breaking news
Vakiti Srihari
-
2036 ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: మైదానంలో తెలంగాణ సిద్ధంగా ఉందని, 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి ఒక్క పతకమైనా తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం గ్లోబల్ సమ్మిట్–2027’కార్యక్రమంలో ‘తెలంగాణ–ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’సెషన్లో ఆయన పాల్గొన్నారు. ఊరు, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులను తయారు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సీఎం కప్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వివిధ క్రీడల్లో.. 450 మంది నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించామని, వీరందరికీ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లేందుకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ, తెలంగాణలో నిఖత్ జరీన్, సానియా మీర్జా, పీవీ సింధు, గుత్తా జ్వాల వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు క్రీడలలో తమదైన ముద్ర వేశారని చెప్పారు. క్రీడాకారులకు సరైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే మరింత రాణించగలుగుతారని, క్రీడాకారులపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలన్నారు. కుటుంబ బాధ్యతలతో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు తమ దృష్టిని మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై ప్రభుత్వం వారికి ధీమాను అందించగలిగితే బాగుంటుందని పేర్కొన్నారు. ఆత్మస్థైర్యం నింపాలి: అనిల్ కుంబ్లే క్రీడాకారులకు శిక్షణ ఒక్కటే సరిపోదు. వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. పరిశ్రమ నిపుణులతో భాగస్వామ్యం కావడం అతిముఖ్యం. 2030 నాటికి దేశంలో 120 బిలియన్ డాలర్ల స్పోర్ట్స్ అండ్ ఎకో సిస్టమ్ పరిశ్రమలో వ్యాపార అవకాశాలు ఉన్నాయి. క్రీడల్లో సీఎం మక్కువ అభినందనీయం: గోపీచంద్ క్రీడాకారులకు శారీరక సామర్థ్యం, అక్షరాసత్య ముఖ్యం. ముఖ్యమంత్రికి ఆటలపై మక్కువ ఉండటం అభినందించదగ్గ పరిణామం. అందుకే క్రీడా పాలసీలో స్పోర్ట్స్ హబ్, యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి పిల్లాడు ఏదో ఒక క్రీడలో భాగస్వామ్యం అయ్యేలా చూడాలి. క్రీడలతో మానసికోల్లాసమే కాదు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఫౌండేషన్ బలంగా ఉండాలి: పీవీ సింధు ఫౌండేషన్ బలంగా ఉంటేనే క్రీడల్లో రాణించగలం. అందుకే ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై మక్కువ కలిగేలా, క్రీడలను ప్రోత్సహించాలి. ప్రతీ అకాడమీ, మైదానం చాలా ముఖ్యం. శారీరక, సాంకేతిక వ్యూహాలు కీలకమే డానీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు వీటా డానీ నేటి సమాజంలో యువతకు చదువొక్కటే కాదు క్రీడలు, నైపుణ్యత కూడా ముఖ్యమే. భారతీయ పిల్లలకు క్రీడలలో అపారమైన సామర్థ్యం ఉంది. ఇలాంటి వారికి శారీరక, సాంకేతిక వ్యూహాలను అందిస్తే మరింత మెరికల్లా తయారవుతారు. ప్రభుత్వం వ్యక్తిగత ఆటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. శిక్షకుడి సంక్షేమం ముఖ్యం: గుత్తా జ్వాల శిక్షకుడి సంక్షేమం అత్యంత ముఖ్యం. మన రాష్ట్రంలో అండర్ కాంట్రాక్ట్ కోచ్‌లు ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ క్రీడా పాలసీలో శిక్షకులను కూడా భాగస్వామ్యం చేయడం అభినందించదగిన పరిణామం. మంచి శిక్షకులు ఉంటే మంచి క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. -
ఘనంగా రెండవ రోజు తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ -2047
తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ -2047 లో భాగంగా తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సదస్సు లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ... రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడా విధానంలో సంస్కరణలు తీసుకొస్తూ క్రీడా పాలసీని ప్రకటించడం జరిగిందని తెలిపారు.2036 ఒలంపిక్స్ లో, అంతర్జాతీయ స్థాయి పోటీలో తెలంగాణ క్రీడాకారుల ప్రాతినిధ్యం పెంచే లక్ష్యంగా పాలసీని అమలు చేస్తున్నామని తెలిపారు. క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పెద్దలతో కమిటీ సభ్యులుగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ను ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా నిధుల సమీకరణ కోసం స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీని నూతనంగా ఏర్పాటు చేశామని మంత్రి తెలియజేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ద్వారా పాఠశాల స్థాయి నుండే క్రీడా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా బాలికలకు, పారా అథ్లెట్ ల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్లోని క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు లౌబరో యూనివర్సిటీ, కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీ వంటి సంస్థలను భాగస్వాములుగా చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణలోనే 119 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాలు, గ్రామాల్లో క్రీడా మైదానాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వెయ్యి ఎకరాల్లో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేసి తద్వారా ఒలంపిక్, అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్లకు ఆతిథ్య కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. స్పోర్ట్స్- టెక్ స్టార్టప్ లు టూరిజం లాంటివి అన్నీ టీ- హబ్, టి.ఎస్- ఐ పాస్ భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయన్నారు. అథ్లెట్ ల సంక్షేమానికి మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. వారికోసం గ్రేడెడ్ ఇంటెన్సివ్ లు, ఇన్సూరెన్సు, గురువందనం లాంటి స్కీములు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం కోచింగ్ మౌలిక సదుపాయాలు ఇన్నోవేషన్ అథ్లెట్ డెవలప్మెంట్ రంగాల్లో తోడ్పాటుకు భాగస్వాములు కావడానికి ఈ వేదిక ద్వారా ఆహ్వానిస్తున్నామన్నారు.ఈ సదస్సులో మైనారిటీ శాఖ మంత్రి, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ.పీ జితేందర్ రెడ్డి,స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి,స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లె,అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్ పీ.వీ సింధు, జ్వాలా గుత్తా, స్పోర్ట్స్ సీనియర్ జర్నలిస్ట్ బాలా మజుందార్, స్పోర్ట్స్ హబ్ మెంబర్ వితాదాని తదితరులు పాల్గొన్నారు -
అభివృద్ధికే జూబ్లీహిల్స్ ఓటర్ల పట్టం: మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, సాక్షి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ.. ఎర్లీ ట్రెండ్స్‌పై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి సాక్షితో స్పందించారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారని శుక్రవారం ఉదయం అన్నారాయన. ‘‘జూబ్లీహిల్స్ ఓటర్లు మూడు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. కానీ అభివృద్ధి కాలేదు. అధికారం కోల్పోయి.. ఇప్పుడు సిట్టింగ్ స్థానం కోల్పోతున్నామనే బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతోంది. వాళ్లు ప్రజలను ప్రలోభాలకు గురి చేసినట్టు మేము కూడ చేస్తామనుకుంటున్నారు, వాళ్లు చేసినట్లు మద్యం, డబ్బులు పంచుతామని అనుకున్నారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడిగాం. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ప్రజలకు చిన్నచిన్న కోరికలు ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ల పదేళ్ల కాలంలో ఆ కోరికలను కూడా తీర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అని అన్నారాయన. -
వరల్డ్‌కప్ విజేత అరుంధతి రెడ్డికి మంత్రి వాకిటి శ్రీహరి సన్మానం
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 గెలిచిన భారత జట్టులో సభ్యురాలైన అరుంధతి రెడ్డి (Arundhati Reddy) గురువారం.. స్వస్థలం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమెకు ఘన స్వాగతం లభించింది. తాజాగా.. అరుంధతి రెడ్డి తెలంగాణ క్రీడా శాఖా మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari)ని మర్యాద పూర్వకంగా కలిసింది.ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి.. వరల్డ్‌కప్ విజేత అరుంధతి రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండి డాక్టర్ సోనీ బాలాదేవి, కోచ్ ఆకాశ్, అరుంధతి తల్లి భాగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత జట్టు సౌతాఫ్రికాను ఓడించి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే.నలభై ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మొట్టమొదటిసారి భారత మహిళా జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా దశాబ్దాల కలను నెరవేరుస్తూ నవీ ముంబై వేదికగా ట్రోఫీని అందుకుంది. ఇక ఈ జట్టులో హైదరాబాదీ అరుంధతి రెడ్డితో పాటు.. కడప బిడ్డ శ్రీ చరణి కూడా భాగస్వాములుగా ఉన్నారు.


