నేను బతికే ఉన్నానా! | Samuel survived the massive explosion | Sakshi
Sakshi News home page

నేను బతికే ఉన్నానా!

Mar 1 2026 4:43 AM | Updated on Mar 1 2026 4:43 AM

Samuel survived the massive explosion

వణికిపోతూ అడిగిన బాణసంచా పేలుడు ఘటన బాధితుడు చాపల శామ్యూల్‌ 

నిద్రమత్తే అతడిని కాపాడింది 

పెనువిస్ఫోటనం నుంచి ప్రాణాలతో బయటపడ్డ మృత్యుంజయుడు

పిఠాపురం: ‘నేను బతికే ఉన్నానా. బతికి ఉన్నానంటే నాకే నమ్మకం కుదరటం లేదు’అంటూ భయం నిండిన కళ్లతో వణికిపోతూ అడిగాడు సామర్లకోట మండలం వేట్లపాలెంలో పెను విస్ఫోటనం నుంచి బయటపడ్డ చాపల శామ్యూల్‌. పెద్దాపురానికి చెందిన శామ్యూల్‌ జరిగిన ఘోరాన్ని కళ్లారా చూసి.. పడిపోతూనే పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకుని మృత్యుంజయుడిగా మిగిలాడు. నిద్ర ముంచుకురావడంతో పడుకునేందుకు వెళ్తున్న శామ్యూల్‌ ప్రమాదం నుంచి తప్పించుకుని.. సామర్లకోట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఈ పెను విషాదంలో అక్కడ ఏం జరిగిందో చెప్పడానికి అతడు తప్ప మిగిలిన వారెవరూ మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ‘సాక్షి’తో శా­మ్యూల్‌ మాట్లాడుతూ.. ‘నేను పని చేస్తున్న బాణసంచా షెడ్‌లో నాతోపాటు ఆరుగురం ఉన్నాం. ఆర్డర్‌ ఎక్కువగా ఉంది. ఎక్కువ సరుకు కావాలన్న ఉద్దేశంతో మందుగుండు సామగ్రి ఎక్కువగా తయారు చేయిస్తున్నారు. అందుకే రోజూ కంటే శనివారం ఎక్కువ మంది పనిలో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అందరం భోజనాలకు లేచాం.  

భోజనాలు పూర్త­య్యాక  కొందరు ఒక­చోట కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటు­న్నారు. నాతో సహా మరి కొందరు షెడ్లలోనే ఉన్నారు. ఇంతలో నాకు నిద్ర వచ్చింది. కునుకుపాట్లు పడుతుండటంతో అందరితో మాట్లాడుతున్న నేను సెల్‌ఫోన్‌ తీసుకుని పాటలు పెట్టుకుందాంమని పైకి లేచాను. షెడ్‌ చూరుకు తగిలించి ఉన్న నా చొక్కా జేబులో ఉన్న సెల్‌ తీసుకుందామని వెళ్లబోతుండగా నా వెనుక నుంచి భారీ శబ్దాలతో మంటలు ఎగసిపడటం కనిపించింది. వెంటనే పరుగు తీశాను. 

అప్పటికే నాకు మంటల వేడి తగిలి పరుగెత్తలేక కిందపడ్డాను. అయినా తెగించి మళ్లీ లేచి పరుగెత్తాను. కొంత దూరం వచ్చి పడిపోయాను. ఇంతలో నేను పని చేస్తున్న షెడ్‌లో ఉన్నవారు వార­ంతా మంటల్లో చిక్కుకు­పోయారు. వారు కూర్చు­న్న చోటు నుంచి లేచే అవకాశం కూడా లేకుండా మంటల్లో కాలిపోయారు. నాకు నిద్ర రాకపోతే మంటల్లో కాలిపోయేవాడిని. ఎలా పరు­గెత్తానో నాకే తెలియదు. నేను బతికి ఉన్నానంటే ఇప్ప­టికీ నమ్మలేకపోతున్నాను’అని శామ్యూల్‌ చెప్పా­డు. 

Advertisement
 
Advertisement
Advertisement