సాక్షి, నారాయణపేట : తెలంగాణలో మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా తనను చంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అనేక రకాలుగా అవమానాలకు గురిచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనేక అభాండాలు తన మీద వేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంత్రి వాకిటి శ్రీహరి తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘దేవుడు మనకు మరణం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడే చనిపోతాం. నన్ను చంపాలని చాలా ప్రయత్నాలు చేశారు. చావుకు నేను భయపడను. అవమానాలు పడినందుకే రాజకీయాల్లో వచ్చాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం పని చేసుకుంటూ, మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాడుపడుతున్నాను. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అనేక అభాండాలు నా మీద వేశారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మక్తల్ మున్సిపల్‌లో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు.
72 సంవత్సరాల్లు 14 మంది ఎమ్మెల్యేలు మక్తల్ నియోజకవర్గానికి తెచ్చింది రూ.296 కోట్లు మాత్రమే. రెండేళ్లలో మాత్రం రూ. 1035 కోట్లు తెచ్చాను.
ప్రశ్నించడం మంచిదే కానీ ప్రాంతం అభివృద్ధి కోసం పనిచేసే వాళ్లను అవమానించవద్దు. అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారు, అయినా ముందుకు పోతున్నాం. అనేక రకాలుగా అవమానాలకు గురిచేస్తున్నారు. ఎన్ని అవమానాలు చేసినా నేను భయపడను, బెదరను, అభివృద్ధి కోసమే పనిచేస్తాను.
ఈ ప్రాంతం అనేక రంగాల్లో ఆర్ధికంగా ఎదగలేని పరిస్థితి నుంచి అభివృద్ధి వైపు ఈ ప్రాంతాన్ని నడిపిస్తాను. ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌లో అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తాను’ అని అన్నారు.


