పృథ్వీ షా (PC: BCCI/IPL)
ఒకప్పుడు సచిన్ టెండుల్కర్ వారసుడిగా నీరాజనాలు అందుకున్నాడు ముంబై క్రికెటర్ పృథ్వీ షా. చిన్న వయసులోనే అద్భుతమైన ఆట తీరుతో అభిమానులను ఆకర్షించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. కెప్టెన్‌గా భారత్‌కు అండర్-19 వరల్డ్‌కప్ ట్రోఫీ అందించాడు.
ఈ క్రమంలోనే టీమిండియా ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన పృథ్వీ షా (Prithvi Shaw) తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే, ఆ తర్వాత వరుస వైఫల్యాలతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. క్రమశిక్షణా రాహిత్యం కారణంగా ముంబై జట్టులోనూ అతడి స్థానం గల్లంతైంది. దీంతో పొరపాట్లు సరిచేసుకున్న పృథ్వీ షా.. తిరిగి గాడిలో పడ్డాడు.
రూ. 75 లక్షల కనీస ధర
దేశీ క్రికెట్‌లో మరోసారి బ్యాట్‌తో మెరిసి తనను తాను నిరూపించుకున్నాడు. ముంబైని వీడి మహారాష్ట్ర జట్టులో చేరి సత్తా చాటాడు పృథ్వీ షా. ఈ క్రమంలో ఐపీఎల్-2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 75 లక్షల కనీస ధరకు అతడిని కొనుగోలు చేసింది.
ఒకప్పుడు ఐపీఎల్‌లో కోట్లు పలికిన పృథ్వీని.. అదే జట్టు ఇలా బేస్ ప్రైస్‌కు దక్కించుకోవడం విశేషం. నిజానికి ముందు రౌండ్లలో అతడు అన్‌సోల్డ్‌గా మిగిలిపోగా ఆఖర్లో ఢిల్లీ కనికరించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పృథ్వీ షాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
ప్రపంచం అతడిని మర్చిపోయింది. ఈసారి
‘‘పృథ్వీ షాకు ఇదొక గొప్ప అవకాశం. ఇప్పటికే ప్రపంచం అతడిని మర్చిపోయింది. ఇప్పుడతడు మునుపటి ఆటగాడే. కఠిన శ్రమతో తనను తాను సరిదిద్దుకుని పరుగులు రాబడుతున్నాడు.
అందుకే ఇక్కడిదాకా చేరుకోగలిగాడు. ఒకవేళ తుదిజట్టులో ఆడే అవకాశం వస్తే అతడు ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని ఆకాశ్ చోప్రా పృథ్వీకి సూచించాడు. కాగా పృథ్వీ షా ఇటీవలే తన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన విషయం తెలిసిందే. మోడల్, నటి ఆకృతి అగర్వాల్‌తో అతడు నిశ్చితార్థం చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ మార్చి 28 నుంచి మొదలుకానుంది. కాగా అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ గతేడాది ఏడు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ప్లే ఆఫ్స్ చేరకుండానే నిష్క్రమించింది.
చదవండి: IPL 2026: విసిగిపోయాం.. రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా వార్నింగ్!?


