టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికేందుకు ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తామని, అవసరమైతే ఖర్గ్ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇరాన్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ క్రమంలో ఇరాన్, చైనా, రష్యా దేశాల మధ్య భూమార్గం ద్వారా జరిగే వ్యూహాత్మక వస్తు రవాణాకు కీలకంగా భావించే ఆక్ తఖే ఖాన్ రైల్వే బ్రిడ్జిని అమెరికా వైమానిక దళం క్షిపణి దాడి చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి.
ఇరాన్ ఉత్తర ప్రాంతంలోని గొలిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ రైల్వే వంతెన చైనా- తుర్క్‌మెనిస్తాన్-ఇరాన్ రైల్వే కారిడార్‌లో అత్యంత కీలకమైన భాగం. అమెరికా విధించిన ఆంక్షలు, ఇరాన్ సముద్ర రేవులపై ఉన్న పరిమితుల కారణంగా ఇరాన్, రష్యా, చైనా దేశాలు ఆయుధాలు, ముడి చమురు, ఇతర సరుకుల రవాణాకు ఈ ప్రత్యామ్నాయ రైలుమార్గాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఈ మూడు దేశాల ఆర్థిక, సైనిక సహకారాన్ని దెబ్బతీయాలనే వ్యూహంతోనే అమెరికా ఈ కీలక మౌలిక సదుపాయాన్ని లక్ష్యంగా చేసుకుని క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా ఈ దాడులకు పాల్పడినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికా హెచ్చరిక.. ఇరాన్ ప్రతిస్పందన
ఈ దాడిని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ధృవీకరించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, దెబ్బతిన్న రైలుమార్గాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. పౌర మౌలిక సదుపాయాలపై అమెరికా జరిపిన ఈ దాడి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన 'యుద్ధ నేరం' అని ఇరాన్ ఆరోపించింది. దీనికి ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో ఎయిర్‌రైడ్ సైరన్లు మోగాయి.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ‘ఇరాన్ మాపై చేసే ప్రతి దాడికి 20 రెట్లు తీవ్రంగా ప్రతిస్పందిస్తాం’ అని హెచ్చరించారు. వరుస పరిణామాలతో అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లతో పాటు క్రిప్టోకరెన్సీ మార్కెట్లలోనూ తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నాయి.


