సాధారణంగా కొన్ని దేవాలయాలలో రెండు సర్పాలు ఒక దానితో మరొకటి మెలికలు తిరుగుతూ ఉన్న శిల్పం మనకు కనిపిస్తుంది. ఆ శిల్పంలో ఉండే రెండు సర్పాలు మన సూక్ష్మ శరీరంలో ఏ విధంగా ఇడా, పింగళా నాడులు ఒక దానితో ఒకటి మెలికలు తిరిగి ఆరు శక్తి కేంద్రాలను లేదా షట్చక్రాలను ఏర్పరుస్తాయో సూచిస్తాయి. వీటినే చంద్ర నాడి, సూర్య నాడి అని కూడా పిలుస్తారు. మన వెన్నెముక అడుగు భాగాన త్రికోణాకార ఎముకలో ఉండే కుండలినీ శక్తి ఈ రెండు నాడుల మధ్య ఉండే సుషుమ్నానాడి ద్వారా పైకి వచ్చి మన మాడు పై భాగంలో ఉండే బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించి, మన చుట్టూ ఉండే సర్వ వ్యాపితమైన భగవంతుని పరమ చైతన్య శక్తితో ఐక్యం చెందుతుంది. అప్పుడే ఒక సాధకునికి యోగ్ర ప్రాప్తి జరుగుతుంది. ధ్యానంలో కుండలినీ శక్తి జాగృతిని, దాని ఊర్థ్వ గమనాన్ని అనుభూతి చెందితే, సాధకుడు నిరానంద అనుభూతిని పొంద గలుగుతాడు.
మన కుడివైపు మూలాధార చక్రం శుభ్రమయ్యే కొద్దీ మన లోపల అనవసరమైన ఆలోచనలు తగ్గిపోయి అంతర్గత ప్రశాంతత ఏర్పడుతుంది. ఆ విధంగా కుడి వైపు మూలాధార చక్రం మన లోపల సమతుల్యత ఏర్పడడానికి, నిర్విచార స్థితి నెలకొనడానికి సహాయ పడుతుంది.
మితిమీరిన క్రియాశీలత, ఇతరులపై ఆధిపత్యం చెలాయించడం, అవసరానికి మించి పని చేయడం, అతిగా ప్రణాళికలు వేయడం, నిద్ర లేమి, మొండితనం, మూర్ఖత్వం, చిరాకు, కోపం, అతిగా మాట్లాడడం, అతిగా ఆటలు ఆడటం, క్రూరత్వం, కాఠిన్యం ఇటువంటివన్నీ మన కుడివైపు పింగళానాడిని బలహీన పరుస్తాయి. ఆ సమయంలో శ్రీ కార్తికేయుని ధ్యానం ద్వారా మనం మన లోపల గల అసమతుల్యత లను తొలగించు కోవచ్చును. శ్రీ కార్తికేయుని ధ్యానం వలన మన చిత్తం నిర్మలంగా మారి మనకు నిర్విచార స్థితి లభిస్తుంది.
ఒక గురువుకు తన మీద తనకు ఆత్మనిగ్రహం ఉంటుంది. అంటే తనను తాను నియంత్రించుకో గలుగుతాడు. కానీ శ్రీ కార్తికేయుని ఆశీస్సులు ఉన్న వ్యక్తి ఇతరులను శాసించ గలుగుతాడు. ఆ విధంగా శాసించగల శక్తి పురుషులకు వారి మాటల ద్వారా, చురుకుదనం ద్వారా, వ్యక్తిగత విజయాల ద్వారా లభిస్తే, స్త్రీలకు వారి ప్రేమించే గుణం, సహనం, హుందాతనం, క్షమా గుణం, కరుణల ద్వారా లభిస్తుంది.
శ్రీ కార్తికేయుని శక్తి మన లోపల పసితనం లాంటి అమాయకత్వాన్ని పరిరక్షిస్తుంది. ఈ అమాయకత్వం వలనే మానవులు ఆనందంగా ఉండగలుగుతారు. మనలో కుండలినీ శక్తి వెన్నెముక అడుగున ఉన్న త్రికోణాకార ఎముక నుండి బయలు దేరి, షట్చక్రాలనూ దాటుకుంటూ వెళ్ళి, బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించడానికి మార్గ మధ్యంలో ఏర్పడే ఆటంకాలన్నీ తొలగించడానికి కుడి మూలాధార చక్రం సహకరిస్తుంది. శ్రీ కార్తికేయుని శక్తి పరిపూర్ణంగా స్వచ్ఛమైన క్రియాశీలక శక్తి. అందులో ఎటువంటి అనవసరమైన, పనికిమాలిన ఆలోచనలకు తావు లేదు. అది చక్కటి ఫలితాలను ఇస్తుంది.
– డా. పి. రాకేశ్
(మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాలు, ప్రసంగాల ఆధారంగా)


