vetlapalem
-
మాట నిలబెట్టుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల్లో మాత్రమే హీరో కాదు.. రియల్ లైఫ్‌లోనూ శెభాష్ అనిపించుకుంటున్నారు. ఇటీవల ఏపీలోని బాణసంచా పేలుళ్ల ఘటనలో తండ్రిని కోల్పోయిన మానసిక దివ్యాంగురాలికి సాయం చేస్తానని మాటిచ్చారు. కడింపల్లి దుర్గ పోషణ కోసం జీవితాంతం నెలకు రూ.7,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.తాజాగా తాను ఇచ్చిన మాటను అల్లు అర్జున్ నిలబెట్టుకున్నారు. తండ్రిని కోల్పోయిన దుర్గ అనే యువతికి రూ.7,500 ఆర్థిక సాయం అందించారు. ఈ మేరకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన స్క్రీన్‌షాట్‌ను బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సాగర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న జరిగిన అగ్ని ప్రమాదంలో ఆమె తండ్రి కడింపల్లి ధనరాజు మరణించారు. అంతేకాకుండా ఆమె తల్లి చాలా ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. మానసిక దివ్యాంగురాలైన కుమార్తె దుర్గను తండ్రి ధనరాజు చాలా జాగ్రత్తగా చూసుకునేవారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే, పేలుళ్ల ఘటనలో ఆయన మృతి చెందడంతో దుర్గ ఒంటరి అయిపోయింది. ఆమెకు అన్నం పెట్టే వారు కూడా లేకపోవడంతో చాలామంది చలించిపోయారు.అయితే, ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ స్పందించారు. నిర్మాత బన్నివాసు ద్వారా తన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులను వేట్లపాలెం పంపించారు. అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఆయన చలించిపోయారు. దుర్గకు కావాల్సిన సాయం చేయాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సాగర్ తెలిపారు. After the tragic fire accident at a Kakinada fireworks factory claimed her father's life, Allu Arjun stepped up to support Kadimpalli Durga, a mentally challenged young girl left in distress.He pledged financial assistance of ₹7,500 every month for her entire life to ensure… pic.twitter.com/7DvsBnSZm2— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) March 18, 2026 -
గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. తండ్రిని కోల్పోయిన యువతికి సాయం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంచి మనసు చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఫిబ్రవరి 28న బాణసంచా పేలుళ్ల ఘటనలో తండ్రిన కోల్పోయిన మానసిక దివ్యాంగురాలికి సాయం అందించారు. కడింపల్లి దుర్గ పోషణ కోసం జీవితాంతం నెలకు రూ.7,500 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాటు చేశారు.ఈ అగ్ని ప్రమాదంలో ఆమె తండ్రి కడింపల్లి ధనరాజు మరణించగా.. ఆమె తల్లి చాలా ఏళ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. మానసిక దివ్యాంగురాలైన కుమార్తె దుర్గను తండ్రి ధనరాజు చాలా జాగ్రత్తగా చూసుకునేవారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే, పేలుళ్ల ఘటనలో ఆయన మృతి చెందడంతో దుర్గ ఒంటరి అయిపోయింది. ఆమెకు అన్నం పెట్టే వారు కూడా లేకపోవడంతో చాలామంది చలించిపోయారు. అయితే, ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా తెలుసుకున్న అల్లు అర్జున్ స్పందించారు. నిర్మాత బన్నివాసు ద్వారా తన ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులను వేట్లపాలెం పంపించారు. అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఆయన చలించిపోయారు. దుర్గకు కావాల్సిన సాయం చేయాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సాగర్ తెలిపారు. Hero #AlluArjun once again showed his big heart ❤️After learning about the tragic fire accident at a fireworks factory in Kakinada district that claimed her father’s life, he extended support to mentally challenged girl Kadimpalli Durga.He announced that ₹7,500 will be… pic.twitter.com/34q252I8FN— Milagro Movies (@MilagroMovies) March 10, 2026 -
వేట్లపాలెం ఘటనలో మరో ఇద్దరి మృతి
సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్వర్క్స్లో ఇటీవల జరిగిన ఘోర విస్ఫోటనంలో మృతుల సంఖ్య 28కి పెరిగింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ పెద్దాపురానికి చెందిన మోర్త శ్రీను (30), వేట్లపాలేనికి చెందిన సప్ప సత్యవేణి (34) గురువారం మృతి చెందారు. బాణసంచా తయారీ కేంద్రంలో గత శనివారం జరిగిన పేలుడులో అక్కడికక్కడే 20 మంది సజీవ దహనమైన విషయం విదితమే. ఇదే ప్రమాదంలో గాయపడిన 9 మందిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో ఇప్పటి వరకూ 8 మంది మృతి చెందారు. సామర్లకోట కుమ్మర వీధికి చెందిన వేమగిరి దావీదు మృత్యువుతో పోరాడుతున్నాడు. -
వేట్లపాలెం ఘటన.. 26కు చేరిన మృతుల సంఖ్య
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరుకుంది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతు కాతేటి శ్రీను(33) మృతిచెందాడు. ఇవాళ ఒక్కరోజే(బుధవారం, మార్చి 4) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు. 70-100 శాతం కాలిన గాయాలు, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్‌తో బాధితుల ఆరోగ్యం విషమిస్తోంది. జీజీహెచ్‌లో మరో ముగ్గురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.వేట్లపాలెంలో గత నెల ఫిబ్రవరి 28న(శనివారం) భారీ విస్ఫోటనం సంభవించిన సంగతి తెలిసిందే. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రం.. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతులందరూ పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు.సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఉదయం బాణసంచా కేంద్రంలోని నాలుగు షెడ్లలో 60 మంది వరకూ కూలీలు మందు గుండు తయారీలో నిమగ్నమయ్యారు. సహజంగా ప్రతి రోజూ ఈ కేంద్రంలో 10–15 మంది పని చేస్తూంటారు. అయితే జగ్గంపేట మండలం మల్లిశాలలో జాతరకు భారీ ఆర్డర్ రావడంతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాణసంచాకు డిమాండ్ పెరిగింది. దీంతో 60 మందికి పైగా కూలీలతో పని చేయిస్తున్నారు. రాకెట్లు, జువ్వలు, సెర్చ్లైట్లు, మిడతల దండు, డిస్కో బుడ్లు, చిచ్చు బుడ్లు తయారు చేస్తున్నారు.మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నాలుగు షెడ్లలో ఉన్న బాణసంచా ఒకదాని తర్వాత మరొకటి పేలిపోవడంతో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి షెడ్లలో ఉన్న కూలీలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు 20–30 అడుగుల ఎత్తున ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కాలిపోయిన మృతదేహాలు తునాతునకలైపోయాయి. -
వేట్లపాలెం దోషులెవరు?
అంటించి వదిలేస్తే చాలు నింగిలోకి దూసుకెళ్తూ, ఆ వెంటనే ఆకాశాన్ని దేదీప్యమానం చేస్తూ, నక్షత్రాలు రాలుస్తూ, రంగురంగుల పొగలు కక్కుతూ, చిత్రమైన ధ్వనులు చేస్తూ అబ్బురపరిచే బాణాసంచా తయారీ ప్రాణాంతకమైన పరిశ్రమ. అక్కడ పనిచేయటం నిప్పుతో చెలగాటం. చిన్న ఏమరుపాటు సైతం పెను నష్టానికి కారణమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలో శనివారం మిట్టమధ్యాహ్నం ఒక బాణాసంచా గోడౌన్లో రెండు గంటల పాటు నిరంతరాయంగా జరిగిన పేలుళ్ల పర్యవ సానంగా ఇంతవరకూ 22 మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతం భద్రత, పర్యవేక్షణల్లో మరోసారి మన డొల్లతనాన్ని చాటింది. పేలుడు ధాటి ఏ స్థాయిలో ఉందంటే... శరీర భాగాలు ఛిద్రమై విసిరేసినట్టు పడ్డాయి. కేవలం నలుగురు మాత్రమే ఉండాల్సిన ఘటనాస్థలిలో పేలుడు సమయంలో 45 మంది ఉన్నారని అంటున్నారు. ఈ ఉదంతంలో మరో 11 మందికి గాయాలయ్యాయి. ఇంత జరిగాక అక్కడకు పోయిన మంత్రులు నమోదైన సంఖ్యకు మించి పనివారిని అక్కడుంచారనీ, పరిమితి కన్నా ఎక్కువగా పేలుడు పదార్థాలు నిల్వ చేశారనీ, అధికారుల పర్యవేక్షణ లేనేలేదనీ చెబుతున్నారు. ఇవన్నీ తమ పాలన నిర్వాకమేనని... జరిగిన విషాదంలో తమకూ నైతిక బాధ్యత ఉంటుందనీ వారికెవరు చెప్పాలి? కార్మిక శాఖ పట్టించుకోదు. పోలీసు నిఘా ఉండదు. అగ్నిమాపక విభాగానికి అసలే పట్టదు. ఆ రోడ్డు పక్కనుంచి తరచూ మంత్రులు, వారి అనుచరగణం రాకపోకలు సాగిస్తున్నా, పొలాల మధ్యలో అక్కడ సాగుతున్న కార్యకలా పాలేమిటన్న ఆరా ఉండదు. కనీసం అధికారుల్ని అడిగి తెలుసుకుందామన్న స్పృహ కూడా ఉండదు. ఇక ఇటువంటి ఘోరాలు చోటుచేసుకోవటంలో ఆశ్చర్యమేముంది? ఇలాంటి ఘటనల్ని ప్రమాదాలంటాం గానీ... నిజానికి అవి ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం కారణంగా దాపురించే ఘోరాలు. నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పుడు వాటి అమలును పట్టించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అందుకే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయటం, పర్యవేక్షించటంలో విఫలమైన ఉన్నతాధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవటం వంటివి తప్పనిసరి చేయాలి. కానీ అలాంటివేమీ జరగటం లేదు. నిబంధనలకేం... చాలా ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రం చుట్టూ 9 మీటర్ల మేర ఖాళీ స్థలం ఉండాలనీ, ఆ కేంద్రంలో నిర్దిష్టమైన ఉష్ణోగ్రత, తేమ ఉండాలనీ, షెడ్ల నిర్మాణానికి వినియోగించే సామగ్రి కనీసం రెండు గంటలపాటు అగ్నిని నిరోధించగలగాలనీ, బాణసంచా పనిలో ఉండేవారు ప్రత్యేక శిక్షణ పొంది ఉండాలనీ, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పాటించాల్సిందేమిటో అవగాహన కలిగి ఉండాలనీ నిబంధనలు చెబుతున్నాయి. ఇంకా ప్రాథమిక వైద్య సదుపాయం, అగ్నిమాపక సిలెండర్లు, అయిదు ట్రక్కుల పొడి ఇసుక, నీరు నింపిన బకెట్లు అందుబాటులో ఉంచాలి. కానీ ఇవన్నీ అమలవుతున్నాయో లేదో చూసేదెవరు? దేశంలోని బాణసంచా పరిశ్రమల్లో చిన్నవో, పెద్దవో తరచు ప్రమాదాలు జరుగు తూనే ఉన్నా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటంలో, కార్మికుల భద్రత గురించి శ్రద్ధ చూపటంలో నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. ప్రమాదం జరిగినప్పుడల్లా ప్రదర్శించే హడా విడి మరికొన్ని రోజులకే కనుమరుగవుతుంది. మళ్లీ మరొకటి జరిగేవరకూ అంతా సవ్యంగానే ఉందన్న భ్రమ ఆవరిస్తుంది. సాధారణ సమయాల మాటెలా ఉన్నా కనీసం పండు గలు, శుభకార్యాల సమయాల్లోనైనా బాణసంచా పరిశ్రమలపై దృష్టిపెట్టాలన్న ఇంగిత జ్ఞానం అధికార యంత్రాంగంలో లోపిస్తోంది. డిమాండ్ అధికంగా ఉన్నప్పుడు రోజుకు దాదాపు 12 గంటలసేపు పనిచేయిస్తారు. కార్మికులు ఊపిరి తీసుకోవటానికి కూడా వ్యవధి చిక్కనంతగా పనిలో ఉంటారు. సరిగ్గా అప్పుడే ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.వేట్లపాలెం ఉదంతమైనా పాలకుల కళ్లు తెరిపించాలి. అధికారులు నిర్ణీత వ్యవధిలో క్రమం తప్పకుండా బాణసంచా తయారీ కేంద్రాలను సందర్శించేలా, లోటుపాట్లు గుర్తించినప్పుడు కఠిన చర్యలు తీసుకునేలా నిబంధనలు ఏర్పరచాలి. కార్మిక శాఖ, పోలీసు, అగ్నిమాపక, విభాగాలు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలి. వాటిమధ్య సమన్వయం ఉండాలి. ఇవేమీ లేకుండా మీడియా కోసం ఆగ్రహావేశాలు నటించటం వల్ల ప్రయోజనం ఉండదు. -
