తాడేపల్లి : వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేట్లపాలెం ఘటన తీవ్రంగా కలిచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు చంద్రశేఖర్. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన కోరారు. ఈరోజు(శనివారం, ఫిబ్రవరి 28వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా ఇంకా లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు.
లడ్డూ, ఇందాపూర్ విషయాలపై చర్చకు రమ్మంటే ఎందుకు రావటం లేదు?, ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది?, ఇందాపూర్ డెయిరీకి కాంట్రాక్టు ఇవ్వటం వెనుక స్కాం ఉంది. 900 కిమి దూరంలో ఉన్న ఇందాపూర్ కు కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారు?, వైష్ణవి డెయిరీకి టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర సంబంధం ఉంది. ఆయనకు చెందిన సంగం డెయిరీతో వైష్ణవి డెయిరీకి సంబంధం ఉంది. టీటీడీ నిధులను కొల్లగొట్టటానికే అక్రమంగా కాంట్రాక్టు పొందారు. మూడుసార్లు టెండర్ పిలిచి ఎవర్నీ రాకుండా అడ్డుకున్నారు. తర్వాత సంగం డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చారు. అసలు సంగం డెయిరీకి ఆవు నెయ్యి సరఫరా చేసే అవకాశం లేదు. కానీ నెయ్యి కాంట్రాక్టు ఎలా ఇచ్చారు?, లోకేష్ రెడ్ బుక్ కు మా పార్టీలోని కుక్కలు కూడా భయపడవు. రెడ్ బుక్ వలనే కూటమి ప్రభుత్వం అభాసుపాలయింది’ అని ధ్వజమెత్తారు.
ఇక ఏపీలో సంక్షేమం పేరుతో వృద్ధులు, దివ్యాంగులు కడుపు కొడుతున్నారని విమర్శించారు. వారికి నెలకు రూ. 25 వేల చొప్పన పెన్షన్లు కట్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రతీనెలా మీటింగ్ పెట్టి చేస్తున్నది ఇదే. అసెంబ్లీలో చర్చకు రమ్మంటే పారిపోయారు. మండలి చైర్మన్‌ని ఒక మంత్రి డిక్టేట్ చేయడం బాధాకరం’ అని మండిపడ్డారు.


