
ఇరాన్‌పై ఇజ్రాయెల్ (israel) అమెరికాల(USA) యుద్ధం నేపథ్యంలో హార్ముజ్( Hormuz) జల సంధిని మూసివేస్తామని ఇరాన్ (Iran)ప్రకటించడం కలకలం రేపింది. దీనికి ఎందుకంత ప్రాధాన్యం? ఇది ఇరాన్‌కు ఉత్తర భాగంలో, ఒమన్, యూఏఈ దేశాలకు పశ్చిమ భూభాగంలో ఉంటుంది. ఈ జలసంధి ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో 50 కి.మీ. వెడల్పుతో ఉంటుంది. లోతు చాల ఎక్కువగా ఉండి పెద్ద రవాణా నౌకలు కూడా ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ఇది గల్ఫ్ దేశాలను అరేబియా సముద్రానికి అనుసంధానిస్తుంది. హార్ముజ్ జలసంధి ద్వారా ఒక్క ఇరాన్ కాకుండా ఇంకా గల్ఫ్ దేశాలైన ఇరాక్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈలు కూడా ఆయిల్ సరఫరా చేస్తుంటాయి. అమెరికాలోని ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ అంచనా ప్రకారం 2023లో ఈ జలసంధి ద్వారా 2 కోట్ల బారెళ్ల క్రూడ్ ఆయిల్ని ఆ యా గల్ఫ్ దేశాలు సరఫరా చేశాయి. దీని విలువ సుమారు 600 బిలియన్ల డాలర్లు. ఇది ఒక్క ఏడాదిలో జరిగిన ఆయిల్ సరఫరా విలువ.
యూకే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ డైరెక్టర్ సర్ అలెక్ యూన్గర్ అంచనా ప్రకారం ఈ జలసంధిని మూసివేయడం వల్ల ఆయిల్ రేట్లు అంచనాకు మించి పెరిగే అవకాశముంటుంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావి తమవుతాయి. ఈ జలసంధి ద్వారా ముఖ్యంగా ఆసియా దేశాలకు ఆయిల్ సరఫరా అవుతోంది. చైనా దిగుమతి చేసుకొనే 90% ఆయిల్ ఒక్క ఇరాన్ నుంచే సప్లై అవుతుంది. ఇండియా 60% క్రూడ్‌ను దిగుమతి చేసుకుంటోంది. దక్షిణ కొరియా 60%, జపాన్ ఉపయోగించే ఆయిల్‌లో మూడొంతులు ఈ జలసంధి ద్వారానే దిగుమతి అవుతోంది. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియాలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల ధరలూ దీని మూసివేత వల్ల బాగా పెరిగే అవకాశంఉంటుంది. ఈ దేశాల వస్తువులు ఒక్క అమెరికానే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు వాడటంతో అంతటా ద్రవ్యోల్బణం పెరిగి పోతుంది. అయితే ప్రస్తుతం యుద్ధం ఆగిపోయింది కనుక హార్ముజ్ మూసివేత నిర్ణయాన్ని విరమించినట్టు వస్తున్న వార్తలు నిజమైతే అదే పదివేలు!
– డా.కొండి సుధాకర్ రెడ్డి లెక్చరర్