టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి భారత జట్టు మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న ప్లేయర్‌గా ఇప్పటికైనా గిల్‌కు అందులోని కష్టం అర్థమైందని పేర్కొన్నాడు. టెస్టు ప్రాధాన్యత ఏమిటో అతడికి తెలిసివచ్చిందని.. అందుకే ఆ దిశగా మార్పుల కోసం గొంతు విప్పాడని ద్రవిడ్ అన్నాడు.
ఘోర పరాభవాలు
గత రెండేళ్ల కాలంలో సొంతగడ్డపై టీమిండియాకు రెండు ఘోర పరాభవాలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్ చేతిలో తొలిసారి 3-0తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన భారత్.. ఇటీవల సౌతాఫ్రికా చేతిలోనూ పాతికేళ్ల విరామం తర్వాత తొలిసారి 2-0తో క్లీన్‌స్వీప్ అయింది.
అందుకే ఈ చేదు అనుభవాలు
ఈ పరిణామాల నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir)పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మరోవైపు.. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్ (Shubman Gill)కు సైతం సఫారీల చేతిలో వైట్‌వాష్ రూపంలో పీడకల మిగిలింది. విరామం లేకుండా వరుస సిరీస్‌లు ఆడటం.. సరైన విధంగా సన్నద్ధం కాకపోవడం వల్లే టెస్టుల్లో చేదు అనుభవం మిగిలిందని గిల్ భావించాడు.
బీసీసీఐకి ఓ విజ్ఞప్తి
ఈ నేపథ్యంలోనే టెస్టు సిరీస్‌కు ముందు కనీసం పదిహేను రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని గిల్.. బీసీసీఐని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తాజాగా స్పందించాడు. బెంగళూరులో ఓ ఈవెంట్‌కు హాజరైన సందర్భంగా ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ..
గిల్‌కు బాగానే అర్థమైంది
‘‘టెస్టు సన్నద్ధత గురించి శుబ్‌మన్ ఇటీవలే ఓ కీలక సలహా ఇచ్చినట్లు తెలిసింది. అనుభవజ్ఞుడైన ఆటగాడిగా అతడికి ఈ విషయంలో అవగాహన ఉంది. ఇటీవల కాలంలో అతడు మూడు ఫార్మాట్లు ఆడుతూ బిజీగా గడిపాడు.
ఈ క్రమంలోనే టెస్టు ఫార్మాట్‌కు ఎలా సన్నద్ధం కావాలన్న అంశం అతడికి ఇప్పటికి బాగా అర్థమై ఉంటుంది. సంప్రదాయ క్రికెట్‌లో ఉన్న కష్టం ఏమిటో అతడికి తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు.
మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు.. వెనువెంటనే ఒక ఫార్మాట్ నుంచి మరొకదానికి మారటం కాస్త కష్టంగానే ఉంటుంది. టెస్టు సిరీస్‌కు నాలుగు రోజుల ముందు కూడా మ్యాచ్ ఆడాల్సి ఉంటే పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. అసలు టెస్టు మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే సమయమే దొరకదు.
ప్రాక్టీస్‌తో పాటు నైపుణ్యం అవసరం
గత నాలుగైదు నెలల క్రితం జరిగిన రెడ్‌బాల్ మ్యాచ్‌ల ఆధారంగా జట్టులోని కొంతమంది ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి వచ్చిన విషయాన్ని గమనించాలి. ఇదే అతిపెద్ద సవాలు. టర్నింగ్ ట్రాక్స్, లేదంటే సీమింగ్ పిచ్‌ల మీద గంటల తరబడి బ్యాటింగ్ చేయడం అంత సులువేమీ కాదు. ఇందుకు ప్రాక్టీస్‌తో పాటు నైపుణ్యం అవసరం’’ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.