వేట్లపాలెం ఘటనకు కారణాలేమిటో!
సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో 22 మంది ప్రాణాలను బలిగొన్న భారీ విస్ఫోటనం ఘటన జరిగి మూడు రోజులైంది. ఇంతటి భారీ పేలుడు సంభవించడానికి కారణాలేమిటి? ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారు? మృతులు, క్షతగాత్రులు కాకుండా మిగిలిన వారు ఏమయ్యారనే ప్రశ్నలకు ఇప్పటివరకూ జవాబులు లభించడం లేదు. దర్యాప్తు సరైన దిశగా సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీసీ కెమెరా దృశ్యాలపై దృష్టి పెట్టలేదేం? నిబంధనల ప్రకారం ప్రతీ బాణసంచా తయారీ కేంద్రం, షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఈ నిబంధన ప్రకారం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం. తయారీ కేంద్రం యజమాని ఎక్కడున్నా సీసీ కెమెరాల్లోని దృశ్యాలు ఆయన సెల్ఫోన్లో రికార్డవుతాయి. ఈ ప్రమాదంలో సీసీ కెమెరాలు పూర్తిగా కాలిపోయినా.. సెల్ఫోన్లో నిక్షిప్తమైన వీడియో దృశ్యాలు లభించే అవకాశం ఉంది. ఈ రికార్డులను పరిశీలిస్తే తొలుత విస్ఫోటనం ఎక్కడ జరిగింది.. ఎక్కడి నుంచి, ఏవిధంగా మంటలు చెలరేగాయి.. ఆ సమయంలో అక్కడ ఎంతమంది పని చేస్తున్నారనే అంశాలపై స్పష్టత వస్తుంది. అంతా గోప్యమే సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లైసెన్స్ అడబాల అర్జున్ పేరిట ఉంది. దీని నిర్వహణలో అర్జున్‌తో పాటు ఆయన సోదరుడు నాని, తండ్రి శ్రీనివాసరావు కూడా పాలుపంచుకుంటున్నారు. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు మరణించగా.. అర్జున్, నానిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణించిన నేపథ్యంలో వారికి నోటీసు ఇచ్చి విడిచిపెట్టామని పోలీసులు చెబుతుండగా.. అది అవాస్తవమని, తండ్రికి తలకొరివి పెట్టేందుకు కూడా వారిని అనుమతించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మరోవైపు అన్నదమ్ములిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి ఏ సమాచారం రాబట్టారనే విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగానే ఉంచారు. విషమంగా నలుగురి పరిస్థితి పేలుడు ఘటనలో కాలిన గాయాలతో కాకినాడ జీజీహెచ్‌లో ఇంకా ఏడుగురు చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాధితులకు చికిత్స కొనసాగుతోంది.మహిళ తల గుర్తింపు ఇలావుండగా.. ఘటనా స్థలానికి సమీపంలోని పొలంలో మొండెం లేని మహిళ తలను సోమవారం గుర్తించారు. ఘటన జరిగిన రోజున తలలు లేకుండా దొరికిన రెండు మొండేలను కుటుంబ సభ్యులు గుర్తించడంతో వారికి అప్పగించారు. వారి మతాచారం ప్రకారం ఆ మొండేలను ఖననం చేసేశారు. ఇప్పుడు దొరికిన ఈ తల.. ఆ రెండు మొండేల్లో ఒకటైన సక్కుమళ్ల రాఘవ(50)దిగా గుర్తించినట్టు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. అయినప్పటికీ, ఈ తలకు డీఎన్ఏ పరీక్ష చేయిస్తామని చెబుతున్నారు. ఆ 10 మందీ ఏమయ్యారో! స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పేలుడు జరిగిన సమయంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో 40 మంది పని చేస్తున్నట్టు తెలుస్తోంది. శనివారం ఘటనా స్థలంలో 20 మంది సజీవ దహనం కాగా.. చికిత్స పొందుతూ ఆదివారం ఇద్దరు మరణించారు. మరో ఏడుగురు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఒకరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ 30 మంది కాకుండా మిగిలిన 10 మంది ఏమయ్యారనే ప్రశ్నకు ఇప్పటివరకూ జవాబు దొరకడం లేదు. వీరు ఆ రోజు ఘటనా స్థలంలోనే ఉన్నారా లేక ప్రమాదం నుంచి తప్పించుకుని ఇళ్లకు వెళ్లిపోయారా అనే ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. దీనిని నిర్ధారించాలంటే సీసీ కెమెరాల ఫుటేజే ఆధారం. ఆ దిశగా అధికారులు దర్యాప్తు చేస్తారో లేదో వేచిచూడాలి. -
అత్యంత విషమంగా క్షతగాత్రుల ఆరోగ్యం
