స్కిన్‌ చికెన్‌ తింటున్నారా? ఇది మీ కోసమే.. | Is Skinned Chicken Good For Health Here What Experts Says This | Sakshi
Sakshi News home page

స్కిన్‌ చికెన్‌ తింటున్నారా? ఇది మీ కోసమే..

Jan 10 2026 7:46 PM | Updated on Jan 10 2026 7:59 PM

Is Skinned Chicken Good For Health Here What Experts Says This

ఆదివారం రాగానే.. నాన్‌ వెజ్‌ కోసం ఉరుకులు పెడుతుంటారు. రేటు బోర్డు వంక ఒక చూపు చూసి.. కావాల్సిన క్వాంటిటీని ఆర్డర్‌ చేస్తుంటారు. ఇందులో చికెన్‌లో స్కిన్‌ కోడికి ప్రయారిటీ ఇచ్చేవాళ్లు లేకపోలేదు. తోలుతో కూడిన కోడిని.. అందునా కరెంట్‌.. గ్యాస్‌ స్టౌలపై కాల్పించుకుని మరీ ముక్కలు కొట్టిస్తుంటారు. అయితే ఏరికోరి పట్టుకెళ్లే ఇలాంటి చికెన్‌ నిజంగానే ఒంటికి మంచిదేనా?..

స్కిన్‌ చికెన్‌ తినడం మంచిదా? కాదా? అని చాలామందికి అనుమానాలు, అనేక అపోహలు ఉన్నాయి. రుచి కోసం తహతహలాడే వాళ్లు కొందరైతే.. తింటే ఏదైనా జరగొచ్చని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు మరికొందరు. అయితే కోడి చర్మం చెడ్డదేం కాదు. అలాగని పూర్తిగా మంచిది కూడా కాదు. ఈ విషయంలో నిపుణులు చెబుతోంది కూడా ఇదే..

చికెన్‌ స్కిన్‌లో ఎక్కువగా (unsaturated fatty acids-UFAs) ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో ఉపయోగకరమైనవి. చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడంలో సహాయపడతాయి. పైగా  ఇవి ఆలివ్ ఆయిల్‌లో ఉండే ఏక అసంతృప్త కొవ్వులు(monounsaturated fats) లాంటివే. కాబట్టి గుండెకు చాలా మంచిది. అలాగే.. కోడి చర్మంలో కొంత ప్రోటీన్, కొంత కాలజెన్ కూడా ఉంటుంది. ఇవి చర్మం, కండరాలు, కీళ్లకు బలాన్ని ఇస్తాయి.  ఈ ప్రయోజనాల గురించి తెలియకుండానే చాలామంది  ఉత్త రుచి కోసమే స్కిన్‌ కోడి వైపు మొగ్గు చూపుతుంటారు.

అదే సమయంలో కోడి చర్మం అధిక కేలరీలు, కొవ్వు కలిగిన భాగం కూడా. ఒక ఔన్స్‌ చికెన్‌ స్కిన్‌లో సుమారు 90–128 కేలరీలు ఉంటాయి. కాబట్టి ఎక్కువగా తిన్నా.. హృదయ సంబంధ సమస్యలు, బరువు పెరగడం లాంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి స్కిన్‌ చికెన్‌ మితంగా.. వారానికి ఒకసారి లేదంటే నెలలో నాలుగైదుసార్లు మాత్రమే తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు. అప్పుడే గుండెకు..ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.

కాల్చే పద్ధతులపైనా..
కాల్చిన కోడికి ప్రాధాన్యత ఇస్తుంటారు చాలా మంది. అందునా కట్టెల పొయ్యి అయితే బాగుంటుందని ఫీలవుతుంటారు. కానీ.. టౌన్లు, సిటీల్లో గ్యాస్‌ పొయ్యిలు, ఎలక్ట్రిక్‌ స్టౌలే కనిపిస్తుంటాయి. అయితే..

రుచి బాగుంటుందని కట్టెల పొయ్యి ప్రిపర్‌ చేసేవాళ్లకు అలర్ట్‌. అలాంటి పొగలో హానికారక రసాయనాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కట్టెల పొయ్యి నుంచి వెలువడే పాలీసైక్లిక్‌ ఆరోమెటిక్‌ హైడ్రోకార్బన్స్‌(PAHs), హెటిరోసైక్లిక్‌ అమెన్స్‌ (HCAs) వంటి రసాయనాలు క్యాన్సర్‌కు దారి తీయొచ్చని పరిశోధనలు చెబుతున్నాయి కూడా. కాబట్టి.. గాలి సరైన విధంగా బయటకు వెళ్లే రీతిలో ఉన్న గ్యాస్ స్టౌ, అసలు పొగ వెలువడని ఎలక్ట్రిక్ స్టౌలతోనే మంచిదని గుర్తించాలి.

స్కిన్‌లెస్‌లో బ్రెస్టే బెస్ట్‌
స్కిన్‌ లెస్‌ చికెన్‌లో బ్రెస్ట్‌ పీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. లెగ్‌ పీస్‌లతో పోలిస్తే.. పై భాగంలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి గుండెకు మంచిది. సంతృప్త కొవ్వు(Saturated fat) తక్కువగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్‌ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కండరాల పెరుగుదల, శరీర కణాల మరమ్మతుకు సాయపడే అధిక ప్రొటీన్ లభిస్తుంది‌. అలాగే స్కిన్ లేకుండా వాడితే కేలరీలు తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. వీటికి తోడు.. బ్రెస్ట్‌ పీస్‌లోని లీన్‌ మీట్(తక్కువ కొవ్వు (fat) కలిగిన మాంసం).. సులభంగా జీర్ణం అవుతుంది.

సరిగ్గా ఉడకకపోయినా..
స్కిన్‌ లేదంటే స్కిన్‌లెస్..ఏదైనా సరే‌ చికెన్‌ తినడం శరీరానికి లాభాలు ఉన్నాయి. చికెన్‌లో అదనంగా విటమిన్లు B6, B12, నియాసిన్‌, సెలనియం, పాస్పరస్‌.. పోషకాలు ఉంటాయి. ఇవి మెటబాలిజంతో పాటు రక్తకణాల ఉత్పత్తి, రోగనిరోధక శక్తి పెంపు కోసం అవసరంపడేవే.  అయితే వండే విధానం, తీసుకునే పరిమాణం ఆధారంగానే ఫలితం డిసైడ్‌ అవుతుంది. తాజా చికెన్‌కే ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలి. చికెన్‌ను ఉడికించడం, గ్రిల్‌, బేక్‌ చేయడం మంచిది. సరైన వేడిలో.. సరిగ్గా ఉడకకపోతే బాక్టీరియాల వల్ల ఫుడ్‌ పాయిజన్‌ అయ్యే ప్రమాదం లేకపోలేదు. అలాగే డీప్‌ఫ్రైలు, స్కిన్‌ చికెన్‌ అధికంగా తీసుకుంటే గుండె జబ్బులు తప్పవు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement