అన్ని రాష్ట్రాలు సహకారం అందించాలి
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలను మోసగించి, నిలువు దోపిడీ చేస్తున్న కేసులు పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఇటువంటి కేసులు వెలుగులోకి వస్తున్నందున వీటన్నిటిపైనా ఏకీకృత దర్యాప్తు జరపాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ కుంభకోణం విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంగా భావించాలని సీబీఐకి స్పష్టం చేసింది.
ఈ విషయంలో రాష్ట్రాలు సీబీఐకి సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వాధికారులు, పోలీసులు, దర్యాప్తు విభాగాల పేరు చెప్పుకుని సైబర్ నేరగాళ్లు వీడియో, ఆడియో కాల్స్ ద్వారా బాధితులపై ఒత్తిడి తెచ్చి, డబ్బులు వసూలు చేస్తున్న కేసులు పెరిగిపోతుండటంపై ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగి్చల ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ కేసుల దర్యాప్తు విషయంలో బీజేపీయేతర పాలిత తెలంగాణ, తమిళనాడు, బెంగాల్, కర్నాటక సహా అన్ని రాష్ట్రాలు సీబీఐకి సహకారం అందించాలని కోరింది. అదే సమయంలో, కృత్రిమ మేధ సాంకేతికతను వాడుకుంటూ సైబర్ నేరగాళ్ల బ్యాంకు అక్కౌంట్లను ఎందుకు ఫ్రీజ్ చేయలేకపోతోందంటూ ఆర్‌బీఐని ప్రశ్నించింది. సమాధానమివ్వాలంటూ నోటీసు జారీ చేసింది.
హరియాణాకు చెందిన వృద్ధ దంపతులు రాసిన లేఖ ఆధారంగా సుమోటోగా విచారణ చేపట్టిన ధర్మాసనం పలు ఆదేశాలను వెలువరించింది. డిజిటల్ అరెస్ట్ కేసులపై సీబీఐ దర్యాప్తునకు అవసరమైన వివరాలను అందించాలని సంబంధింత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలను కోరింది. ఇతర దేశాల్లో ఉంటూ ఈ దందా సాగిస్తున్న సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు ఇంటర్‌పోల్ సాయం కూడా తీసుకోవాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది.
టెలికం సరీ్వస్ ప్రొవైడర్లు ఒక వ్యక్తి లేదా సంస్థకు లెక్కకు మిక్కిలి సిమ్ కార్డులు జారీ చేయకుండా చూడాలని కేంద్ర టెలికం శాఖను కోరింది. సైబర్ నేరగాళ్లకు ఇటువంటి వాటిని అవకాశంగా తీసుకుంటున్నారని తెలిపింది. ఇటువంటి నేరాలపై సమన్వయంతో వ్యవహరించేందుకు ప్రాంతీయ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
హోం, టెలికం, ఆర్థిక, ఎల్రక్టానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు సైబర్ నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలను తమ ముందుంచాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది. మోసగాళ్ల బ్యాంకు ఖాతాలను స్తంభింప జేయాలని స్పష్టం చేసింది. నేరగాళ్ల ముఠాలతో చేతులు కలుపుతున్న బ్యాంకు అధికారుల గుట్టును కనిపెట్టాలంది. తదుపరి విచారణ నాటికి టెలికాం శాఖ అధికారులు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది.

ఇదీ చదవండి: ఆ ఆవు నెయ్యిలో నాణ్యత లేదు.. పతంజలికి షాక్