కాకినాడ క్రైం/సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో విస్ఫోటనం ఘటనలో తీవ్రంగా గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. శనివారం జరిగిన పేలుడులో 20 మంది మృతి చెందడం, మరో 11 మంది మంది గాయపడటం తెలిసిందే. వీరిలో తొమ్మిది మందిని చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా, వీరిలో సామర్లకోట కుమ్మరి వీధికి చెందిన దర్శిపాటి లోవరాజు (40) ఆదివారం తెల్లవారుజామున, దర్శిపర్తి రాజు (28) ఆదివారం రాత్రి మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 22కు చేరింది. భార్యాపిల్లలతో లోవరాజు మిగిలిన క్షతగాత్రుల్లో సప్పా సత్య వెంకట లక్ష్మి, మోర్తా శ్రీను, చిటికెల లక్ష్మిలను క్యాజువాలిటీ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరి ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. మిగిలిన క్షతగాత్రులు కాతేటి శ్రీను, వేమగిరి లోవరాజు, వేమగిరి దావీదు, పల్లాపాటి వేద శ్రీనులను బర్న్ వార్డుకు తరలించారు. బాధితులు మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక్కడ కేవలం నలుగురు మాత్రమే పని చేయాల్సి ఉండగా, ప్రమాదం జరిగిన సమయంలో కనీసం 45 మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పేలుడు ఘటనలో కొందరు అక్కడికక్కడే మరణించగా, కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. మరికొందరు షెడ్ల నుంచి బయటకు వచ్చి ద్విచక్ర వాహనాల్లో అక్కడి నుంచి తప్పించుకున్నారని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ కేవలం 5 కిలోల ముడి సరుకు మాత్రమే ఉంచేందుకు అనుమతి ఉండగా, 100–150 కిలోల మందు గుండు ఉంచడం వల్లే ఇంతటి భారీ విస్ఫోటనం సంభవించిందన్నారు. మృతదేహాల అప్పగింత 21 మంది మృతదేహాలకు ఆదివారం పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆ మృతదేహాలను మహాప్రస్థానం వాహనాలు, అంబులెన్సుల్లో ఆయా గ్రామాలకు తరలించి, కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. బాణసంచా తయారీకి వెళ్లవద్దని చెప్పినా వినకుండా వెళ్లి కుటుంబానికి ఆసరా లేకుండా చేశారని మృతుల కుటుంబ సభ్యులు రోదించారు. ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, ప్రమాదానికి గురైన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లైసెన్సుదారు అడబాల అర్జున్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను శనివారం బాణసంచా ఆర్డర్ల కోసం బయటకు వెళ్లానని, ఆ సమయంలో తయారీ కేంద్రంలో ఉన్న తన తండ్రి శ్రీను కూడా చనిపోయారని అర్జున్ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో అర్జున్‌కు నోటీసు ఇచ్చి, తండ్రి అంత్యక్రియలకు అనుమతించామని సీఐ చెప్పారు. కాగా, ఆదివారం ఉదయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జీజీహెచ్ వద్ద మృతుల కుటుంబాలను పరామర్శించారు. పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రమాదం బాణసంచా పేలుడులో ప్రాణాలు కోల్పోయిన 20 మంది కుటుంబాలను రాష్ట్ర మంత్రులు అనిత, పి.నారాయణ, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్ ఆదివారం పరామర్శించారు. వారికి ప్రభుత్వం నుంచి రూ.20 లక్షల చొప్పున ఆరి్థక సాయం చెక్కులు అందజేశారు. బాణసంచా తయారీ కేంద్రాన్ని పరిశీలించి, ప్రమాదంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువ మోతాదులో పేలుడు పదార్థాలను నిల్వ చేయడం, కార్మిక శాఖలో నమోదు చేసిన వారి కంటే ఎక్కువ మందిని పనిలో పెట్టడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇప్పటికే నలుగురు అధికారులను సస్పెండ్ చేసి, సమగ్ర విచారణకు ఆదేశించామని చెప్పారు. ఇళ్లు లేని కుటుంబాలకు ఇళ్లు కట్టించడంతో పాటు, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. -
హాహాకారాలు.. ఆర్తనాదాలు
పిఠాపురం: తల ఒకచోట.. మొండెం మరోచోట.. కాలు ఒకచోట.. చెయ్యి మరోచోట.. ఇలా ఏ అవయవం ఎక్కడుందో.. అది ఎవరిదో తెలీనంత అతి దారుణంగా బాణాసంచా పేలుడులో మృతుల శరీరాలు ఛిద్రమయ్యాయి. ఏది ఎవరి అవయవమో కూడా తెలీనంతగా కాలిపోయాయి. తమ వారి మృతదేహం ఎక్కడుందో తెలుసుకోడానికి మృతుల బంధువులు పడుతున్న వేదన.. చేస్తున్న ఆర్తనాదాలు అంతాఇంతా కాదు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం సంభవించిన బాణసంచా పేలుడు ఘటనలో అసలు అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు.. ఎంతమంది చనిపోయారు అనేది కూడా చెప్పడానికి ఎవరు లేకపోవడంతో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది.మా వాళ్లు బతికుండేలా చూడు దేవుడా..సంఘటన స్థలానికి చేరుకున్న మృతుల బంధువులు తమ వాళ్లు బతికున్నారో చనిపోయారో తెలీక ‘మా వాళ్లు బతికుండేలా చూడు దేవుడా’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఒకపక్క అధికారులు, సిబ్బంది మృతదేహాల భాగాలను పోగుచేస్తుంటే.. ఆ పోగులో తమ వారెవరైనా ఉన్నారా అంటూ వెతుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. బాణసంచా తయారీ పనికి వెళ్లిన వారి బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని తమ వారి జాడకోసం కాలువలు, చెట్లు, పుట్టలు, పొలాల్లో వెతుక్కుంటూ కనిపించారు. సంఘటన స్థలానికి దూరంగా ఉన్న కాలువల్లోనూ మృతదేహాల భాగాలు దొరకడంతో ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు గాలింపు చేపట్టారు. మొత్తం మీద 20 మృతదేహాలను గుర్తించినట్లు అధికారికంగా వెల్లడించగా.. తమవారి ఆచూకీ తెలీలేదంటూ కొందరు అధికారులకు సమాచారం ఇస్తున్నారు.అప్పుడు తప్పించుకుని.. ఇప్పుడు కాలిపోయాడు..గతంలో గ్రామంలో జరిగిన కొట్లాటలో గంపల నాగరాజు (55)ను కత్తులతో చంపడానికి కొందరు ప్రయత్నించగా అతను ఎలాగోలా తప్పించుకున్నాడు. బతుకు జీవుడా అంటూ మళ్లీ తన బతుకు తాను బతుకుతుంటే మృత్యువు పేలుడు రూపంలో అతడ్ని దహించేసిందని నాగరాజు బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన గంపల నాగరాజు, గంపల మంగ భార్యాభర్తలు. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో వీరు పనిచేస్తున్నారు. శనివారం జరిగిన విస్ఫోటంలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. అంత పెద్ద గొడవలోనూ బతికి బయటపడ్డాడనుకుంటే ఇప్పుడు మంటల్లో ఆహుతయ్యాడని.. తండ్రితో పాటు తల్లి కూడా కానరాని లోకాలకు వెళ్లిపోయిందని.. ఇక తమకు పెద్ద దిక్కెవరంటూ నాగరాజు కుమారుడు వెంకటన్న రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.నా మాట వినుంటే అల్లుడు బతికేవాడు..ఆ పని ప్రమాదకరమైంది.. ఆ పనిలోకి వెళ్లొద్దని ఎంత మొత్తుకున్నా వినకుండా బాణసంచా తయారీకి వెళ్లి చివరకు మృత్యువాతపడ్డాడని.. తన మాట వినుంటే తన అల్లుడు బతికేవాడని బాణసంచా ప్రమాదంలో మృతిచెందిన వల్లూరి రవి అత్త ముప్పిడి భద్రమ్మ కన్నీరుమున్నీరవుతోంది. పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన భద్రమ్మ కుమార్తె లక్ష్మికి, వేట్లపాలేనికి చెందిన రవితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె సోఫియా ఉంది. రోదిస్తున్న మృతుడు రవి అత్త భద్రమ్మ అయితే, మృతుడు రవికి కుట్టు మెషీన్, పెయిటింగ్ వంటి పనులు వచ్చు. కానీ, ఆ పనులు చేయకుండా బాణసంచా తయారీకి మాత్రమే వెళ్లేవాడు. దీంతో, ఆ పనికి వెళ్లొద్దంటూ తాను చాలాసార్లు వారించానని భద్రమ్మ రోదిస్తూ చెప్పింది. కావాలంటే కొత్త మెషీన్ కొనిస్తానని, దానిని కుట్టుకుని బతకమని ఎన్నోసార్లు చెప్పానని, అయినా తన మాట వినకుండా ఆ పనిలోకి వెళ్లి, తన అల్లుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడని, ఇక తన కూతురుకు మనవరాలికి దిక్కెవరంటూ భద్రమ్మ గుండెలవిసేలా రోదిస్తుంటే ఆపడం ఎవ్వరి తరం కాలేదు.మా అమ్మను చూపించండి..‘మా అమ్మ మందుగుండు సామగ్రి తయారుచేయడానికి వెళ్లింది. అందరూ చనిపోయారంటున్నారు.. మా అమ్మ కనిపిస్తే చూపించండి’.. అంటూ ఈ దుర్ఘటనలో అసువులు బాసిన వేట్లపాలేనికి చెందిన దూకెళ్ల దేవి కుమార్తె చంద్రకళ శోకతప్త హృదయంతో దీనంగా అడుగుతోంది. దీంతో ఏం చెప్పాలో తెలీక ఆమె బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మరోవైపు.. పేలుడులో మృతిచెందిన దేవి మృతదేహాన్ని సామర్లకోట ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచడంతో అక్కడ తన తల్లిని చూపించడంటూ చంద్రకళ గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. -
నేను బతికే ఉన్నానా!
పిఠాపురం: ‘నేను బతికే ఉన్నానా. బతికి ఉన్నానంటే నాకే నమ్మకం కుదరటం లేదు’అంటూ భయం నిండిన కళ్లతో వణికిపోతూ అడిగాడు సామర్లకోట మండలం వేట్లపాలెంలో పెను విస్ఫోటనం నుంచి బయటపడ్డ చాపల శామ్యూల్. పెద్దాపురానికి చెందిన శామ్యూల్ జరిగిన ఘోరాన్ని కళ్లారా చూసి.. పడిపోతూనే పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకుని మృత్యుంజయుడిగా మిగిలాడు. నిద్ర ముంచుకురావడంతో పడుకునేందుకు వెళ్తున్న శామ్యూల్ ప్రమాదం నుంచి తప్పించుకుని.. సామర్లకోట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ పెను విషాదంలో అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి అతడు తప్ప మిగిలిన వారెవరూ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ‘సాక్షి’తో శామ్యూల్ మాట్లాడుతూ.. ‘నేను పని చేస్తున్న బాణసంచా షెడ్లో నాతోపాటు ఆరుగురం ఉన్నాం. ఆర్డర్ ఎక్కువగా ఉంది. ఎక్కువ సరుకు కావాలన్న ఉద్దేశంతో మందుగుండు సామగ్రి ఎక్కువగా తయారు చేయిస్తున్నారు. అందుకే రోజూ కంటే శనివారం ఎక్కువ మంది పనిలో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అందరం భోజనాలకు లేచాం. భోజనాలు పూర్తయ్యాక కొందరు ఒకచోట కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. నాతో సహా మరి కొందరు షెడ్లలోనే ఉన్నారు. ఇంతలో నాకు నిద్ర వచ్చింది. కునుకుపాట్లు పడుతుండటంతో అందరితో మాట్లాడుతున్న నేను సెల్‌ఫోన్ తీసుకుని పాటలు పెట్టుకుందాంమని పైకి లేచాను. షెడ్ చూరుకు తగిలించి ఉన్న నా చొక్కా జేబులో ఉన్న సెల్ తీసుకుందామని వెళ్లబోతుండగా నా వెనుక నుంచి భారీ శబ్దాలతో మంటలు ఎగసిపడటం కనిపించింది. వెంటనే పరుగు తీశాను. అప్పటికే నాకు మంటల వేడి తగిలి పరుగెత్తలేక కిందపడ్డాను. అయినా తెగించి మళ్లీ లేచి పరుగెత్తాను. కొంత దూరం వచ్చి పడిపోయాను. ఇంతలో నేను పని చేస్తున్న షెడ్లో ఉన్నవారు వారంతా మంటల్లో చిక్కుకుపోయారు. వారు కూర్చున్న చోటు నుంచి లేచే అవకాశం కూడా లేకుండా మంటల్లో కాలిపోయారు. నాకు నిద్ర రాకపోతే మంటల్లో కాలిపోయేవాడిని. ఎలా పరుగెత్తానో నాకే తెలియదు. నేను బతికి ఉన్నానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను’అని శామ్యూల్ చెప్పాడు. -
భారీ విస్ఫోటనం.. మాటలకందని విషాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం సంభవించింది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రం శనివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో భారీ శబ్దంతో పేలిపోయి భస్మీపటలమైంది. 20 మంది కూలీలు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 11 మంది కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మృతులందరూ పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం, సామర్లకోట, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం, గూడపర్తి గ్రామాలకు చెందిన వారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు. సామర్లకోట – పెదపూడి రోడ్డును ఆనుకుని పంట పొలాల మధ్య సుమారు మూడెకరాల్లో ఈ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. ఉదయం బాణసంచా కేంద్రంలోని నాలుగు షెడ్లలో 60 మంది వరకూ కూలీలు మందు గుండు తయారీలో నిమగ్నమయ్యారు. సహజంగా ప్రతి రోజూ ఈ కేంద్రంలో 10–15 మంది పని చేస్తూంటారు. అయితే జగ్గంపేట మండలం మల్లిశాలలో జాతరకు భారీ ఆర్డర్ రావడంతో పాటు పెళ్లిళ్లు కూడా ఎక్కువగా ఉండటంతో బాణసంచాకు డిమాండ్ పెరిగింది. దీంతో 60 మందికి పైగా కూలీలతో పని చేయిస్తున్నారు. రాకెట్లు, జువ్వలు, సెర్చ్లైట్లు, మిడతల దండు, డిస్కో బుడ్లు, చిచ్చు బుడ్లు తయారు చేస్తున్నారు. పైగా మల్లిశాలలో జాతర కోసం సిద్ధమైన మందు గుండును కూడా ఇక్కడున్న గోడౌన్లోనే నిల్వ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అందరూ భోజనాలకు బయటకు వచ్చారు. 1.30 గంటలకంతా భోజనం ముగించుకున్న కూలీల్లో 30–40 మంది తిరిగి ఆ నాలుగు షెడ్లలోకి వెళ్లి పనిలో నిమగ్నం అయ్యారు. మరికొందరు బయటే సేద తీరారు. ఇంకొందరు సమీపంలోనే ఊరు ఉండటంతో భోజనానికి ఇంటికెళ్లి తిరిగి వస్తున్నారు. వేట్లపాలెం వద్ద జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలు పేద్ద శబ్దం.. ఎగిరిపడ్డ దేహాలుమధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. నాలుగు షెడ్లలో ఉన్న బాణసంచా ఒకదాని తర్వాత మరొకటి పేలిపోవడంతో చెవులు చిల్లులు పడేలా భయంకరమైన శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి షెడ్లలో ఉన్న కూలీలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు మృతుల శరీర భాగాలు 20–30 అడుగుల ఎత్తున ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల్లో కాలిపోయిన మృతదేహాలు తునాతునకలైపోయాయి. శరీరాలు గుర్తు పట్టలేని రీతిలో చిధ్రమైపోయాయి. కొందరి తలా, మొండెం, కాళ్లు, చేతులు వేర్వేరు ప్రాంతాల్లో, సమీపంలోని పంట కాలువలు, పచ్చని వరి పొలాల్లో దూరంగా పడ్డాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. సంఘటన ప్రాంతమంతా మృతులు, క్షతగాత్రుల బంధువుల ఆర్తనాదాలతో హృదయ విదారకరంగా మారింది. భీతావహ దృశ్యంపేలుడు ధాటికి ఘటన స్థలి ఎటుచూసినా మంటల్లో కాలిపోయిన కూలీల మృతదేహాలతో భయానక వాతావరణం కనిపించింది. ఆ సమయంలో పనిలో ఉన్నవారెవరు, ఎంత మంది మృతి చెందారు, ఎవరు మిగిలి ఉన్నారనేది తెలియక గందరగోళ పరిస్థితి నెలకొంది. చుటు్టపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చారు. పేలుడు ధాటికి సంఘటన స్థలానికి రెండు కిలోమీటర్ల దూరాన సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డులో ఉన్న గూడపర్తిలోని ఇళ్లల్లో ఉన్న వారు భూకంపం వచ్చినట్టు భయపడి బయటకు పరుగులు తీశారు. ఇంటిపై ఉన్న ఇనుప రేకుల నుంచి సైతం శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. వేట్లపాలెం, గూడపర్తి, పెదబ్రహ్మదేవం, జి.మేడిపాడు గ్రామాలకు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కాగా, మృతదేహాలను సేకరించేందుకు స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. కాలువలు, చేలల్లో గాలింపు చేపట్టి నుజ్జునుజ్జు అయిన శరీర భాగాలను సేకరించి ఒక చోటకు చేర్చారు. ఏది ఎవరి అవయవమో గుర్తించలేక కొన్నింటిని మూటలు కట్టారు. ఇలా అన్ని మృతదేహాలను, మూటలను అతి కష్టం మీద సామర్లకోట ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉండగా బాణసంచా నాణ్యత కోసం అధిక మోతాదులో సల్ఫర్, సూరేకారం కూరడం వల్లే ఒత్తిడికి గురై విస్ఫోటనం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.సూర్యశ్రీ ఫైర్వర్క్స్లో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది 11 మంది క్షతగాత్రులు వీరేసప్పా సత్య వెంకట లక్ష్మి, మోర్తా శ్రీను, కాతేటి శ్రీను, చిటికెల లక్ష్మి, దర్శిపర్తి రాజు, వేమగిరి లోవరాజు, వేమగిరి దావీదు, పల్లాపాటి వేద శ్రీను, దర్శిపాటి లోవరాజు, పెద్దాపురానికి చెందిన చాపల శామ్యూల్, వేట్లపాలేనికి చెందిన పచ్చిగళ్ల నూకరాజు తీవ్రంగా గాయపడ్డారు. 70 శాతం కాలిన గాయాలతో వీరు కాకినాడ జీజీహెచ్ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు .20 మంది మృతులు వీరేవేట్లపాలేనికి చెందిన గంధి మంగ (43), వల్లూరి రవి (35), కడింపల్లి కృపమ్మ, గంపల మంగ, గంపల నాగరాజు, బిక్కిన కరుణ సుబ్బారావు (45), సాధనాల సత్యవేణి (44), గొడతా నాని (26), సంకుమళ్ల రాఘవ (50), ఫైర్క్స్ యజమాని అర్జున్ తండ్రి అడబాల శ్రీనివాసరావు (55), దుర్గానగర్‌కు చెందిన తుంపల లోవ (38), నూకెళ్ల దేవి (45), జొన్నలదొడ్డికి చెందిన చింతల రమణ (60), గూడపర్తికి చెందిన మందపల్లి చిన్ని (44), గొడత మహేష్ (41), గొడత వీర వెంకట రమణ (48), కడింపల్లి ధనరాజు (55), కుమ్మరి వీధికి చెందిన దర్శిపాటి నాని (38), యేడిద సంపత్ కుమార్ (25), పెదబ్రహ్మదేవం గ్రామానికి చెందిన మాకర రాఘవమ్మ (55) మృతి చెందారు.ఫైరింజన్లు వెళ్లలేక... పెరిగిన ప్రమాద తీవ్రతసంఘటన స్థలానికి సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు నుంచి వెళ్లాలంటే సింగిల్ రోడ్డు. అది చాలా ఇరుకుగా ఉండటంతో ఆ సమయానికి అంబులెన్సులు చేరుకోలేకపోయాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. విస్ఫోటనం తీవ్ర స్థాయిలో ఉండటం, రెండు గంటల పాటు పేలుళ్లు కొనసాగడంతో స్థానికులు కూడా ఘటన స్థలి దగ్గరి వరకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. చివరకు ధైర్యం చేసి కొందరు స్థానికులు పేలుడు సంభవించిన ప్రాంతానికి చేరుకున్నారు. కానీ, అప్పటికే చాలా మంది అగ్నికి ఆహుతయ్యారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాణసంచా తయారీ కేంద్రం పొలాల మధ్య ఉండటంతో అక్కడకు ఫైరింజన్, అంబులెన్స్ వెళ్లే మార్గం కూడా లేదు. వరి పొలాలు బురద మయంగా ఉండటంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉండగా జీజీహెచ్‌లో క్షతగ్రాత్రులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అంతకు ముందు హోం మంత్రి అనిత సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనపై సామర్లకోట తహశీల్దార్ కొవ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫైర్ వర్క్స్ యజమాని అడబాల అర్జున్‌పై కేసు నమోదు చేశారు. శ్మశానంలా మారిన ప్రమాద స్థలం వద్ద గుమిగూడిన వేట్లపాలెం ప్రాంత ప్రజలు నా మనసును కలచివేసింది సాక్షి, అమరావతి: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగి, పలువురు మృతి చెందడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారందరికీ అత్యుత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని, బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు అవుతున్నాయా? లేదా? అన్నదానిపై పరిశీలన చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తగిన పరిహారం ప్రకటించి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ‘ఎక్స్’లోనూ పోస్టు చేశారు. -
వద్దురా అంటే వినలేదు.. వద్దురా అంటే వినలేదు.. కాకినాడ ప్రమాదం బాధితుల కన్నీటి పర్యంతం
-
వేట్లపాలెం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాన సానుభూతి తెలిపారు మోదీ. మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కాగా, వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుని 23 మంది వరకూ మరణించారు. ఆ ప్రమాద సమయంలో 70 మంది వరకూ ఆ తయారీ కేంద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇవీ చదవండివేట్లపాలెంలో భారీ పేలుడు.. భారీ ప్రాణనష్టంవేట్లపాలెం అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి -
Vetlapalem : 18 మంది సజీవ దహనం
-
కాకినాడ జిల్లాలో భారీ పేలుడు.. మంటల్లో 50 మంది..!
-
వేట్లపాలెం అగ్నిప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
తాడేపల్లి : కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత విషాదకరమన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై ఆవేదన వ్య క్తం చేశారు వైఎస్ జగన్.‘వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో పలువురు కార్మికులు మృతి చెందడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలి’ అని వైఎస్ జగన్ సూచించారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటన తీవ్రంగా కలచివేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ప్రకటించి అండగా నిలవాలి. గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం…— YS Jagan Mohan Reddy (@ysjagan) February 28, 2026 కాకినాడ: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం -
కాకినాడ జిల్లా: రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. ముగ్గురి మృతి
సాక్షి, కాకినాడ జిల్లా: సామర్లకోట మండలం వేట్లపాలెంలో దారుణం జరిగింది. ఇంటి స్థలం విషయంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిపై మరో కుటుంబం దాడి చేసింది. ఘర్షణలో కత్తులతో దాడి చేసుకోవడంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఏం జరిగిందంటే?గ్రామంలోని ఎస్సీపేట చెరువు సమీపంలో పండు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టారు. అదే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు బచ్చల చక్రయ్య కుటుంబం ప్రయత్నించింది దీంతో ఇరువురి కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కత్తులతో పరస్పరం దాడి చేసుకోవడంతో ప్రకాశ్‌రావు అక్కడికక్కడే మృతి చెందగా.. చంద్రరావు, ఏసు ఆసుపత్రిలో మృతి చెందారు. తీవ్ర గాయాలైన సంజీవ్, పండు, దావీదు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సామర్లకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భక్తిశ్రద్ధలతో బేతాళస్వామి సంబరం
సామర్లకోట: వేట్లపాలెంలో కొలువైన బేతాళస్వామి సంబరం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఏటా విజయ దశమి అనంతరం వైభవంగా ఈ కార్యక్రమం జరుపుతారు. ఉత్సవంలో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. సంబరం సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. దేవతామూర్తుల వేషధారణలతో గ్రామ పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.


