వేట్లపాలెం ఘటన.. 26కు చేరిన మృతుల సంఖ్య | Vetlapalem Incident: Death Toll Reaches 26 | Sakshi
Sakshi News home page

వేట్లపాలెం ఘటన.. 26కు చేరిన మృతుల సంఖ్య

Mar 4 2026 6:20 PM | Updated on Mar 4 2026 7:14 PM

Vetlapalem Incident: Death Toll Reaches 26

సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరుకుంది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతు కాతేటి శ్రీను(33) మృతిచెందాడు. ఇవాళ ఒక్కరోజే(బుధవారం, మార్చి 4) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. 70-100 శాతం కాలిన గాయాలు, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో బాధితుల ఆరోగ్యం విషమిస్తోంది. జీజీహెచ్‌లో మరో ముగ్గురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.

వేట్లపాలెంలో గత నెల ఫిబ్రవరి 28న(శనివారం) భారీ విస్ఫోటనం సంభవించిన సంగతి తెలిసిందే. సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ బాణసంచా తయారీ కేంద్రం.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతులందరూ పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు.

సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఉదయం బాణసంచా కేంద్రంలోని నాలుగు షెడ్లలో 60 మంది వరకూ కూలీలు మందు గుండు తయారీలో నిమగ్నమయ్యారు. సహజంగా ప్రతి రోజూ ఈ కేంద్రంలో 10–15 మంది పని చేస్తూంటారు. అయితే జగ్గంపేట మండలం మల్లిశాలలో జాతరకు భారీ ఆర్డర్‌ రావడంతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాణసంచాకు డిమాండ్‌ పెరిగింది. దీంతో 60 మందికి పైగా కూలీలతో పని చేయిస్తున్నారు. రాకెట్లు, జువ్వలు, సెర్చ్‌లైట్లు, మిడతల దండు, డిస్కో బుడ్లు, చిచ్చు బుడ్లు తయారు చేస్తున్నారు.

మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్క­సారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నాలుగు షెడ్లలో ఉన్న బాణసంచా ఒకదాని తర్వాత మరొకటి పేలిపోవడంతో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి షెడ్లలో ఉన్న కూలీలు చెల్లాచె­దురుగా ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు 20–30 అడుగుల ఎత్తున ఎగిరి­పడ్డాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కాలి­పోయిన మృతదేహాలు తునాతునకలైపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement