గ్లోబల్ సమ్మిట్ ‘తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ సెషన్‌లో మంత్రి వాకిటి శ్రీహరి
క్రీడాకారులపై ఒత్తిడి లేకుండా చూడాలి: అజహరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: మైదానంలో తెలంగాణ సిద్ధంగా ఉందని, 2036 ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి ఒక్క పతకమైనా తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం గ్లోబల్ సమ్మిట్–2027’కార్యక్రమంలో ‘తెలంగాణ–ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’సెషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఊరు, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులను తయారు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
సీఎం కప్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వివిధ క్రీడల్లో.. 450 మంది నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించామని, వీరందరికీ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లేందుకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర మంత్రి అజహరుద్దీన్ మాట్లాడుతూ, తెలంగాణలో నిఖత్ జరీన్, సానియా మీర్జా, పీవీ సింధు, గుత్తా జ్వాల వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు క్రీడలలో తమదైన ముద్ర వేశారని చెప్పారు.
క్రీడాకారులకు సరైన శిక్షణ, ప్రోత్సాహం అందిస్తే మరింత రాణించగలుగుతారని, క్రీడాకారులపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలన్నారు. కుటుంబ బాధ్యతలతో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు తమ దృష్టిని మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై ప్రభుత్వం వారికి ధీమాను అందించగలిగితే బాగుంటుందని పేర్కొన్నారు.
ఆత్మస్థైర్యం నింపాలి: అనిల్ కుంబ్లే
క్రీడాకారులకు శిక్షణ ఒక్కటే సరిపోదు. వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి. పరిశ్రమ నిపుణులతో భాగస్వామ్యం కావడం అతిముఖ్యం. 2030 నాటికి దేశంలో 120 బిలియన్ డాలర్ల స్పోర్ట్స్ అండ్ ఎకో సిస్టమ్ పరిశ్రమలో వ్యాపార అవకాశాలు ఉన్నాయి.
క్రీడల్లో సీఎం మక్కువ అభినందనీయం: గోపీచంద్
క్రీడాకారులకు శారీరక సామర్థ్యం, అక్షరాసత్య ముఖ్యం. ముఖ్యమంత్రికి ఆటలపై మక్కువ ఉండటం అభినందించదగ్గ పరిణామం. అందుకే క్రీడా పాలసీలో స్పోర్ట్స్ హబ్, యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి పిల్లాడు ఏదో ఒక క్రీడలో భాగస్వామ్యం అయ్యేలా చూడాలి. క్రీడలతో మానసికోల్లాసమే కాదు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
ఫౌండేషన్ బలంగా ఉండాలి: పీవీ సింధు
ఫౌండేషన్ బలంగా ఉంటేనే క్రీడల్లో రాణించగలం. అందుకే ప్రభుత్వం పాఠశాల స్థాయి నుంచే క్రీడలపై మక్కువ కలిగేలా, క్రీడలను ప్రోత్సహించాలి. ప్రతీ అకాడమీ, మైదానం చాలా ముఖ్యం.
శారీరక, సాంకేతిక వ్యూహాలు కీలకమే డానీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు వీటా డానీ
నేటి సమాజంలో యువతకు చదువొక్కటే కాదు క్రీడలు, నైపుణ్యత కూడా ముఖ్యమే. భారతీయ పిల్లలకు క్రీడలలో అపారమైన సామర్థ్యం ఉంది. ఇలాంటి వారికి శారీరక, సాంకేతిక వ్యూహాలను అందిస్తే మరింత మెరికల్లా తయారవుతారు. ప్రభుత్వం వ్యక్తిగత ఆటలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
శిక్షకుడి సంక్షేమం ముఖ్యం: గుత్తా జ్వాల
శిక్షకుడి సంక్షేమం అత్యంత ముఖ్యం. మన రాష్ట్రంలో అండర్ కాంట్రాక్ట్ కోచ్‌లు ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ క్రీడా పాలసీలో శిక్షకులను కూడా భాగస్వామ్యం చేయడం అభినందించదగిన పరిణామం. మంచి శిక్షకులు ఉంటే మంచి క్రీడాకారులు వెలుగులోకి వస్తారు.


