టీమిండియా సిరీస్ పరాజయానికి హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)ను బాధ్యుడిని చేయడం తగదని భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) అన్నాడు. ఆటలో గెలుపోటములు సహజమని.. ఓటమికి ఆటగాళ్లు కూడా బాధ్యులేనని పేర్కొన్నాడు. కాగా పాతికేళ్ల తర్వాత సొంతగడ్డపై టీమిండియా సౌతాఫ్రికా చేతిలో టెస్టులలో 2-0తో వైట్‌వాష్ అయిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోచ్ గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడిని కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు.
అది సరైంది కాదు
‘‘ఇదొక క్రీడ. గెలుపోటములు సహజం. జట్టును నిర్వహించడం అంత సులభం కాదు. ఈ పరాజయానికి గంభీర్ కూడా బాధపడుతున్నాడు. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. దీనికి ఎవరినో ఒకరిని బాధ్యలను చేసి తప్పిస్తే మంచిదని అనిపించవచ్చు. కానీ అది సరైంది కాదు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం ఆశిస్తుంటారు.
తప్పంతా వాళ్లదే
భారత క్రికెట్ ఆర్థికంగా చాలా పటిష్టంగా ఉంది. అందుకే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని అందరూ ఎదురుచూస్తున్నారు. అలా అని కోచ్ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగి ఆడలేడు కదా. ఆటగాళ్లు కూడా బాధ్యత తీసుకోవాలి. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి పైనా దాడి చేయడం తగదు.
కోచ్, కెప్టెన్ జట్టు కూర్పు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, ఈసారి మన ఆటగాళ్లలో ఒక్కరూ బాధ్యతాయుతంగా ఆడినట్లు కనిపించలేదు. పిండి కొద్ది రొట్టె అంటారు. అసలు పిండే లేకుంటే రొట్టెలు ఎలా చేస్తారు?
గంభీర్ నా బంధువు కాదు..
గంభీర్ కూడా ఓటమి విషయంలో బాధపడుతూ ఉంటాడు. నేను అతడికి మద్దతుగా మాట్లాడుతున్నానంటే.. అతడు నా బంధువు అని అర్థం కాదు. తప్పులు జరగడం సహజం. అయితే, ఇలాంటి ఘోర పరాభవాలు ఎదురైనపుడు జవాబుదారీతనంగా ఉండటం అత్యంత ముఖ్యం. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోవాలి’’ అని అశ్విన్ వివరించాడు.
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 సీజన్‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు ఆడింది. కోల్‌కతాలో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన భారత్.. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో మరీ దారుణంగా 408 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది.
ఇక భారత టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద ఓటమి. అంతకు ముందు గంభీర్ మార్గదర్శనంలోనే టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్ అయిన విషయం తెలిసిందే.


