breaking news
Strait of Hormuz
-
హార్ముజ్ మూసివేత గండం గడిచినట్లేనా?!
ఇరాన్‌పై ఇజ్రాయెల్ (israel) అమెరికాల(USA) యుద్ధం నేపథ్యంలో హార్ముజ్( Hormuz) జల సంధిని మూసివేస్తామని ఇరాన్ (Iran)ప్రకటించడం కలకలం రేపింది. దీనికి ఎందుకంత ప్రాధాన్యం? ఇది ఇరాన్‌కు ఉత్తర భాగంలో, ఒమన్, యూఏఈ దేశాలకు పశ్చిమ భూభాగంలో ఉంటుంది. ఈ జలసంధి ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో 50 కి.మీ. వెడల్పుతో ఉంటుంది. లోతు చాల ఎక్కువగా ఉండి పెద్ద రవాణా నౌకలు కూడా ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ఇది గల్ఫ్ దేశాలను అరేబియా సముద్రానికి అనుసంధానిస్తుంది. హార్ముజ్ జలసంధి ద్వారా ఒక్క ఇరాన్ కాకుండా ఇంకా గల్ఫ్ దేశాలైన ఇరాక్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈలు కూడా ఆయిల్ సరఫరా చేస్తుంటాయి. అమెరికాలోని ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ అంచనా ప్రకారం 2023లో ఈ జలసంధి ద్వారా 2 కోట్ల బారెళ్ల క్రూడ్ ఆయిల్‌ని ఆ యా గల్ఫ్ దేశాలు సరఫరా చేశాయి. దీని విలువ సుమారు 600 బిలియన్ల డాలర్లు. ఇది ఒక్క ఏడాదిలో జరిగిన ఆయిల్ సరఫరా విలువ.యూకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ డైరెక్టర్ సర్ అలెక్ యూన్గర్ అంచనా ప్రకారం ఈ జలసంధిని మూసివేయడం వల్ల ఆయిల్ రేట్లు అంచనాకు మించి పెరిగే అవకాశముంటుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావి తమవుతాయి. ఈ జలసంధి ద్వారా ముఖ్యంగా ఆసియా దేశాలకు ఆయిల్ సరఫరా అవుతోంది. చైనా దిగుమతి చేసుకొనే 90% ఆయిల్ ఒక్క ఇరాన్ నుంచే సప్లై అవుతుంది. ఇండియా 60% క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటోంది. దక్షిణ కొరియా 60%, జపాన్ ఉపయోగించే ఆయిల్లో మూడొంతులు ఈ జలసంధి ద్వారానే దిగుమతి అవుతోంది. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియాలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల ధరలూ దీని మూసివేత వల్ల బాగా పెరిగే అవకాశంఉంటుంది. ఈ దేశాల వస్తువులు ఒక్క అమెరికానే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు వాడటంతో అంతటా ద్రవ్యోల్బణం పెరిగి పోతుంది. అయితే ప్రస్తుతం యుద్ధం ఆగిపోయింది కనుక హార్ముజ్ మూసివేత నిర్ణయాన్ని విరమించినట్టు వస్తున్న వార్తలు నిజమైతే అదే పదివేలు! – డా.కొండి సుధాకర్ రెడ్డి లెక్చరర్ -
ఇరాన్ ఎఫెక్ట్.. భారత్‌కు గ్యాస్ సిలిండర్ టెన్షన్!
ఢిల్లీ: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మన వంటింట్లో గ్యాస్ బాంబ్ పేలి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జల సంధి మూత పడితే భారత్‌కు ఎల్పీజీ స్ట్రోక్ తగిలే ప్రమాదం ఉంది. వంట గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశముంది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్‌లు ఉన్నట్టు సమాచారం. దీంతో, గ్యాస్ టెన్షన్ మొదలైంది.ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల కారణంగా ప్రపంచ దేశాలపై మరో భారం పడనుంది. వంట గ్యాస్ సిలిండర్ మరింత భారం కానుంది. హర్మూజ్ జల సంధి మూత పడితే భారత్‌కు ఎల్పీజీ కష్టాలు రానున్నాయి. ప్రస్తుతానికి ఎల్పీజీ అవసరాల్లో భారత్‌కు అధిక శాతం పశ్చిమాసియా నుంచే దిగుమతి జరుగుతోంది. దేశంలో 60 శాతం గ్యాస్ దిగుమతుల ద్వారానే వస్తోంది. సౌదీ, యూఏఈ, ఖతార్ నుంచి భారత్‌కు 95 శాతం ఎల్పీజీ దిగుమతులు జరుగుతున్నాయి.మూడింట రెండు అటు నుంచే..దేశంలో వాడే ప్రతీ మూడు వంట గ్యాస్ సిలిండర్లలో రెండు పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకున్నవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్‌కు ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశీయ అవసరాలకు మన వద్ద 15-16 రోజుల వరకే రిజర్వ్‌లు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మూతపడితే గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలగనుంది. ఇదే సమయంలో మరో విధంగా గ్యాస్ సరఫరా చేసుకుంటే ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.ఎరువులపై ప్రభావం.. మరోవైపు.. హర్మూజ్ జలసంధి ప్రభావం ఇటు వ్యవసాయ రంగంపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎరువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్లో అధిక మొత్తంలో అమ్మోనియా దొరుకుతుంది. పలు దేశాలకు ఇరాన్ నుంచే అమ్మెనియా ఎగుమతులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ నుంచి అమ్మెనియా ఆగిపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చమురు నిల్వలు ఓకే.. ఇదిలా ఉండగా.. అమెరికా దాడికి నిరసనగా హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అయితే, తుది నిర్ణయానికి అత్యున్నత భద్రతా సంస్థ ఆమోదం అవసరం. పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే ఈ ఇరుకైన మార్గం ద్వారా ప్రపంచంలో పెద్ద చమురు వ్యాపారం జరుగుతుంది. అలాంటి దీన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగనున్నాయి. అయితే, భారత్‌లో కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అందుబాటులో ఉన్నది. భారత్ అనేక మార్గాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటుందని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.రష్యా నుంచి..భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారు కాగా.. గ్యాస్ దిగుమతిలో నాలుగో స్థానంలో ఉన్నది. ప్రభుత్వం రెండు వారాలుగా పశ్చిమాసియా పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని.. ప్రధాని మోదీ నాయకత్వంలో గత కొన్ని సంవత్సరాలుగా సరఫరాను వైవిధ్యంలో తీసుకువచ్చామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఇప్పుడు హర్మూజ్ జలసంధి నుంచి ఎక్కువగా తీసుకురావడం లేదని పేర్కొన్నారు. భారత్ మొత్తం రోజుకు 55లక్షల బ్యారెల్స్ చమురు దిగుమతి (BPD)లో దాదాపు 20 లక్షల బ్యారెల్స్ మాత్రమే ఈ జలసంధి ద్వారా వస్తున్నది.అయితే, గతకొన్ని సంవత్సరాలుగా రష్యా, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల నుంచి చమురు సరఫరాను పెంచింది. రష్యా నుంచి వచ్చే చమురు హర్మూజ్ మార్గం ద్వారా రాదు. ఇది సూయజ్ కాలువ.. కేప్ ఆఫ్ గుడ్ హోప్.. పసిఫిక్ మహాసముద్రం ద్వారా వస్తుంది. యూఎస్, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి సరఫరా ఖరీదైనప్పటికీ ఆచరణీయమైన ఎంపికగా మారాయని.. ఇంధన సరఫరా స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. -
ఇరుకున పడ్డ ఇరాన్!
అగ్రరాజ్యం అమెరికా సైతం తమపై కత్తికట్టడంతో ఇప్పుడు ఇరాన్ తాడోపేడో తేల్చుకోవాల్సిన తరుణమొచ్చింది. అయితే ఈ కష్టకాలంలో కాడెత్తేయకుండా కడదాకా తమకు తోడుగా నిలిచే నిజమైన నేస్తలెందరో ఇప్పుడు ఇరాన్ లెక్కబెట్టుకుంటోంది. యుద్ధంలో పైచేయి సాధించేందుకు పనికొచ్చే ప్రత్యామ్నాయాలు ఎన్ని ఉన్నాయో బేరీజువేసుకుంటోంది. ఇజ్రాయెల్, అమెరికాలకు దీటుగా చైనా, రష్యా ఏమేరకు తనకు సైనిక సాయం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇస్తాయోనని ఇరాన్ సమీక్ష జరుపుతోంది. హోర్ముజ్ జలసంధి మీదుగా చమురు నౌకల రాకపోకలను అడ్డుకుంటే తనకు ఒనగూరే లాభమెంతో లెక్కేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇరాన్ ముందు ఆప్షన్లు ఎన్ని అనే అంశం ప్రధానంగా అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. హోర్ముజ్ జలసంధిని ఆపేస్తే?సముద్రం ద్వారా రావాణా అయ్యే చమురులో దాదాపు 25 శాతం ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే సరఫరా అవుతోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుండే ఈ జలమార్గం గుండా చమురు, సహజవాయువు రవాణా నౌకలను అడ్డుకుంటే ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల మంటలు పైకి ఎగిస్తే ప్రపంచార్థికం దెబ్బతినడం ఖాయం. ఈ భయాలను బూచిగా చూపి తమపై దాడులను ఆపాలని అమెరికా, ఇజ్రాయెల్ కూటమి దేశాలను ఇరాన్ హెచ్చరించే వీలుంది. వేగంగా దూసుకెళ్లే బోట్ల ద్వారా వేలాదిగా మెరైన్ మైన్(సముద్ర మందుపాతర)లను జలసంధి మార్గంలో ఇరాన్ మొహరించిందనే వార్తలు వెలువడ్డాయి. వీటిలో నిజమెంతో ఎవరికీ తెలీదు. అదే నిజమైతే నౌకలు అటు వెళ్లేందుకు వణుకుతాయి. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ముప్పేట దాడి?అమెరికా భూభాగం నుంచి నేరుగా దాడులు చేయడం కష్టం. పశ్చిమాసియాలో దశాబ్దాలుగా తిష్టవేసి ఏర్పాటుచేసుకున్న సమీప స్థావరాల నుంచే అమెరికా దాడిచేయగలదు. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈలోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ మెరుపుదాడులు చేసి ప్రతిదాడులను నిలువరించవచ్చు.ఈ భయంతోనే అమెరికా ఇప్పటికే ఒకటి, రెండు స్థావరాల నుంచి యుద్ధవిమానాలను వేరేచోటుకు తరలించినట్లు ప్రైవేట్ శాటిలైట్ తాజా చిత్రాలతో స్పష్టమైంది. అమెరికా గడ్డపై తమ మద్దతుదారుల ద్వారా పేలుళ్లు జరిపి మారణహోమం సృష్టించే ఛాన్సుంది. అందుకే ఈ విషయంలో అమెరికా ఇప్పటికే అప్రమత్తమై పలు ప్రధాన ప్రాంతాల్లో నిఘాను కట్టుదిట్టంచేసిందని వార్తలొచ్చాయి.పెంచిపోషించిన సాయుధ సంస్థల సాయంతో..గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా, యెమెన్‌లో హౌతీ రెబల్స్, ఇరాక్‌లో మిలీషియా సంస్థలకు ఆర్థిక, ఆయుధసాయం చేసి ఇరాన్ తన పరోక్ష సైన్యంగా తీర్చిదిద్దుకుంది. వీటిని ఒకరంగా ప్రతిఘటన దళంగా పేర్కొంటారు. అయితే 20 నెలలుగా ఇజ్రాయెల్‌తో పోరాడి హమాస్ తన అగ్రనాయకత్వాన్ని కోల్పోయి ఒకరకంగా అలసిపోయింది. హెజ్బొల్లా ఉగ్రసంస్థ పోరాడే వీలుంది. ఇరాన్‌తో కలిసి నడుస్తామని మూడ్రోజుల క్రితమే హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఎర్రసముద్రంలో విదేశీ చమురు నౌకలు అడ్డుకుంటామని చెప్పారు. ఇరాక్‌లోని మిలీషియా సంస్థలు ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే మిలీషియాలు, హౌతీలకు డ్రోన్లు, చిన్నపాటి క్షిపణులను ప్రయోగించడంలో నైపుణ్యముంది. వీళ్లు ఇరాన్‌కు తోడు నిలిచే అవకాశముంది.చైనా, రష్యాల పరోక్ష సాయంచైనా ఇప్పటికే కొన్ని చమురునౌకల ముసుగులో కొన్ని ఆయుధాలను ఇరాన్‌కు తరలించి సాయపడినట్లు తెలుస్తోంది. యుద్దం తీవ్రతరమైతే తమ చిరకాల మిత్రుడు ఇరాన్‌కు సాయంగా రష్యా, చైనాలు ముందడుగు వేసే వీలుంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులను ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ తప్పుబట్టారు. ఈ విషయమై ఇటీవలే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పుతిన్ ఫోన్లో మాట్లాడారు.అణుకార్యక్రమం ఆగకపోవచ్చా?యురేనియం శుద్ది కర్మాగారాలపై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి, బాంబు దాడులు ఇరాన్‌ను అణ్వాయుధం తయారుచేయకుండా మరికొన్ని వారాలు, నెలలు అడ్డుకో గలవుగానీ శాశ్వతంగా ఆపలేవని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. న్యూక్లియర్ సెంటర్లలోకాకుండా వేరేచోట్ల యురేనియంను నిల్వచేస్తే అమెరికా, ఇజ్రాయెల్‌ల పరిస్థితి ఏంటనే అంశం తెరమీదకొచ్చింది. తన దేశ ఉనికి, అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితే వస్తే ఇరాన్ ఎంతకైనా తెగిస్తుందనే విశ్లేషణల నడుమ ఈ సమరం ఏ దిశలో పయనిస్తుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇరాన్ అన్నంత పని చేసింది.. ప్రపంచ దేశాలపై ప్రభావం!
టెహ్రాన్: గత కొన్ని రోజులు హార్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ చెబుతూ వస్తున్న ఇరాన్.. అన్నంత పని చేసింది. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు తాజాగా స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధి మూసివేతకు ఆ దేశ పార్లమెంట్ ఆమోద ముద్ర వేయడంతో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా దాడుల తర్వాత ఓపిక నశించిన ఇరాన్ ఇక హార్ముజ్ జలసంధి మూసివేతే లక్ష్యంగా పావులు కదిపింది. దీనికనుగుణంగా పార్లమెంట్ ద్వారా ఆమోద ముద్ర వేయించుకున్న ఇరాన్.. ప్రపంచ దేశాలకు ఎంతో కీలకమైన ఆ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అయితే, ఇరాన్ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనుంది.భారత్‌పై చమురు దిగుమతుల ప్రభావంహార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తున్నట్లు ప్రకటించిన తరుణంలో చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలపై అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్‌కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి!. ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్‌తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపులో ఉండదు. అయితే భారత్ ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టింది. అమెరికా, రష్యాల నుంచి చమురు నిల్వలు దిగుమతి పెంచేందుకు భారత్ అడుగులు వేస్తోంది. ఏది ఏమైనా ఇరాన్ నిర్ణయంతో ప్రపంచ దేశాలు చమురు కోసం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువ. -
ఇరాన్ దూకుడు.. అమెరికా నౌకలు, హార్ముజ్ జలసంధిపై సంచలన నిర్ణయం!
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది. అమెరికా దాడులకు ఆగ్రహంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేసింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం, టెలీ అవీవ్, ఇతర ప్రాంతాలను టార్గెట్‌గా ఇరాన్ భారీ క్షిపణుల వర్షం కురిపించింది. దీంతో, టెలీ అవీవ్ సహ దాదాపు 400 ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. మరోవైపు.. తమపై దాడి చేసి అమెరికా అతి పెద్ద నేరం చేసిందని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఫోర్డో అణుకేంద్రంపై అమెరికా బాంబు వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా హెచ్చరించింది. దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని.. తాము అంతం చేస్తామని సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి.. అమెరికా అతి పెద్ద నేరం చేసిందని.. ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న యూఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్‌ను మీడియా ఛానెల్ ప్రసారం చేసింది.ఇజ్రాయెల్‌లో ఎమర్జెన్సీ..మరోవైపు.. అమెరికా దాడుల తర్వాత ఇజ్రాయెల్‌ను టార్గెట్ చేసి ఇరాన్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిసైల్స్‌తో ఇరాన్ దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో భారీ పేలుడు సంభవించింది. మధ్య ఇజ్రాయెల్‌లోని నివాస ప్రాంతాలు ఇరాన్ తాజా క్షిపణి దాడిలో ధ్వంసమయ్యాయి. ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు కనీసం 30 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం జరిగినట్టు సమాచారం. ఇళ్లు, పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. దీంతో, ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేసింది. జూన్ 27వ తేదీ వరకు ఇజ్రాయెల్ విమాన సర్వీసులను రద్దు చేసింది.There are close to 50 large oil tankers scrambling to leave the Strait of Hormuz right now. Looks like the oil industry is expecting the Strait to be blockaded in the coming days. pic.twitter.com/ymaJRcax3x— Spencer Hakimian (@SpencerHakimian) June 22, 2025'హార్ముజ్ జలసంధి' మూసివేత!ఇదిలా ఉండగా.. అమెరికా నావికాదళ నౌకలపై క్షిపణి దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు పిలుపునిచ్చారు. ఇక, ఎర్ర సముద్రంలోని అన్ని అమెరికన్ నౌకలు, యుద్ధనౌకలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ అనుకూల ఉగ్రవాద హౌతీలు ప్రకటించారు. కొన్ని గంటల్లోనే 'హార్ముజ్ జలసంధి'ని మూసివేయనున్న ఇరాన్ నావికాదళం తెలిపింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. అయితే, ఇరాన్ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలలో పెరుగుదలకు దారితీయనుంది. 🚨⚡BREAKING AND UNUSUALBrigadier General Tangsiri, Commander of the IRGC Navy:The Strait of Hormuz will be closed within a few hours. pic.twitter.com/ca1cYFwvvf— RussiaNews 🇷🇺 (@mog_russEN) June 22, 2025 భారత్‌పై ఎఫెక్ట్.. ఇరాన్ కనక ఈ జలసంధిని మూసేసిందంటే.. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్‌కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి!. ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్‌తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపు తప్పుతుంది. -
అదే జరిగితే పెట్రోల్, డీజిల్ రేట్లకు రెక్కలే!
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంతో ముడిచమురు రేట్లు భగ్గుమన్నాయి. యుద్ధం మొదలైన గత శుక్రవారం నాడు (జూన్ 13న) ఒకే రోజున ఏకంగా 11 శాతం ఎగిసింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ రేటు ఎకాయెకిన 70.50 డాలర్ల నుంచి 78.50 డాలర్లకు పెరిగి, ఆరు నెలల గరిష్టానికి చేరింది. వారం రోజులుగా ఆ గరిష్ట స్థాయిలోనే తిరుగుతోంది.యుద్ధం ఇదే విధంగా కొనసాగి, చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ గానీ మూసివేస్తే ముడి చమురు రేట్లు 120–130 డాలర్ల వరకు కూడా ఎగిసే అవకాశం ఉందని అంచనాలు నెలకొన్నాయి. ఒకవేళ అదే జరిగితే, దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లకూ రెక్కలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశం ఇరాన్ నుండి నేరుగా చమురు దిగుమతి చేసుకోకపోయినా, మధ్యప్రాచ్య స్థిరత్వం ప్రభావం భారతీయ మార్కెట్‌పై పడుతుంది.పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలుపుతూ హర్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన చమురు రవాణా కేంద్రాలలో ఒకటిగా ఉంది. ఇది ఇరాన్, ఒమన్ మధ్య ఇరుకైన జలమార్గం. పర్షియన్ గల్ఫ్ నుండి ముడి చమురు ఎగుమతుల్లో 85% కంటే ఎక్కువ దీని ద్వారా వెళుతుంది. 2024లో ఈ జలసంధి రోజుకు సగటున 20 మిలియన్ బ్యారెల్స్ ప్రవాహాన్ని చూసింది. ఇది ప్రపంచ పెట్రోలియం వినియోగంలో ఐదవ వంతు. ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకోవడం గానీ, ఏదైనా అంతరాయం జరిగితే చమురు కొరత తీవ్రమై ధరల పెరుగుదలకు దారితీస్తుంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ మార్గం గుండా వెళ్ళే చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నందున, సరఫరాలో అంతరాయాల వల్ల ఈ దేశాలు ఏదైనా ఎక్కువగా ప్రభావితమవుతాయి. -
హర్మూజ్ జలసంధి మూతపడితే...???
ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. వారం రోజుల పరస్పర క్షిపణి దాడుల తరువాత ఇరుదేశాలిప్పుడు పైచేయి కోసం కొత్త ఎత్తుగడలు పన్నుతున్నాయి. జోక్యం చేసుకోవాలని ఒకవైపు ఇజ్రాయెల్ అమెరికాను రెచ్చగొడుతూంటే.. ఇరాన్ హర్మూజ్ జలసంధిని దిగ్బంధం చేయడం ద్వారా సమస్యను అంతర్జాతీయ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఏమిటీ హర్మూజ్ జలసంధి? దాన్ని మూసేస్తే ప్రపంచానికి మరీ ముఖ్యంగా భారత్‌కు ఏమిటి నష్టం?(India Effects With Hormuz Block). సూయెజ్ కెనాల్... యూరప్ దేశాలను హిందూ మహాసముద్రంతో కలిపే సముద్ర మార్గం. సరుకుల రవాణాకు అత్యంత కీలకం. సూయెజ్ లాంటిదే ఈ హర్మూజ్ జలసంధి కూడా. ఇరాన్, ఒమాన్‌ల మధ్య ఉంటుంది. పర్షియన్ జలసంధిని ఒమాన్ జలసంధితో, అరేబియా సముద్రంతోనూ కలుపుతుంది. సూయెజ్ కెనాల్, హర్మూజ్ జలసంధులు రెండింటి ద్వారా ముడిచమురు, ఎల్‌ఎన్‌జీలు సరఫరా అవుతూంటాయి. మన దేశం సౌదీ అరేబియా, ఖతార్ తదితర మధ్యప్రాచ్చ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు, ఎల్ఎన్జీ గ్యాస్‌లు సూయెజ్తోపాటు హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా అవుతూంటాయి. ప్రపంచ చమురు రవాణాలో సుమారు తొమ్మిది శాతం సూయెజ్ కెనాల్ ద్వారా జరుగుతుంటే.. అంతకు రెట్టింపు మోతాదు హర్మూజ్ ద్వారా సాగుతూంటుంది. భారీ నౌకలు, ఆయిల్ కంటెయినర్లు ఉన్న నౌకలు వీటిని భారత్‌తోపాటు ఇతర ఆసియా దేశాలకు సరఫరా చేస్తూంటాయి. భారత్ తన చమురు అవసరాల్లో 80 శాతం వరకూ దిగుమతుల ద్వారా పూర్తి చేసుకుంటూ ఉంటుంది. ఇరాక్‌లోని బస్రా నుంచి అత్యధికంగా 20 - 23 శాతం వస్తూంటే.. రష్యా నుంచి వచ్చేది 18 - 20 శాతం వరకూ ఉంటుంది. ఇవి కాకుండా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, అమెరికా (ఆరేడు శాతం), నైజీరియా, పశ్చిమ ఆఫ్రికా, కువైట్ల నుంచి మిగిలిన ముడిచమురు కొనుగోలు చేస్తూంటాం. ద్రవరూప సహజ వాయువు (ఎల్ఎన్జీ) విషయానికి వస్తే మన దిగుమతుల్లో సగం ఖతార్ నుంచి అందుతూంటే.. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, ఆస్ట్రేలియా, రష్యా, మొజాంబీక్ల నుంచి మిగిలిన సగం వస్తాయి. 2022 తరువాత అంటే ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తరువాత రష్యా నుంచి ఎల్ఎన్జీ దిగుమతులు కొంచెం పెరిగాయి. ఇజ్రాయెల్‌పై కోపంతోనో లేక ఆ దేశానికి సర్ది చెప్పగల సామర్థ్యమున్న అమెరికా పట్టించుకోవడం లేదనో ఇరాన్ కనక ఈ జలసంధిని మూసేసిందంటే.. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారత్ లాంటి దేశాలకు చుక్కలు కనిపించడం ఖాయం!. ప్రతి రోజు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్‌కు చేరే ముడిచమురే సుమారు 15 లక్షల బ్యారెళ్లు మరి! ఈ రవాణ ఆగిపోయిందంటే.. రోజుకు 10 నుంచి 12 కోట్ల లీటర్ల పెట్రోలు ఉత్పత్తి కాదన్నమాట. కొంచెం అటు ఇటుగా ఇది మన రోజువారీ వినియోగానికి సమానం. చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్‌తోపాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా చమురు కొనుగోళ్లు మొదలుపెడతాయి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దీంతో రూపాయి విలువ పడిపోతుంది. వస్తువుల ధరలు పెరుగుతాయి. ద్రవ్యోల్బణమూ అదుపు తప్పుతుంది.:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా