అమెరికా, ఇజ్రాయెల్ బీకర దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రతీకార దాడులతో విరుచుకు పడుతోంది. దీంతో చమురు లభ్యతపై తీవ్ర సంక్షోభం నెలకొంది. ప్రపంచ ఇంధన ధరలపై ప్రపంచ వ్యాప్తం తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, పాకిస్తాన్‌కు భారీ ఊరట లభించింది. పాక్‌కు ఇంధన అవసరాలకు మద్దతు ఇవ్వడానికి సౌదీ అరేబియా ముందుకు వచ్చింది. ఎప్పుడు, ఏ సమయంలోనైనా సౌదీ అరేబియాకుతాము అండగా ఉంటాం, ఇందులో ఎలాంటి సందేహం లేదని పాక్ బహిరంగంగా ప్రకటించింది. తద్వారా రక్షణ మరియు ఇంధన రంగాల్లో పాక్, సౌదీ మధ్య ఉన్న దశాబ్దాల కాలపు మైత్రిని మరింత బలోపేతం చేసుకుంటున్నాయి.
పెరుగుతున్న ప్రపంచ ఇంధన ధరలు దాని ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెస్తున్నందున అవసరమైనప్పుడు సౌదీ అరేబియాకు ఖచ్చితంగా మద్దతు ఇస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. గల్ఫ్ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరిగిన వేళ, పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా భారీ ఊరటనిచ్చింది. పాకిస్థాన్ ఇంధన అవసరాలను తీర్చడానికి చమురు మరియు డీజిల్ సరఫరా చేసేందుకు సౌదీ అరేబియా ఏర్పాట్లు చేసినట్టు పాకిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ముషారఫ్ జైదీ మీడియా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
ఇది ఇలా ఉంటే గత ఏడాది సెప్టెంబర్‌లో ఇరు దేశాలు కుదుర్చుకున్న రక్షణ ఒప్పందానికి ప్రస్తుత పరిస్థితులు ఒక చాలెంజ్‌గా మారాయి. ఈ ఒప్పందం ప్రకారం, సౌదీ రక్షణ కోసం పాకిస్థాన్ తన సైనిక సహకారాన్ని అందించాల్సి ఉంటుంది. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇటీవల సౌదీ రక్షణ మంత్రితో భేటీ అయ్యారు. ఇరాన్ నుండి ఎదురవుతున్న క్షిపణి , డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి ఉమ్మడి రక్షణ ప్రణాళికలపై చర్చించారు. రక్షణ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే, తమ మధ్య సంబంధం పరస్పర మద్దతుపై ఆధారపడి ఉందని రెండు దేశాలు ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా ఉండాలనే సూత్రంపై పనిచేస్తున్నాయని జైదీ పేర్కొన్నారు.
ఒకవైపు సౌదీకి మద్దతు ఇస్తూనే, మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రితో కూడా పాకిస్థాన్ సంప్రదింపులు జరుపుతోంది. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడడమే తమ ప్రాధాన్యత అని పాకిస్థాన్ పేర్కొంది.


