యాషెస్ 2025-26 సిరీస్‌ను విజయంతో ముగించాలన్న ఇంగ్లండ్‌కు చేదు అనుభవమే మిగిలింది. ఆఖదైన ఐదో టెస్టులోనూ ఆస్ట్రేలియా విజయం సాధించింది. తద్వారా 4-1తో ఈ టెస్టు సిరీస్‌ను ఆతిథ్య ఆసీస్ తమ సొంతం చేసుకుంది.
పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఆసీస్ గెలవగా.. మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్ విజయం సాధించింది. అయితే, సిడ్నీ వేదికగా ఆదివారం మొదలైన ఐదో టెస్టు.. గురువారం ముగిసింది. ఐదు రోజుల పాటు పూర్తి స్థాయిలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది.
‘బజ్‌బాల్’ ఆటకు స్వస్తి!
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ఓటమిపై ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) స్పందించాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దూకుడుగా ముందుకుపోయే ‘బజ్‌బాల్’ ఆటకు స్వస్తి పలుకుతామనే సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మాతో మ్యాచ్‌లో ఎలా ఆడాలో బహుశా అన్ని జట్లకు తెలిసిపోయి ఉంటుంది.
బ్యాట్‌తో బరిలోకి దిగినపుడు మేము అంతా బాగుందనే అనుకుంటున్నాం. కానీ ప్రత్యర్థి జట్లు మాకోసం మరింత మెరుగైన ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. వాళ్లు ఎదురుదాడికి దిగుతున్నారు.
ఇలాగే ఆడితే..
కాబట్టి పరిస్థితులకు తగ్గట్లుగా మేము బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మా ప్రదర్శన తీసికట్టుగా ఉంది. మా బ్యాటింగ్ సరిగ్గా లేదు. ఇక ముందు కూడా ఇలాగే ఆడితే భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ సిరీస్‌లో ఈ విషయాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను.
ఒకరిపై ఒకరం నిందలు వేసుకోవడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. అయితే, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఆడాలి. మా జట్టు అలాంటిదే. మేము తిరిగి పుంజుకుని మునుపటి మాదిరే ఉన్నత స్థితికి చేరుకుంటాం.
ఏదేమైనా ఈ సిరీస్ మొత్తం ఆస్ట్రేలియా అత్యద్భుతంగా ఆడింది. వాళ్లకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్.. ఆసీస్ జట్టు మొత్తం అదరగొట్టింది. మేము కూడా మా పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు సాగుతాం’’ అని స్టోక్స్ పేర్కొన్నాడు.
కాగా ఆసీస్ గడ్డపై యాషెస్‌లో మరోసారి ఘోర పరాభవం నేపథ్యంలో ‘బజ్‌బాల్’ ఆద్యులు హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్ స్టోక్స్‌ను పదవుల నుంచి తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ యాషెస్ ఐదో టెస్టు స్కోర్లు
👉వేదిక: సిడ్నీ క్రికెట్ గ్రౌండ్, సిడ్నీ
👉టాస్: ఇంగ్లండ్.. తొలుత బ్యాటింగ్
👉ఇంగ్లండ్: 384 & 342
👉ఆస్ట్రేలియా: 567 & 161/5
👉ఫలితం: ఐదు వికెట్ల తేడాతో ఆసీస్ గెలుపు.


