భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు | BCCI Announced India U19 squad for Asia Cup, Vaibhav Suryavanshi In | Sakshi
Sakshi News home page

భారత జట్టు ప్రకటన.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు

Nov 28 2025 1:14 PM | Updated on Nov 28 2025 1:50 PM

BCCI Announced India U19 squad for Asia Cup, Vaibhav Suryavanshi In

అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నమెంట్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం తమ జట్టును ప్రకటించింది. పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఆయుశ్‌ మాత్రే (Ayush Mhatre)ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. 

ఇక ఈ జట్టులో చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి కూడా చోటు దక్కింది. కాగా డిసెంబరు 12 నుంచి 21 వరకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వేదికగా అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. వన్డే ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. 

డిసెంబరు 14న భారత్‌- పాక్‌ మ్యాచ్‌
గ్రూప్‌-‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, క్వాలిఫయర్‌ 1 విజేత, క్వాలిఫయర్‌ 3 విజేత పోటీపడనుండగా... అదే విధంగా.. గ్రూప్‌-‘బి’ నుంచి బంగ్లాదేశ్‌, శ్రీలంక, అఫ్గనిస్తాన్‌, క్వాలిఫయర్‌-2 విజేత రేసులో ఉన్నాయి.

ఇక అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌ డిసెంబరు 12న.. ఐసీసీ అకాడమీ వేదికగా క్వాలిఫయర్‌-1 విజేతతో తమ తొలి మ్యాచ్‌ ఆడుతుంది. ఇదే వేదికపై డిసెంబరు 14న దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. అనంతరం డిసెంబరు 16న ది ‘సెవెన్స్‌’లో క్వాలిఫయర్‌-3 విజేతతో తలపడుతుంది.

కాగా డిసెంబరు 19న ఐసీసీ అకాడమీ స్టేడియంలో తొలి సెమీ ఫైనల్‌ జరుగనుండగా.. డిసెంబరు 19న ది ‘సెవెన్స్‌’ వేదికగా రెండో సెమీస్‌ మ్యాచ్‌ జరుగుతుంది. డిసెంబరు 21న ఫైనల్‌తో ఈ టోర్నీకి తెరపడుతుంది. కాగా గ్రూప్‌-‘ఎ’, గ్రూప్‌- ‘బి’ గ్రూపుల నుంచి టాప్‌-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్‌ విజేతల మధ్య టైటిల్‌ పోరు జరుగుతుంది.

సెమీస్‌లోనే ఇంటిబాట
ఇదిలా ఉంటే.. ఇటీవల ఆసియా క్రికెట్‌ మండలి టీ20 రైజింగ్‌ స్టార్స్‌ టోర్నీలో భారత్‌ సెమీస్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. దీంతో జితేశ్‌ శర్మ సేన ఇంటిబాట పట్టగా.. మరో సెమీ ఫైనల్లో శ్రీలంకను ఓడించి పాక్‌ ఫైనల్‌ చేరింది. టైటిల్‌ పోరులో బంగ్లాదేశ్‌పై గెలుపొంది ట్రోఫీ అందుకుంది.

అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నమెంట్‌కు భారత జట్టు ఇదే:
ఆయుశ్‌ మాత్రే (కెప్టెన్‌), ​వైభవ్‌ సూర్యవంశీ, విహాన్‌ మల్హోత్రా (వైస్‌ కెప్టెన్‌), వేదాంత్‌ త్రివేది, అభిజ్ఞాన్‌ కుందు (వికెట్‌ కీపర్‌), హర్వంశ్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), యువరాజ్‌ గోహిల్‌, కనిష్క్‌ చౌహాన్‌, ఖిలాన్‌ ఎ.పటేల్‌, నమన్‌ పుష్పక్‌, డి. దీపేశ్‌, హెనిల్‌ పటేల్‌, కిషన్‌ కుమార్‌ సింగ్‌ (ఫిట్‌నెస్‌ ఆధారంగా), ఉద్ధవ్‌ మోహన్‌, ఆరోన్‌ జార్జ్‌.

స్టాండ్‌ బై ప్లేయర్లు: రాహుల్‌ కుమార్‌, హేముచుందేశన్‌ జె, బీకే కిషోర్‌, ఆదిత్య రావత్‌.

చదవండి: WPL 2026: వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు వీరే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement