ఎట్టకేలకు నిర్దోషిగా తేలిన వందేళ్ల వృద్ధుడు
తీర్పు చెప్పిన అలహాబాద్ హైకోర్టు
ప్రయాగ్‌రాజ్: చేయని నేరానికి నాలుగు దశాబ్దాలకుపైగా కేసులో నిందితునిగా ఉంటూ సమాజంలో హంతకుడు అనే ముద్ర తో బతుకీడిస్తున్న 100 ఏళ్ల వృద్ధునికి ఎట్టకేలకు కేసు నుంచి మోక్షం లభించింది. 1982నాటి హత్యకేసులో ధనీరామ్‌ను నిర్దోషిగా పేర్కొంటూ అలహాబాద్ హైకో ర్టు డిజిజన్ బెంచ్ తాజాగా తీర్పును వెలువర్చింది.
దీంతో దాదాపు 42 సంవత్సరాల తర్వాత కేసు నుంచి ధనీరామ్ విముక్తుడయ్యాడు. నత్తనడకన సాగే కేసుల విచారణ, కోట్ల కొలదిగా పేరుకుపోయిన కేసుల కొండల మధ్య సరిగ్గా వందేళ్ల వయసులో ధనీరామ్ నిర్దోషిగా బయటపడడం విశేషం. దేశ న్యాయవ్యవస్థలో న్యాయం కోసం కొన్ని సందర్భాల్లో దశాబ్దాల తరబడి వేచి ఉండక తప్పదన్న చేదునిజాన్ని ధనీరామ్ కేసు మరోసారి స్మరణకు తెచి్చందని పలువురు న్యాయనిపుణులు వ్యాఖ్యానించారు.
అసలేంటీ కేసు?
ఉత్తరప్రదేశ్‌లో 1982 ఆగస్ట్ 9వ తేదీన ఒక భూవివాదం చివరకు గున్వా అనే వ్యక్తి హత్యకు దారితీసింది. ఈ వివాదంపై 1984లో కేసు నమోదైంది. ఈ కేసులో హమీర్‌పూర్‌కు చెందిన ధనీరామ్‌తోపాటు మైకూ, సత్తిదిన్‌లను నిందితులుగా పేర్కొంటూ పోలీసులు నేరాభియోగాలు మోపారు. విషయం తెల్సి ప్రధాన నిందితుడు మైకూ పారిపోగా సత్తిదిన్, ధనీరామ్‌లను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇద్దరినీ దోషులుగా తేలుస్తూ హమీర్‌పూర్ సెషన్స్‌కోర్టు యావజ్జీవకారాగార శిక్ష విధిస్తూ 1984లోనే తీర్పు చెప్పింది.
వెంటనే ధనీరామ్, సత్తిదిన్ హైకోర్టును ఆశ్రయించి అదే ఏడాది బెయిల్‌మీద బయటికొచ్చారుగానీ శిక్షరద్దు పిటిషన్ అలాగే పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఈలోపే సత్తిదిన్ మరణించారు. 42 సంవత్సరాల తర్వాత గత నెల జస్టిస్ చంద్రధారీ సింగ్, జస్టిస్ సంజీవ్ కుమార్‌ల అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ శిక్షరద్దు పిటిషన్‌ను విచారించింది. ‘‘ఇన్ని సంవత్సరాలుగా ఈ కేసు ఇలాగే పెండింగ్‌లో పడిపోవడం అత్యంత నిర్లక్ష్యానికి నిదర్శనం. ఆనాడు ప్రత్యక్షసాక్షులుగా చెబుతున్న వాళ్ల వివరాలు, వాంగ్మూలాలు ఎఫ్‌ఐఆర్‌లో లేవు. కేవలం అనుమానంతోనే ధనీరామ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు.
బాధితుడిని ఇతను తుపాకీతో కాల్చిచంపినట్లుగా బలమైన సాక్ష్యాధారాలే లేవు. దశాబ్దాలపాటు విచారణలో ఆలస్యం, అలసత్వంతో న్యాయ వితరణ అనేది సవ్యంగా జరగదు. సంశయలాభం కింద ఇతనికి కేసు నుంచి విముక్తి కల్పిస్తున్నాం. సెషన్స్ కోర్టు విధించిన శిక్షను రద్దుచేస్తున్నాం’’అని 23 పేజీల తీర్పులో ధర్మాసనం పేర్కొంది. వందేళ్ల వయోభారం, న్యాయ వితరణలో అసాధారణ ఆలస్యం కారణంగానూ ఈయనకు శిక్షను రద్దుచేస్తున్నామని ధర్మాసనం వివరించింది. ఆనాడు బెయిల్ కోసం సమరి్పంచిన బెయిల్‌బాండ్ నగదు పూచీకత్తులనూ తిరిగి ఇచ్చేయాలని కోర్టు ఆదేశించింది.


