భగవద్గీత ప్రతిని పుతిన్‌కు కానుకగా ఇస్తున్న ప్రధాని మోదీ
23వ ఇండియా–రష్యా సదస్సులో కీలక అంశాలపై చర్చ
ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం
ముఖ్యమైన రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవాలని తీర్మానం
ఉమ్మడి ప్రకటన విడుదల చేసిన మోదీ, పుతిన్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 23వ ఇండియా–రష్యా సదస్సులో శుక్రవారం కీలక అంశాలపై చర్చించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోపాటు ఇరుదేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయానికొచ్చారు. రెండు దేశాల నడుమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించి ఈ ఏడాది అక్టోబర్ నాటికి 25 ఏళ్లు పూర్తికావడం విశేషం. సదస్సు అనంతరం మోదీ, పుతిన్ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.
భారత్, రష్యా సంబంధాలకు పరస్పర విశ్వాసం, జాతీయ ప్రయోజనాల పట్ల పరస్పర గౌరవమే పునాది అని ఉద్ఘాటించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వానికి రెండు దేశాల భాగస్వామ్యం దోహదపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుత ప్రపంచ భౌగోళిక రాజకీయాలు, కొన్ని ప్రాంతాల్లో ఘర్షణల నేపథ్యంలో ఇరుదేశాల బంధానికి మరింత ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్నారు. రష్యాలోని యెకటెరిన్‌బర్గ్, కజన్ నగరాల్లో భారత కాన్సులేట్లు ప్రారంభం కావడాన్ని మోదీ, పుతిన్ స్వాగతించారు.
ఉమ్మడి ప్రకటనలోని ముఖ్యాంశాలివీ..
⇒ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమతుల్యంగా, సుస్థిరమైన రీతిలో పెంపొందించుకోవాలి. భారత్ నుంచి రష్యాకు ఎగమతులు భారీగా పెంచాలి. పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి. కొత్తగా సాంకేతికత, పెట్టుబడుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాలి. ఆధునిక రంగాల్లో కలిసి పని చేయడానికి నూతన అవకాశాలను అన్వేíÙంచాలి. 2030 నాటికి ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చాలి.
⇒ భారత్, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇంధన రంగమే మూలస్తంభం. అందుకే ఈ రంగంలో సహకారాన్ని విస్తరింపజేసుకోవాలి. ఇంధన రంగంలో పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. కొత్త పెట్టుబడులను ప్రోత్సహించాలి.
⇒ రెండు దేశాల నడుమ స్థిరమైన, ప్రభావవంతమైన రవాణా కారిడార్ల నిర్మాణానికి సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. సరుకు రవాణా వ్యవస్థను, ఇరుదేశాల అనుసంధానాన్ని మెరుగుపర్చాలి. మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని ఇంకా పెంచాలి.
⇒ రష్యన్ ఫెడరేషన్‌లోని దూర ప్రాచ్యం, ఆర్కిటిక్ జోన్లలో వాణిజ్యం, పెట్టుబడుల సహకారాన్ని పెంచుకోవాలి. ఆర్కిటిక్ ప్రాంతానికి సంబంధించి తరచుగా ద్వైపాక్షిక సంప్రదింపులు జరపాలి. ఆర్కిటిక్ కౌన్సిల్‌లో పరిశీలక దేశం హోదా పాత్ర పోషించడానికి భారత్ సంసిద్ధత.
⇒ అణు ఇంధన రంగంలో సహకారం బలోపేతం కావాలి. న్యూక్లియర్ ఎనర్జీని శాంతియుత ప్రయోజనాల కోసమే వాడుకోవాలి. రెండు దేశాలు అందుకు మద్దతివ్వాలి. అణు విద్యుత్ ప్లాంట్ల స్థాపనకు సహకరించుకోవాలి. అలాగే అంతరిక్ష రంగంలోనూ సహకారం బలపడాలి. మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలు, శాటిలైట్ నావిగేషన్, ప్లానెటరీ ప్రయోగాల్లో పరిజ్ఞానాన్ని పంచుకోవాలి. రాకెట్ ఇంజన్ల అభివృద్ధి, ఉత్పత్తిలో పరస్పరం ప్రయోజనం పొందేలా కలిసి పనిచేయాలి.
⇒ సైనిక, సైనిక సాంకేతిక సహకారాన్ని కూడా పెంపొందించుకోవాలి. సైనిక సామగ్రి విడిభాగాలను భారత్‌లో తయారు చేయాలి. ఇందుకు రష్యా సహకరిస్తుంది. రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి రష్యా తోడ్పాటు లభిస్తుంది. భారత సైనిక దళాల అవసరాలు తీర్చేలా ఉమ్మడి వెంచర్లు ఏర్పాటు చేయాలి. మిత్రదేశాలకు భారత్ నుంచి సైనిక సామగ్రి, ఆయుధాలను ఎగుమతి చేయాలి.
⇒ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలి. ఇరుదేశాల ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేసేలా ప్రోత్సహించాలి. అరుదైన ఖనిజాల అన్వేషణ, వెలికితీత, శుద్ధి, రీసైక్లింగ్‌కు ఉమ్మడి కృషి అవసరం. సైన్స్, టెక్నాలజీ, నూతన ఆవిష్కరణల్లో ఉమ్మడి పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. డిజిటల్ టెక్నాలజీలో సహకారాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇరుదేశాల విద్యాసంస్థలు, శాస్త్రీయ సంస్థల మధ్య భాగస్వామ్యం
బలపడాలి.
⇒ భారత్, రష్యా స్నేహ సంబంధాలకు సంస్కృతుల అనుసంధానం, ప్రజల అనుసంధానం అత్యంత కీలకం. మరింత లోతైన సంబంధాల కోసం రెండు దేశాల్లో సాంస్కృతిక వేడుకలు, పుస్తక ప్రదర్శనలు, పండుగలు, కళాత్మక పోటీలు నిర్వహించాలి. ఇందులో ప్రజలను భాగస్వాములను చేయాలి. ఒక దేశం సంస్కృతి సంప్రదాయాల గురించి మరో దేశంలోని ప్రజలు తెలుసుకోవాలి. దీంతో వారి మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. సినీ పరిశ్రమ విషయంలోనూ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఉమ్మడి ఫిలిం ప్రొడక్షన్‌ను అభివృద్ధి చేయాలి. అలాగే పర్యటనలను ప్రోత్సహించాలి. ఇందుకోసం వీసా నిబంధనలు సరళతరం చేయాలి. రెండు దేశాలు ఈ–వీసా విధానం తీసుకురావాలి. అలాగే భారత్, రష్యాలకు చెందిన యూనివర్సిటీలు, విద్యా సంస్థల మధ్య భాగస్వామ్యం బలోపేతమయ్యేలా చర్యలు చేపట్టాలి.
⇒ ఐక్యరాజ్యసమితిలో కీలక అంశాలపై ఉన్నతస్థాయి రాజకీయ దౌత్యం, సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలి. యూఎన్ చార్టర్‌ను గౌరవించాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సమగ్ర సంస్కరణలు చేపట్టేలా ఉమ్మడిగా కృషి చేయాలి. అంతర్జాతీయ శాంతి, భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేలా మండలిని ప్రభావవంతంగా తీర్చిదిద్దాలి. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలి. ఇందుకు రష్యా సహకరిస్తుంది. జీ20 కూటమిలోనూ భారత్, రష్యా కలిసి పనిచేయాలి. అంతేకాకుండా ‘బ్రిక్స్’లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి. అణు సరఫరాదారుల గ్రూప్‌లో భారత్‌కు సభ్యత్వం కలి్పంచడానికి రష్యా సహకారం అందజేస్తుంది.
⇒ ఉగ్రవాదం పెను ముప్పుగా మారింది. ఇదొక ఉమ్మడి సవాలు. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాటం చేయాల్సిందే. తీవ్రవాదం, సంస్థాగత నేరాలు, మనీ లాండరింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక వనరులు సమకూర్చే ముఠాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై పోరాటం కొనసాగించాలి. ఉగ్రవాదం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే అంతం చేయాలి. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి లాంటి అంతర్జాతీయ సంస్థల్లో తీర్మానం చేసేలా ఒత్తిడి పెంచాలి.


