పరువు పేరుతో ప్రేమకు సమాధి; తప్పెవరిది? | Special story on inter cast and religious marriages Honor killings | Sakshi
Sakshi News home page

పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?

Dec 1 2025 4:39 PM | Updated on Dec 1 2025 4:46 PM

Special story on inter cast and religious marriages Honor killings

నాగరిక ప్రపంచంలో ప్రేమకు చోటు లేకుండా పోతోంది. కుల దురహంకారం మట్టికాళ్ల మహారాక్షసిలా  విజృంభిస్తోంది. మనసుకు నచ్చినవాడిని ప్రేమించడమేతరతరాలుగా ‘ఆమె’ పాలిట శాపమైపోతోంది. మనసిచ్చినవాడిని మనువాడాలనుకున్న అమ్మాయి కలల్ని సొంత కుటుంబ సభ్యులే కాలరాస్తున్నారు. తాజాగామహారాష్ట్రలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన పలువురి కంట తడి పెట్టిస్తోంది.  

అమ్మాయి ప్రేమే సమస్య
తమ కుటుంబంలోని అమ్మాయి ప్రేమిస్తే ఎందుకంత అగ్గిమీద గుగ్గిలం అవుతారు. కూర్చుని మాట్లాడుకుని, పరిష్కరించుకోవాల్సిన సమస్యని హత్యల దాకా ఎందుకు తీసుకెళతారు. ఎందుకంటే అనాదిగా వస్తున్న ఆధిపత్య, అహంకార పూరిత ధోరణి.  ఆమె స్వేచ్ఛను, ప్రేమను అంగీకరించలేని  అసహనం. వివక్ష. బాల్యంలో తండ్రి ఇంట​, యవ్వనంలో భర్త ఇంట, ముసలి తనం కొడుకు ఇంట ఆడది ముష్టెత్తుకు బతకాలి. మారుమాట్లాడినా, ఎదురు తిరిగినా  అంతే సంగతులు, పరువు ప్రతిష్ట  పేరుతో ఇంట్లోని మగవాళ్ల ఆగ్రహానికి బలికావాల్సిందే. ఇదే తరతరాలుగా సాగుతున్న తంతు. 

మహిళల్ని,లేదా యువతులను పితృస్వామ్య అణచివేత, లైంగిక, శారీరక, మానసిక వేధింపులతోనే కాదు వారికి నచ్చినవారిని హతమార్చి, ఇలా కూడా అతి దారుణంగా చంపేయొచ్చు. వారిని మానసికంగా దెబ్బతీయచ్చు. తండ్రి , సోదరులు ఇలా ఎవరైనా సరే పరువు హత్యల ద్వారా పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ హత్య చేయవచ్చు ఈ అహంభావమే, దౌర్జన్యమే ఇప్పటికీ రాజ్య మేలుతోంది. దురదృష్టవశాత్తూ ఆయా కుంటుంబాలలోని మహిళలు ఇలాంటి హత్యలను సమర్థించడం సాయపడుతూ ఉండటం దురదృష్టకరమైంది.  

ఇటీవల జరిగిన సంచలన హత్యలు
2016 మార్చి 13న లో తమిళనాడులోని తిరుప్పూర్‌లో జరిగిన శంకర్ పరువు హత్య సంచలనం రేపింది. తమ కుమార్తె కౌసల్యం  శంకర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుందన అక్కసుతో, కౌసల్య తండ్రి చిన్నస్వామితన బంధువులతో కలిసి పట్టపగలే నడిరోడ్డుపై దారుణంగా హత్య చేయించారు.ఈ కేసులో ఏమైంది... నేరస్తులకు దక్కిన పరువు ఉంటి? నలుగురిలోనూ హంతకులనే పేర్లు, జైలు జీవితం అంతేగా. 

ప్రణయ్‌ హత్యతో పరువు నిలబడిందా?  
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో  2018, సెప్టెంబర్ 14న పెరుమాళ్ల ప్రణయ్‌ది మరో దారుణ హత్య. కూతురు అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న  కారణంగా, పగపెంచుకుని, కిరాయిహంతకుల సాయంతో స్వయంగా అమృత తండ్రి మారుతీ రావు చంపించాడు.

ఒకవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు దూరం, మరోవైపు  అల్లుడి హత్యతో ఆమె జీవితంలో నిప్పులు పోసానన్న పశ్చాత్తాపం ఊపిరి సలపనీయలేదు. దీనికి తోడు పోలీసు కేసులు విచారణ,  చివరికి  బలవన్మరణానికి పాల్పడ్డాడు మారుతీరావు. 

నానమ్మ కోసం హత్య 
2025 జనవరిలో  సూర్యాపేటలో భార్గవి, కృష్ణల ప్రేమను పరువు హత్య చేశారు. తమ కుమార్తెను భార్గవిని తన స్నేహితుడు కృష్ణ కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు దీంతో స్నేహితుడు అన్న కనికరం కూడా లేకుండా మరి కొంత మందితో కలిసి కృష్ణను నమ్మించి హత్య చేశారు.  ఈ కేసులో నానమ్మ  పాత్ర పెద్ద చర్చు దారితీసింది. మొదటినుంచి భార్గవి ప్రేమను వ్యతిరేకించి నాన్నమ్మ బుచ్చమ్మ మనవళ్లను రెచ్చగొట్టి మరీ ఈ హత్యకు వుసి గొల్పిందని పోలీసులు  నిర్ధారించారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సూర్యాపేటలో 2000లో కు లాంతర వివాహం చేసుకుందని ఓ వ్యాపారి యువకుడిని హత్య చేయించాడు. 2012లో తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని భావించి   ప్రేమికుడిని హత్య చేశారు.  అదేవిధంగా  యాదాద్రి జిల్లాలో  లింగరాజుపల్లికి చెందిన తుమ్మల స్వాతి, నరేష్‌ ప్రేమించుకున్నారు. కేవలం కుల అహంకారంతోనే స్వాతి తల్లిదండ్రులు నరేష్‌ను హత్య చేశారు. అది తట్టుకోలేక స్వాతి కూడా మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.  తాజాగా మహారాష్ట్రలోని నాందేడుకు చెందిన యువకుడి హత్య. ఆంచల్ మామిద్వార్‌కు స్వయంగా తల్లిదండ్రులే పుట్టెడుదుఃఖాన్ని మిగిల్చారు. అంచల్ ప్రేమికుడు సాక్షమ్ టేట్ (25)ని దారుణంగా కాల్చి చంపారు.  ఇవి మచ్చుకు కొన్నిమాత్రమే. వెలుగులోకి రాని కౄరహత్యలు మరెన్నో. 

పగ కాదు, ప్రేమను పంచుదాం
కన్నబిడ్డల కంటే  వారి సంక్షేమం కంటే తల్లిదండ్రులకు ఏముంటుంది. జీవితాంతా కష్టపడి  ప్రాణానికి ‍ప్రాణంగా పెంచుతారు. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మూర్ఖంగా మారిపోతున్నారు. అబ్బాయి ప్రేమను అయినా, అంగీకరిస్తారేమో గానీ, అమ్మాయి ప్రేమను అస్సలు  ప్రేమను జీర్ణించుకోలేరు. పగతో రగిలి పోతున్నారు.ఫలితంగా దారుణ హత్యలకు తెగబడుతున్నారు. చివరికి కన్నబిడ్డ గొంతుకు ఉరిబిగించేందుకు కూడా వెనుకాడటం లేదు.

ఏమిటీ పరిష్కారం
ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే ఉండాల్సింది ప్రేమ,అభిమానం, పరస్పరం నమ్మకం. ప్రేమకు, ప్రేమవివాహాలకు కులాలు, మతాలు అడ్డుగోడలు కాకూడదు.  ఆర్థిక స్థోమత అస్సలు సమస్యే కాదు. కానీ తక్కువ, ఎక్కువ  అనే లేని పోని విద్వేషాలతో ప్రేమ వివాహాలకు పెద్దలు అడ్డుకుంటున్నారు. కుటుంబ పరువు, సమాజంలో నలుగురూ ఏమనుకుంటారో అనే లేని పోని ఆందోళన వారిని భయపెడుతోంది. ఇదే ప్రేమికులనూ భయపెడుతోంది. తమ ప్రేమలేని బతకని చోట తామూ బతకలేమని ప్రేమికులు ఒకవైపు ఆత్మహత్యలకు పాల్పడుతోంటూ.. మరోవైపు ప్రేమకోసం ప్రేమగా, ధైర్యంగా కలిసి బతుకుదామనుకున్న వారిని స్వయంగా కుటుంబ సభ్యులే దారుణంగా హత్య చేస్తుండటం బాధాకరం.

రాజ్యాంగం ప్రకారం  మేజర్‌ అయిన ప్రతీ  యువతీ యవకుడికీ తమను నచ్చిన వారిని భాగస్వాములుగా ఎంచుకునే హక్కు ఉంది. ఈ హక్కును కాలరాయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి నేరాలకు  పాల్పడిని వారికి కఠిన శిక్షలు పడేలా చట్టం, చట్టాన్ని రక్షించే అధికారులు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. చట్టాలు, ప్రేమ వివాహాలు, పరువుహత్యలు, పర్యవసానాలపై పౌరుల్లో అవగాహన కల్పించాలి. "మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును." అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పినట్టు కుల మత బేధం లేని సమాజం ఇపుడు మనకు కావాలి.  ఇకనైనా పరువు పేరుతో జరుగుతున్న మారణకాండ ఆగాలని కోరుకుందాం. నిజమైన ప్రేమలను గెలిపించుకుందాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement