విద్యా వెలుగులు పంచిన టీచరమ్మకు గ్లోబల్‌ ప్రైజ్‌ | Indian teacher Rouble Nagi won Global Teacher Prize 2026 | Sakshi
Sakshi News home page

విద్యా వెలుగులు పంచిన టీచరమ్మకు గ్లోబల్‌ ప్రైజ్‌

Feb 6 2026 1:01 AM | Updated on Feb 6 2026 1:01 AM

Indian teacher Rouble Nagi won Global Teacher Prize 2026

9 కోట్ల రూపాయల నగదు బహుమతి సైతం.. 

ప్రతిష్టాత్మక అవార్డ్‌ను గెల్చుకున్న రూబల్‌ నాగీ

దుబాయ్‌: పాఠశాల ముఖం చూడని పేద చిన్నారులకు విద్యనందిస్తూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారులకు విద్యాభాగ్యం కల్పిస్తున్న ఉపాధ్యాయురాలు, ముంబైకి చెందిన రూబల్‌ నాగీని ప్రతిష్టాత్మక జెమ్స్‌ ఎడ్యుకేషన్‌ ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’వరించింది. అవార్డ్‌తోపాటు 10లక్షల డాలర్లు(దాదాపు రూ.9 కోట్ల)నగదు బహుమతినీ ఆమె గెల్చుకున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో గురువారం జరిగిన వరల్డ్‌ గవర్నమెంట్‌ సదస్సులో ఈమెకు అవార్డ్‌ను ప్రదానంచేశారు. 

దేశవ్యాప్తంగా రూబల్‌ నాగీ ఆర్ట్‌ ఫౌండేషన్‌(ఆర్‌ఎన్‌ఏఎఫ్‌) ద్వారా బోధనాకేంద్రాలను ఏర్పాటు విద్యార్థులకు చదువు చెబుతున్నారు. ముఖ్యంగా మురికివాడల్లో గోడలపై చిత్రాలను గీసి వాటి ద్వారా చిన్నారులకు సాహిత్యం, సామాన్య శాస్త్రం, గణితం, చరిత్ర, పర్యావరణ అవగాహన, సామాజిక బాధ్యత తదితర సబ్జెక్టులను బోధిస్తున్నారు. విద్యావేత్త అయిన నాగీ దాదాపు 20 సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా 100కుపైగా మురికివాడల్లో తన ఆర్‌ఎన్‌ఏఎఫ్‌ సంస్థ ద్వారా 800కుపైగా లెర్నింగ్‌ సెంటర్లను నెలకొల్పి విద్యాదానం మొదలెట్టారు. 

అద్భుత ప్రతిభాశాలి.. 
‘‘లెర్నింగ్‌ సెంటర్లలో గోడలపై కొలువుతీరింది సజీవ కుడ్య పాండిత్యం. వీటి ద్వారా చిన్నారులు ఎంతో సులభంగా సబ్జెక్టులు, పలు విద్యాంశాలను నేర్చుకుంటున్నారు. అర్థంచేసుకుంటున్నారు. పేద పిల్లలే కాదు వాళ్ల తల్లిదండ్రులుసైతం పేదరికం, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహం, బడి మాని్పంచే సంస్కృతి, మౌలిక వసతుల లేమి వంటి అంశాలపై అవగాహన పెంచుకున్నారు.

 పునరి్వనియోగ వస్తువులను సద్వినియోగం చేసుకుంటూ ఈ లెర్నింగ్‌ సెంటర్‌లలో బోధన కొనసాగుతోంది. ఈమె కృషితో ఆయా ప్రాంతాల్లో పేదపిల్లలు బడిమానేసే సంస్కృతి 50 శాతం తగ్గిపోయింది. ఈమె600 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. చదువు చెప్పడంతోపాటు చక్కగా చిత్రలేఖనం చేస్తారు. 850కి పైగా కుడ్యచిత్రాలు వేశారు. ప్రతిమలు సృష్టించారు. ఈమె చేతుల్లో రూపుదిద్దుకున్న కళాఖండాలు ప్రపంచవ్యాప్తంగా 200 ఎగ్జిబిషన్లలో ప్రదర్శితమయ్యాయి’’అని టీచరమ్మను జెమ్స్‌ ఫౌండేషన్‌ పొగిడింది. 

అవార్డ్‌తోపాటు తాను అందుకున్న కోట్ల రూపాయల నగదుతో కొత్త విద్యా కేంద్రాన్ని నెలకొల్పి ఉచితంగా వృత్తివిద్యా శిక్షణ ఇప్పిస్తానని నాగీ ప్రకటించారు. లాభాపేక్షలేని జెమ్స్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీని ఏర్పాటుచేసి ఈజిప్ట్, ఖతార్, యూఏఈల్లో డజన్లకొద్దీ పాఠశాలలను నడుపుతున్న వర్కీ ఫౌండేషన్‌ 11 సంవత్సరాల క్రితం ఈ ‘గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌’అవార్డ్‌ను ఇవ్వడం మొదలెట్టింది. 

ఇప్పటిదాకా 9 మంది ప్రతిభావంతులైన టీచర్‌లకు ఈ అవార్డ్‌ దక్కింది. తన జీతభత్యాల్లో అగ్రభాగాన్ని పేదల కోసం కేటాయిస్తూ ఉచితంగా పాఠాలు చెప్పే కెన్యా టీచర్‌కు గతంలో ఈ అవార్డ్‌ దక్కింది. అహింసా సంబంధ పాఠాలు బోధిస్తూ పిల్లల్లో హింసా ప్రవృత్తిని తరిమికొట్టేందుకు కృషిచేస్తున్న పాలస్తీనియన్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిని సైతం గతంలో ఈ అవార్డ్‌ వరించింది. సౌదీ అరేబియాలో పేదల కోసం పాటుపడుతున్న మన్సూర్‌–అల్‌–మన్సూర్‌ అనే టీచర్‌కు గత ఏడాది ఇదే అవార్డ్‌ను అందజేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement