Global Summit: తెలంగాణ రైజింగ్‌ అనేది అన్‌స్టాపబుల్‌ | Telangana CM Revanth Reddy Speech At Telangana Rising Global Summit | Sakshi
Sakshi News home page

Global Summit: లక్ష్యం పెద్దదైనా సాధిస్తామనే నమ్మకం ఉంది

Dec 8 2025 4:03 PM | Updated on Dec 8 2025 4:42 PM

Telangana CM Revanth Reddy Speech At Telangana Rising Global Summit

సాక్షి, ఫ్యూచర్‌ సిటీ: ప్రపంచ పటంలో తెలంగాణ మంచి రాష్ట్రంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని.. అది ఎంత కష్టమైనా అందరి  సహకారంతో సాధించి తీరతామని మఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025లో ఆయన ప్రసంగించారు.

దేశ స్వాతంత్ర్యం అనంతరం మన నాయకులు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించి భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ వేశారు. మేం కూడా తెలంగాణ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందించాలనుకున్నాం. ఇందుకు మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాం. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. 2014లో సోనియా గాంధీ, ఆనాడు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కల సాకారమైంది. భారతదేశంలో యువ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.

వచ్చే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. దేశానికి స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి మనమేం సాధించగమో చెప్పాలని నిపుణులను కోరా. ఆ సమయంలోనే తెలంగాణ రైజింగ్-2047 దార్శనికతకు బీజం పడింది.

.. మనమేదైనా గొప్పగా చేయాలని భావించినప్పుడు తెలంగాణ సంస్కృతిలో ముందుగా దేవుళ్ల ఆశీర్వాదం తీసుకుంటాం.. ప్రజల మద్దతు కోరుతాం. భవిష్యత్తు కోసం మన కలలను నెరవేర్చుకోవడానికి ప్రజల ఆలోచనలు, అంచనాలు తెలుసుకున్నాం. అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణుల సహాయం తీసుకున్నాం. ఈ విజన్ రూపొందించడంలో సహయపడిన వారందరికీ ధన్యవాదాలు

ఈ గ్లోబల్ సమ్మిట్‌కు అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. వ్యాపార వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులకు ధన్యవాదాలు. ఈ సమ్మిట్ లో మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. మంచి సానుకూల వాతావరణం ఉంది. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించాం.

దేశంలో తెలంగాణ దాదాపు 2.9% జనాభా కలిగి ఉంది. దేశ జీడీపీలో  తెలంగాణ నుంచి దాదాపు 5% వాటాను అందిస్తున్నాం. 2047 నాటికి భారతదేశ GDPలో 10% వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది మా లక్ష్యం. సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం... ఇలా తెలంగాణను స్పష్టమైన 3 భాగాలుగా విభజించాం. మూడు భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం. ఇందుకోసం క్యూర్, ప్యూర్, రేర్ మోడల్స్ నిర్ధేశించాం.

  • కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE)

  • పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE)

  • రూరల్ అగ్రికల్చర్ రీజియన్  ఎకానమీ (RARE)

ఈ సందర్భంగా చైనాలోని గ్వాంగ్-డాంగ్ ప్రావిన్స్ సాధించిన అభివృద్ధి గురించి ప్రస్తావించదలచుకున్నా. గ్వాంగ్‌డాంగ్ ఆర్థిక వ్యవస్థ చైనాలోని ఏ ప్రావిన్స్‌కైనా అతిపెద్దది. 20 సంవత్సరాల్లో వారు ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించారు. తెలంగాణలో కూడా మేము అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నాం. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి మేమెంతో ప్రేరణ పొందాం. ఇప్పుడు మేం ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నాం.

మా ఈ తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి, మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మీఅందరినీ ఆహ్వానించాం. ఈ విజన్ కష్టంగా అనిపించవచ్చు.. కానీ ఆ విజన్ ను సాధించగలం. ఈ విషయంలో మా టీంకు నేను చెప్పేదొక్కటే. కష్టంగా ఉంటే, వెంటనే చేపడుదాం. అసాధ్యం అని అనుకుంటే.. వారికి కొంత గడువు ఇస్తా. ఇవాళ నేను నిన్నటి కంటే ఎక్కువ విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నా. నిన్నటిది ఒక కల, ఒక ప్రణాళిక.. ఇవాళ మీరందరూ మాతో చేరారు. ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తున్నాం. మీ అందరి మద్దతుతో తెలంగాణ రైజింగ్ లక్ష్యాలన్నింటినీ సాధించగలమని బలంగా నమ్ముతున్నా. తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ. Come and join the rise అని సీఎం రేవంత్‌ తన ప్రసంగం ముగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement