breaking news
Telangana Rising Global Summit
-
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రేవంత్ వెంట ఉన్నారు. ప్రధానితో భేటీ అనంతరం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ కలిశారు. అంతకు ముందు తెలంగాణ ఎంపీలతో కలిసి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి బృందం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసింది. సదస్సుకు రావాల్సిందిగా మంత్రికి ఆహ్వానం అందించింది. -
ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న రేవంత్.. మల్లు భట్టి విక్రమార్కతో కలిసి నేరుగా ఖర్గే నివాసానికి వెళ్లారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025కు హాజరు కావాలని ఆహా్వనించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలపైనా ఖర్గేతో చర్చించినట్లు తెలిసింది. ఈ సమ్మిట్ రాష్ట్రం తన అభివృద్ధి దృక్పథం, ప్రధాన మౌలిక సదుపాయాలు, పెట్టుబడి అవకాశాలు, దీర్ఘకాలిక తెలంగాణ రైజింగ్–2047 రోడ్ మ్యాప్‌ను ప్రదర్శించడానికి ప్రధాన వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు. బుధవారం పార్లమెంటులో పీఎం నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీని కూడా సీఎం కలవనున్నారు. అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానిస్తారు. -
గ్లోబల్ సమ్మిట్ షెడ్యూల్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ కోసం ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన తాత్కాలిక షెడ్యూల్ ఇలా ఉంది.. మొదటి రోజు డిసెంబర్ 8 (సోమవారం) మధ్యాహ్నం 1:00–2:30 ⇒ ప్రారంభ ప్లీనరీ సభ, విజన్–2047 ప్రదర్శన ⇒ పేరిణి నృత్యం 3:00–4:00 ⇒ నెట్–జీరో ప్లీనరీ (రజత్ గుప్తా, అమితాబ్ కాంత్, అనురాధ ఘోష్) ⇒ బ్రేకౌట్లు: ఐటీ–ఫ్రాంటియర్ టెక్ / సెమీ కండక్టర్లు / ఏరోస్పేస్–డిఫెన్స్ 4:10–5:00 ⇒ డీప్‌టెక్ , ఏఐ ప్లీనరీ ⇒ జస్ట్ ట్రాన్సిషన్ / జెడ్ఈవీ–సర్క్యులర్ ఎకానమీ / ఆ్రస్టేలియా సెషన్ 5:15–6:15 ⇒ హ్యూమన్ డెవలప్మెంట్ ప్లీనరీ ⇒ టాలెంట్ మొబిలిటీ / ఫ్యూచర్ సిటీ–హయ్యర్ ఎడ్యుకేషన్ / కెనడా సెషన్ 6:30–7:30 ⇒ ఆసియా దేశాల సెషన్ ⇒ ఎస్‌హెచ్‌జీ క్రెడిట్–గిగ్ ఎకానమీ / మహిళా వ్యాపారవేత్తలు / అగ్రి వేల్యూ చైన్ రాత్రి 7:30–8:30 ⇒ నెట్ వర్కింగ్ – కల్చరల్ సెగ్మెంట్ 8:30 నుంచి ⇒ గలా డిన్నర్ ⇒ కొమ్ము కోయ డ్యాన్స్, ఎం.ఎం. కీరవాణి కచేరి రెండో రోజు : డిసెంబర్ 9 (మంగళవారం) ఉదయం 9:30–10:00 ⇒ వీణ వాద్యంతో ప్రారంభం 10:00–11:00 ⇒ సోషల్ కంపాక్ట్ ప్లీనరీ ⇒ క్రీడలు / మూసీ బ్లూ–గ్రీన్ ఎకానమీ / అఫర్డబుల్ హౌసింగ్ 11:10 –12:00 ⇒ ఏఐ యుగంలో స్టార్టప్ ఎకానమీ ⇒ అర్బన్ కోర్ కనెక్టివిటీ / లాజిస్టిక్స్–కారిడార్లు / ఫైనాన్సింగ్ మోడల్స్ మధ్యాహ్నం 12:15–1:15 ⇒ స్పెషల్ ఏరియా ప్లానింగ్ ⇒ ఆర్ అండ్ డీ హబ్ వ్యూహం / పెట్టుబడులు / ట్రిలియన్ డాలర్ రంగాలు 1:15–2:15: లంచ్ బ్రేక్ 2:30–3:30 ⇒ 3 ట్రిలియన్ ఎకానమీ ప్లీనరీ (నీతి ఆయోగ్ సీఈవో) ⇒ సింగిల్ విండో 2.0 / భారత్ ఫ్యూచర్ సిటీ / జీసీసీలు సాయంత్రం 3:45–4:45 ⇒ ఇన్వెస్ట్మెంట్ మ్యాగ్నెట్ ⇒ పీపీపీ మోడల్స్ / గ్లోబల్ పెట్టుబడులు / గ్రీన్ బాండ్స్ 4:45–5:45 ⇒ మీడియా, ఎంటర్టైన్మెంట్ ప్లీనరీ (రితేష్ దేశ్‌ముఖ్, రిషబ్ శెట్టి, సుకుమార్ తదితరులు) 6:00–7:00 ⇒ ముగింపు ప్లీనరీ – విజన్ 2047 విడుదల ⇒ సీఎం, డిప్యూటీ సీఎం, నీతి ఆయోగ్ సీఈవో 7:00 ⇒ గ్రాండ్ ఫినాలే, డ్రోన్ షో 7:30 నుంచి ⇒ గుస్సాడి నృత్యం, ఫ్యూజన్ సంగీతంతో గలా డిన్నర్ -
ప్రపంచంలోనే ఆదర్శంగా తెలంగాణ: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించే లక్ష్యంతో ముందుకుసాగుతున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమలు,సేవ, వ్యవసాయ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామ ని చెప్పారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు సంబంధించి ప్రజా పాలన – విజయోత్సవాల్లో భాగంగా తొలిరోజు సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆ పెద్ద మనిషి మన కష్టాలు తీర్చలేదు ‘ఒకవైపు కేసీఆర్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పు చెల్లిస్తూనే, సంక్షోభంలో ఉన్న రాష్టాన్ని గాడిన పెట్టాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం రావాలని 2009లో ఒక పెద్దాయన ఎంపీగా వలస వచ్చారు. తెలంగాణ వస్తే తమ కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, భీమా, పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని.. తమ జీవితాలు మారతాయని ప్రజలు ఆయనకు అవకాశం కలి్పంచారు. కానీ తెలంగాణకు మొట్టమొదటి సీఎం అయిన ఆ పెద్ద మనిషి మన కష్టాలు తీర్చలేదు. సాగునీటి కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసినా సంగబండలో బండ పగులకొట్టడానికి రూ.12 కోట్లు ఇవ్వలేదు. మనకు సాగు, తాగునీరు కోసం ఆయన ఏనాడూ తాపత్రయ పడలేదు..’ అని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. దండుకట్టి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి.. ‘ప్రస్తుతం పాలమూరు ప్రజలు వారి బిడ్డను ఆశీర్వదించి సీఎం చేయడంతో మంత్రుల సహకారంతో కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల్లో భూములు కోల్పోయిన వారికి సహాయ, పునరావాసాన్ని (ఆర్అండ్ఆర్) నూటికి నూరు శాతం మంజూరు చేసి అమలు చేస్తాం. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 69 జీఓ కోసం గొంతెత్తి మాట్లాడినా అప్పట్లో మన బాధను ఎవరూ వినలేదు. ఇప్పడు కూడా కుట్రలు చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం రాగానే నారాయణపేట–కొడంగల్–మక్తల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు చేపట్టాలని ప్రయత్నిస్తే ..కేసులు వేసి ఏడాదిన్నరగా నిలిపి వేయించారు. కానీ మంత్రి శ్రీహరి రైతులతో మాట్లాడి 96 శాతం రైతులను ఒప్పించారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా ఎకరాకు రూ.20 లక్షల నష్టపరిహారం మంజూరు చేశాం. ఈ ప్రాజెక్టు కోసం దండుకట్టి. గుంపు కట్టి రెండేళ్లలో పూర్తి చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు గడువులోగా పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోత మోగించండి. రాతింబ్రవళ్లు పని చేయించుకోండి. ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో అభివృద్ధి చేసే బాధ్యత నాది..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు. సమస్యలు పరిష్కరించే వారిని స్పర్పంచ్లుగా ఎన్నుకోవాలి ‘మీరు ఒక్క ఓటు వేస్తే ఇన్ని సమస్యలు తీరాయి. 2023లో ఊరు గెలిచాం. ఇప్పుడు రచ్చ గెలవాలి. ఇంకా పదేళ్లు ఉంటే అన్నీ చేయొచ్చు. ప్రభుత్వం కాళ్ల కింద కట్టె పెట్టే వారిని సర్పంచ్‌గా చేస్తే ఊరు దెబ్బతింటది. గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించే వారికి ఓట్లు వేయాలి. ఎవరి మాటలో నమ్మి ఓట్లు వేస్తే గోస పడాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారిని సర్పంచ్‌లుగా గెలిపించుకోవాలి. మన సమస్య తెలిసి పరిష్కరించే వారిని ఎన్నుకోవాలి..’ అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. సభకు ముందు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి వనపర్తి జిల్లా ఆత్మకూర్, నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీల పరిధిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. మంత్రి వాకిటి భావోద్వేగం సీఎం బహిరంగ సభలో మంత్రి వాకిటి శ్రీహరి భావోద్వేగానికి గురయ్యారు. సభలో మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో మెజార్టీ తక్కువ వచి్చనా బాధలేదు. నన్ను వ్యక్తిగతంగా దుమ్మెత్తిపోసినా పట్టించుకోలేదు. కానీ ఈరోజు మక్తల్ నియోజకవర్గానికి రూ.1,000 కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ధికి అడుగులు వేయించిన సీఎం రేవంత్‌రెడ్డి వచి్చన సమయంలో పెద్ద మనసుతో ప్రజలు వచ్చి పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్సి ఉండే. కానీ మీ ప్రవర్తనతో మనసు గాయపడింది..’ అంటూ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతంలో ఎప్పుడైనా రెండేళ్లలో రూ.1,000 కోట్లు వచ్చాయా? ఒక్కసారి ఆలోచించండి. ఈ తప్పు మరోసారి చేయకండి..’ అని కోరారు. -
నేడు ఢిల్లీకి సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నా రు. ఉదయం గాందీభవన్‌లో జరిగే టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న తర్వాత.. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి వెళ్తారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు తి రిగి వస్తారు.రాత్రికి ఢిల్లీ బయలుదేరి వెళ్తా రని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి బుధవారం ఉదయం పార్లమెంటులో ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాందీలను కలుస్తారు. ఈ నెల 8, 9వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్– 2025కు హాజరు కావాల్సిందిగా ఆహా్వనిస్తారు. పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఆహ్వానం పలుకుతారు. తర్వాత హైదరాబాద్‌కు వచ్చి హుస్నాబాద్‌లో జరిగే ప్రజాపాలన ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తారని సీఎంవో వర్గాలు తెలిపాయి.


