్త్రీయ పరికరాలు వాటిలో లేవు. ‘న్యూ హొరైజన్స్’ 2029-2040 సంవత్సరాల మధ్య కాలంలో ‘టెర్మినేషన్ షాక్’ ప్రాంతాన్ని చేరుతుందని భావిస్తున్నారు. అది అందించే డేటా కోసం ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షరంగ భౌతిక శాస్త్రవేత్తలు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. జంట వోయేజర్స్ తర్వాత విశ్వంలో సౌరవ్యవస్థను దాటి ప్రయాణించబోతున్న మూడో మానవ నిర్మిత వస్తువు ‘న్యూ హొరైజన్స్’!

జమ్ముల శ్రీకాంత్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement