వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అసహనం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆపేందుకు అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రతిపాదనలను జెలెన్‌స్కీ పూర్తిగా చదవలేదని ట్రంప్ మండిపడ్డారు. ఇదే సమయంలో 10 నెలల కాలంలో తాను ఎనిమిది యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కెన్నెడీ సెంటర్ ఆనర్స్ రెడ్ కార్పెట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం మేము అధ్యక్షుడు పుతిన్, జెలెన్ స్కీ సహా ఉక్రెయిన్ నాయకులతో మాట్లాడుతున్నాం. శాంతి కోసం మేము తయారు చేసిన ప్రతిపాదనలను జెలెన్ స్కీ చదవలేదు. ఆయన తీరు పట్ల నేను కొంచెం నిరాశ చెందాను. ప్రతిపాదనలను అంగీకరించేందుకు జెలెన్ స్కీ సిద్దంగా లేరు. మరోవైపు.. అమెరికా ప్రతిపాదన పట్ల రష్యా రెస్పాన్స్ బాగుంది. జెలెన్ స్కీ నిర్ణయాలను ఉక్రెయిన్ ప్రజలు కూడా తిరస్కరిస్తున్నారు. ఎనిమిది యుద్ధాలు ఆపిన నాకు రష్యాతో ఎలా యుద్దం ముగించాలో తెలియదా? అంటూ’ అని ఘాటు విమర్శలు చేశారు.
BREAKING: Trump on the US peace plan for Ukraine🕊️:
- Discussed with Ukraine & Russia leaders
- Russia is fine with it [the proposal]
- Zelensky people “love it,” but he hasn’t read it yet
“I'm a little bit disappointed that President Zelensky hasn't yet read the proposal.” 👇 pic.twitter.com/wjBwU7hnJp— Kirill Dmitriev (@kadmitriev) December 8, 2025
పురోగతి లేని చర్చలు..
మరోవైపు.. అమెరికా–ఉక్రెయిన్ ప్రతినిధులు మియామిలో వరుసగా మూడు రోజుల పాటు చర్చలు జరిపారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ సందర్భంగా అమెరికా ప్రతిపాదించిన శాంతి ప్రణాళికపై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ప్రణాళికను రష్యా కొన్ని భాగాల్లో అంగీకరించినట్లు అమెరికా పేర్కొంటోంది. కానీ ఉక్రెయిన్ ఇంకా పూర్తిగా అంగీకరించలేదు. చర్చలు కొనసాగుతున్నప్పటికీ రష్యా యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉండటం కీలకం అని అమెరికా, ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ఈ చర్చల్లో అమెరికా తరఫున స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాల్గొనగా.. ఉక్రెయిన్ తరఫున రుస్తెమ్ ఉమెరోవ్, ఆండ్రి హ్నాటోవ్ ఉన్నారు.. అలాగే, జెలెన్ స్కీ కూడా వీడియో కాల్ ద్వారా చర్చల్లో పాల్గొన్నారు. కాగా, అమెరికా ప్రతిపాదనలోని కొన్నిఅంశాలను రష్యా తిరస్కరించినట్టు తెలిసింది.
రష్యా దాడులు..
ఇదిలా ఉండగా.. శాంతి స్థాపన కోసం ఒకవైపు ఉక్రెయిన్‌తో అమెరికా చర్చలు జరుపుతుండగా.. మరోవైపు వాటిని పట్టించుకోకుండా రష్యా దాడులు చేస్తూనే ఉంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ ఉక్రెయిన్‌పై చేసిన దాడుల్లో మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. సెంట్రల్ సిటీ క్రెమెన్‌చుక్‌లోని మౌలిక సదుపాయాలపై డ్రోన్లు, క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. దీంతో విద్యుత్తు, నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. క్రెమెన్‌చుక్ నగరం.. అతి పెద్ద చమురు రిఫైనరీలకు, పరిశ్రమలకు కేంద్రం. ఉత్తర ప్రాంతంలోని చెర్నివ్‌లో జరిగిన దాడిలో ఒకరు మరణించారు.


