రోహిత్ శర్మతో హార్దిక్ పాండ్యా (PC: BCCI/IPL)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్రకెక్కింది. రోహిత్ శర్మ సారథ్యంలో 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ట్రోఫీని ముద్దాడింది.
ఆరో టైటిల్ కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న ముంబై (MI) ఈసారి ఎలాగైనా చాంపియన్‌గా నిలవాలని పట్టుదలగా ఉంది. కాగా గతేడాది పద్నాలుగింట ఎనిమిది గెలిచిన ముంబై నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.
హార్దిక్‌కు పగ్గాలు
ఇదిలా ఉంటే... 2024లో గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యా (Hardik Pandya)ను ముంబై తమ కెప్టెన్‌గా నియమించింది. దీంతో రోహిత్ శర్మను తొలగించి అతడి స్థానంలో హార్దిక్‌కు పగ్గాలు ఇవ్వడం పట్ల సొంతజట్టు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్దిక్‌ను మైదానం లోపల, వెలుపలా తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.
ఈసారి మంచి మార్కులే
ఆ ఏడాది ముంబై మరీ దారుణంగా పద్నాలుగుకు నాలుగు మ్యాచ్‌లే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదోస్థానానికే పరిమితమైంది. అయితే, గతేడాది ప్లే ఆఫ్స్ చేర్చిన హార్దిక్ కెప్టెన్సీకి మంచి మార్కులే పడ్డాయి. మరోవైపు.. గత సీజన్లో రోహిత్ శర్మ ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలో దిగాడు. మొత్తంగా 15 ఇన్నింగ్స్‌లో కలిపి 418 పరుగులు సాధించాడు.
రోహిత్ శర్మకు హార్దిక్ పాండ్యా వార్నింగ్!?
ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్ పాండ్యా- రోహిత్ శర్మకు సంబంధించి ఓ వదంతి పుట్టుకొచ్చింది. రోహిత్ ప్రదర్శన పట్ల అసంతృప్తితో ఉన్న హార్దిక్ అతడికి వార్నింగ్ ఇచ్చాడని దాని సారాంశం. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ఓ నెటిజన్.. ‘‘ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందు హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మకు గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఈసారి రోహిత్ శర్మ ప్రదర్శన సరిగ్గా లేకపోతే.. తాను సహించే ప్రసక్తే లేదని మేనేజ్‌మెంట్‌కు తేల్చి చెప్పాడు. యాజమాన్యం కూడా గత 10-12 ఏళ్లుగా రోహిత్ బ్యాటింగ్‌తో విసిగిపోయి ఉంది. అతడి స్ట్రైక్‌రేటు 120 కూడా దాటడం లేదు. ఎక్కువ మొత్తం అందుకుంటున్న ఆటగాడి నుంచి ఈ ప్రవర్తన మేము ఊహించలేదని వాపోతోంది’’ అని పేర్కొన్నారు.
స్పందించిన ముంబై
ఈ ట్వీట్ వైరల్ కాగా.. ముంబై ఇండియన్స్ తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి స్వయంగా స్పందించింది. ‘‘అవునా.. ఏదైనా జరగొచ్చు’’ అంటూ నవ్వుతున్న ఎమోజీ జోడించి.. ఎవరికిష్టం వచ్చినట్లు వారు రాస్తారు అన్న అర్థంలో రూమర్లను కొట్టిపారేసింది.
చదవండి: IPL 2026: సీఎస్‌కేను కోర్టుకీడ్చిన కావ్యా మారన్!
Kuch bhi! 😂 https://t.co/lEiFBgaEoh pic.twitter.com/SYw1im5Mfi
— Mumbai Indians (@mipaltan) March 13, 2026


