కలెక్టర్.. ఆ 30 ఎకరాల లెక్క చెప్పగలడా?: ఈటల ఫైర్‌ | BJP MP Etala Rajender Slams Congress Government Over Khammam Land Evictions And Demands Justice For Poor | Sakshi
Sakshi News home page

కలెక్టర్.. ఆ 30 ఎకరాల లెక్క చెప్పగలడా?: ఈటల ఫైర్‌

Feb 28 2026 1:43 PM | Updated on Feb 28 2026 1:51 PM

BJP MP Etela Rajender Serious Comments On Khammam Land Issue

సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు పంచడం చేత కాదు.. భూములు లాక్కోవడం మాత్రమే తెలుసు అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పోవాలని ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కబ్జా చేసిన పెద్దల వద్ద ఉన్న భూములు తీయగలరా? అని ప్రశ్నించారు.

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ శనివారం ఖమ్మంలోని భూదాన్ భూములను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. అనంతరం, ఈటల మీడియాతో మాట్లాడుతూ..‘గత ఐదు రోజులుగా వెలుగుమట్ల ప్రాంతంలో ప్రజల కన్నీళ్లతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఈ ప్రభుత్వం పోవాలని ప్రజలు శాపనార్థాలు పెట్టారు. మొదటి నుంచి కాంగ్రెస్ ఇదే పద్ధతి కొనసాగించారు. జిల్లాలో సీపీఐ మినహా అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీవే కదా?. కీలక మంత్రి పదవులు ఇక్కడే కదా. తమకు న్యాయం జరుగుతుందని జనం సంబురపడ్డారు. కానీ, ఇలా తన ఇళ్లనే కూల్చివేస్తారని అనుకోలేదు.

భూదాన్‌ భూమి అంటే దానం చేసిన భూమి అని తెలియదా?. వినోబా భావే అనే వ్యక్తి వేల ఎకరాలు దానం చేశారు. 147,148, 149 సర్వే నెంబర్లలో 62 ఎకరాల భూదాన్ భూమి ఉంది. ఆనాడు ఈ భూములను ఎవరు దేకలేదు. ఇపుడు ధర పెరగడంతో వాళ్ల కన్ను ఇటు పడింది. రేవంత్ రెడ్డిది కూల్చివేతల ప్రభుత్వం. భూములు పంచడం చేత కాదు. భూములు లాక్కోవడం మాత్రమే తెలుసు. 2019లో చల్లా కోదండరాం అనే జడ్జి ఈ పేదలకు కరెంట్, నీళ్లు ఇవ్వండి అంటే ఆనాటి ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వకపోగా ఉన్నది లాక్కున్నారు. ఏ కోర్టు ఆర్డర్ మీకు ఇల్లు కూల్చమని ఇచ్చింది?. వీళ్లే బలవంతంగా లాక్కున్నారు. కబ్జా చేసిన పెద్దల వద్ద ఉన్న భూములు తీయగలరా?. పెద్దల జోలికి పోయే దమ్ము మీకు ఉందా?. 62 ఎకరాల్లో 32 ఎకరాలు సరే.. మిగతా 30 ఎకరాలు ఏమయ్యాయి?. కలెక్టర్ ఆ 30 ఎకరాల లెక్కచెప్పగలడా?.

పేదల కళ్లలో మట్టి కొట్టిన దుర్మార్గపు ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వం. జిల్లాలో ఉన్న భూదాన్ భూముల వివరాలు మొత్తం బయటకు తీయాలి. తప్పు జరిగిందని సీఎం బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పేదలే నీకు ఓట్లు వేసింది. పేరుకు మాత్రమే పేదల పార్టీ, చేతల పార్టీ కాదు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి సత్వర న్యాయం చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement