ప్రియుడు, ఆర్‌ఎంపీతో కలిసి భార్య ఘాతుకం
బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి.. ముఖంపై దిండుతో నొక్కి
మృతుడి తండ్రి ఫిర్యాదుతో నిందితుల ఆటకట్టు
కేసును ఛేదించిన గుంటూరు జిల్లా పోలీసులు
మీడియాకు వివరాలు వెల్లడించిన ఎస్పీ వకుల్ జిందాల్
నగరంపాలెం (గుంటూరు): నిద్రమాత్రల పొడిని కలిపిన బిర్యానీని భర్తకు వడ్డించి, మత్తులోకి జారుకున్నాక దారుణంగా హత్యచేసిన భార్యను, అందుకు సహకరించిన ప్రియుడిని, ఆర్‌ఎంపీని దుగ్గిరాల పోలీసులు అరెస్టుచేశారు. ఈ కేసు వివరాలను సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన లోకం శివనాగరాజు (48)కి 2008లో లక్ష్మీమాధురితో వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. శివనాగరాజుకు ఉల్లి వ్యాపారం, షేర్ మార్కెట్‌లో నష్టాలు రావడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో.. భార్య లక్ష్మీమారుతి తొలుత దుగ్గిరాలలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా, తర్వాత విజయవాడలోని ఓ సినిమా థియేటర్‌లో పనికి చేరింది.
అక్కడి బుకింగ్ కౌంటర్‌లో పనిచేసే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన కొండవీటి గోపీతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. గోపీని భర్తకు పరిచయం చేయగా వీరు స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో.. గతంలో హైదరాబాద్‌లో గోపీ పనిచేసిన కార్యాలయంలో డ్రైవర్‌గా చేరిన శివనాగరాజు ఇటీవల దుగ్గిరాల వచ్చాడు. భార్య, పిల్లలతో గోపీ ఓ ఫ్లాట్‌లో ఉంటున్నట్లు తెలిసి పలుమార్లు హెచ్చరించాడు.
దీంతో శివనాగరాజును అడ్డు తొలగించుకోవాలని లక్ష్మీమాధురి, గోపీ నిర్ణయించుకున్నారు. గోపీ తన స్నేహితుడైన గుంటూరు జిల్లా ఫిరంగిపురం ఎర్రగుంట్లపాడుకు చెందిన ఆర్‌ఎంపీ కంభంపాటి సురేష్ వద్ద నిద్రమాత్రలు సేకరించాడు. వాటిని లక్ష్మీమాధురికి ఇవ్వగా, ఆమె వాటిని పొడిచేసి బిర్యానీలో కలిపి ఈనెల 18న భర్తకు వడ్డించింది. భర్త నిద్రలోకి జారుకున్నాక లక్ష్మీమాధురి, గోపీ, సురేష్ కలిసి శివనాగరాజు ముఖంపై దిండుతో నొక్కిపెట్టి హత్యచేశారు.
గుండెపోటు అంటూ నాటకం..
మర్నాడు ఉదయం భర్త గుండెపోటుతో మరణించినట్లు అందరినీ నమ్మించేందుకు భార్య యత్నించింది. కానీ, శివనాగరాజు మృతిపై తండ్రి అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా భార్యను ప్రశి్నంచగా.. అసలు విషయం బయటపడింది. పోలీసులు లక్ష్మీమాధురి, గోపీ, సురేష్ ను అరెస్టుచేశారు. వారి నుంచి 4 సెల్‌ఫోన్లు, మత్తుమాత్రల షీట్‌లు, అప్పడాల కర్ర, బుల్లెట్, కారు స్వా«దీనం చేసుకున్నారు.


