Switzerland: బస్సులో మంటలు.. ఆరుగురు సజీవ దహనం | Six Killed And Several Injured As Passenger Bus Catches Fire In Switzerland, Authorities Suspect Foul Play, Video Inside | Sakshi
Sakshi News home page

Switzerland: బస్సులో మంటలు.. ఆరుగురు సజీవ దహనం

Mar 11 2026 8:56 AM | Updated on Mar 11 2026 10:24 AM

Six killed bus bursts into flames in Switzerland

కెర్జర్స్: స్విట్జర్లాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ స్విట్జర్లాండ్‌లోని కెర్జర్స్ పట్టణంలో మంగళవారం సాయంత్రం ఒక ప్రయాణీకుల బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, ఎవరో కావాలని చేసిన దుశ్చర్య అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

స్విస్ రాజధాని బెర్న్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని కెర్జర్స్ ప్రధాన వీధిలో మంగళవారం సాయంత్రం 6:25 గంటల సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న 'పోస్ట్‌బస్' (PostBus) ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. ప్రాణభయంతో ప్రయాణికులు కేకలు వేస్తూ, బయటకు రావడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు, అంబులెన్స్‌లు, హెలికాప్టర్లు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిబూడిదైంది.

ఈ ఘటనపై ఫ్రిబోర్గ్ కాంటోనల్ పోలీసు ప్రతినిధి ఫ్రెడరిక్ పాపాక్స్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి  దీనిని బహుశా ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా భావిస్తున్నాం’ అని  అన్నారు. బస్సు లోపలే ఏదో జరిగి మంటలు చెలరేగాయని ఆయన స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు క్రిమినల్ విచారణను ప్రారంభించారు. స్విట్జర్లాండ్‌లో గత మూడు నెలల కాలంలో ఇది రెండో పెద్ద అగ్నిప్రమాదం. ఈ ఏడాది జనవరి 1వ తేదీన క్రాన్స్-మోంటానా స్కీ రిసార్ట్‌లోని ఒక బార్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ విషాదం నుంచి తేరుకోకముందే ఇప్పుడు బస్సులో ఆరుగురు చనిపోవడం స్విస్ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘స్విట్జర్లాండ్‌లో మరోసారి ఇంతటి భయంకర అగ్నిప్రమాదం జరగడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ఆయన ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement