ఆటో డ్రైవర్‌ నుంచి రూ. 900 కోట్ల కంపెనీ రేంజ్‌కి..! జస్ట్‌ దేశీ బ్రాండ్‌తోనే.. | How Autorickshaw Driver Sathya Shankar built Rs 900 Crore BusinessSathya Shankar 12th Pass 12th Pass Autorickshaw Driver built Rs 900 Crore Business built Rs 900 Crore Business | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌ నుంచి రూ. 900 కోట్ల కంపెనీ రేంజ్‌కి..! జస్ట్‌ దేశీ బ్రాండ్‌తోనే..

Jun 12 2026 1:35 PM | Updated on Jun 12 2026 1:35 PM

 How Autorickshaw Driver Sathya Shankar built Rs 900 Crore BusinessSathya Shankar 12th Pass 12th Pass Autorickshaw Driver built Rs 900 Crore Business built Rs 900 Crore Business

జీరో నుంచి మొదలు పెట్టి కోట్లు గడించే రేంజ్‌కి చేరుకున్నాడు. అదికూడా తన చుట్టు ఉన్న అవసరాలే వ్యాపారంగా మలిచాడు. ఆఖరికి విలాసవంతమైన కారు కొన్నా..అది తన స్థాయి చూపించుకోవడానికి కాకుండా..సొంతూరు గర్వించే స్థాయిలో  ఉన్నాను అని చూపేందుకు అని చెబుతుంటాడు. గెలుపుకి పెద్ద పెద్ద డిగ్రీలు, బ్యాంగ్రౌండ్‌తో పనిలేదని చాటిచెప్పిన అసామాన్యుడి కథ ఇది. సాధారణ ఆటో రిక్షా డ్రైవర్‌గా మొదలైన జీవితం ఏకంగా రూ. 900 కోట్ల టర్నోవర్‌ చేసే కంపెనీకి యజమానిగా మారి యవతకు ప్రేరణగా నిలిచిన విజయగాథ ఇది. 

అతడే కర్ణాటకలోని బళ్లారికి చెందిన సత్య శకంర్‌. అతడు ఇంటర్‌ డ్రాపౌట్‌. తండ్రి సాధారణ పూజరి, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమే కావడంతో చదువుకి మధ్యలోనే స్వస్తి చెప్పాల్సి వచ్చింది. దాంతో కుటుంబ పోషణ కోసం కష్టపడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ సంపాదించి..ఆటో రిక్షా నడుపుతుండే వాడు. ఆ తర్వాత ప్రభుత్వ పథకం కింద రుణంపై సొంతంగా ఆటో కొనుక్కుని నడపడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆ రుణాన్ని తీర్చేసి..వెంటనే తన ఆటోని కారుగా మార్చాడు.

ట్యాక్సీ ‍డ్రైవర్‌గా తనుండే జిల్లా చుట్టూనే కాకుండా రాష్ట్ర సరిహద్దులు దాటి ముందుకెళ్లాడు. ఆ క్రమంలో తరచుగా విదేశీ పర్యాటకులను తన వాహనంలో తీసుకువెళ్లేవాడు. వాళ్లంతా ఎక్కడ నుంచి వచ్చినా..మొదటగా కొనేది ప్యాక్‌ చేసిన మంచినీటి సీసానే అని గమనించాడు శంకర్‌. తాను రోడ్డుపై దృష్టిపెడితే..విదేశీ పర్యాటకులంతా ఆరోగ్యంపై దృష్టి పెట్టి ఇలా చేస్తున్నారని గ్రహించాడు. అప్పుడే ఇదేదో పనికొచ్చే బిజినెస్‌లా ఉందే అని అతడి బుర్రలో ఒక ఆలోచన తళుక్కుమంది కానీ ఆచరణలోకి తీసుకురాలేదు. 

ఆ తర్వాత కారు నడపడం కంటే..కారు విడిభాగాలను అమ్మే వ్యాపారమే బెటర్‌ అని గ్రహించి ఆటోమొబైల్‌ వ్యాపారం ప్రారంభించాడు. విడిభాగాలు కొనే ప్రతి కస్టమర్‌కు టైర్‌ కూడా అవసరం అని గ్రహించి టైర్ల దుకాణాన్ని కూడా తెరిచాడు. అంతేగాదు తన వద్ద రైతులు, స్థానికులు అరువుపై వస్తువులు కొనుగోలు చేసేవారు. చిన్న చిన్న వాయిదాలలో తిరిగి చెల్లించేవారు. దాంతో తను కూడా బ్యాంకుకు విడతల వారీగా డబ్బు చెల్లించొచ్చని తెలుసుకున్నాడు శంర్‌. 

అలా 1994లో ప్రవీణ్ క్యాపిటల్ అనే ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించాడు. ఇతర ఫైనాన్షియర్లు పాత వాహనాలను పట్టించుకోనప్పటికీ, శంకర్ సెకండ్ హ్యాండ్ ఆటోలు,కార్లకు రుణాలు ఇచ్చాడు. అతను కూడా ఒక కష్టపడే డ్రైవరే కాబట్టి, కష్టాల్లో ఉన్న డ్రైవర్‌ను పరిస్థితిని అర్థం చేసుకుని ఈ సాహసానికి పూనుకున్నాడు. ఇక ఆ తర్వాత తనలో ఆనాడు విదేశీ పర్యాటకుల కారణంగా తన బ్రెయిన్‌లో తట్టిన ఆ  వ్యాపార ఆలోచనను ఆచరణలో పెట్టే ప్రయత్నం చేశాడు. 

భారీ వర్షాలు కురిసే పుత్తూరు సమీపంలోని నరిమొగేరు అనే గ్రామంలో అతను మంచినీటి  ఫ్యాక్టరీని స్థాపించాడు. అతను ఆ బ్రాండ్‌కు బిందు (‘కన్నడలో చుక్క’) అని పెట్టారు. అక్కడితో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆపలేదు. శంకర్‌ ఉత్తర్‌ భారత దేశ పర్యటనలో ఓ చిన్న సోడా దుకాణం వద్దకు వచ్చాడు. అక్కడ సర్వ్‌ చేసిన సోడా పానీయం అతడికి మరో వ్యాపారాన్ని నిర్మించేదుకు దారితీసింది. అలా తన సొంతూరు పుత్తూరులో బిందు ఫిజ్‌ జీరా మసాల అనే కూల్‌డ్రింక్‌ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. 

మొదట్లో వంద సేల్‌ అవ్వడమే కష్టంగా ఉండేది. అయితే దేశీ రుచి కచ్చితంగా విజయవంతమవ్వుతుందన్న ఆశతో వెనక్కి తగ్గకుండా హైవేలపై ఉండే గోడలనే ప్రచార బోర్డులుగా మార్చి ఆ డ్రింక్‌ ప్రకటనలను ఇచ్చేవాడు. నోటి మాటతో దాని రుచి ప్రజలకు చేరువయ్యేలా చేశాడు. దాంతో గ్రామీణ శైలి ఆహారంతో ప్రజలు కోరుకునే పానీయంగా ప్రజల మదిలో నిలిచే చల్లని పానీయంగా బిందు ఫిజ్‌ని స్థిరపడేలా చేశాడు. మార్చి 2025 నాటికి 60 ఏళ్లు శంకర్‌కి. కానీ ఆయన వ్యాపార విస్తరణ ఆగలేదు. ఇప్పటికీ అంతే ఉత్సాహంతో సాగిపోతున్నాడయన. 

అంతేగాదు ఆయన ఎస్జీ కార్పొరేట్స్, ఇప్పుడు రూ. 900 కోట్ల టర్నోవర్‌ ఆర్జిస్తుండగా, హౌస్ ఆఫ్ బిందు (పానీయాలు , స్నాక్స్) రూ. 570 కోట్ల ఆదాయం, ప్రవీణ్ క్యాపిటల్ (ఫైనాన్స్ విభాగం) రూ. 330 కోట్లను ఆర్జిస్తోంది. ఆయన ప్రసిద్ధ జీరా మసాలా నుంచి మామిడి రసాలు, స్నాక్స్ వరకు 55 రకాల ఉత్పత్తులను అమ్ముతారు. ఆయనకు తెలంగాణ, కర్ణాటకలో కూడా ఫ్యాక్టరీలు ఉన్నాయి. 

పైగా ఆంధ్రలో కొత్తవి రానున్నాయి కూడా. ఆయన వద్ద ప్రస్తుతం రోల్స్‌ రాయిస్‌ కారు కూడా ఉంది. అది తన స్టేటస్‌ ఆఫ్‌ సింబల్‌ కోసం కాదని, బళ్లారికి చెందిన వ్యక్తి ఎంత దూరం వెళ్లగలడు అని చెప్పడానికని గర్వంగా అంటాడు శంకర్‌. తన వ్యాపారాలన్నీ..సామాన్య ప్రజలు కోరుకునేది, వారి అవసరాల దృష్టి నుంచి మొదలైనవేనని, అదే తన సక్సెస్‌మంత్ర అని అంటాడాయన. అంతేగాదు అంతా ఇంగ్లీష్‌ పానియాలతో వ్యాపారం చేస్తే..స్థానిక భాషకు ప్రాధాన్యత ఇచ్చి..దేశీ రుచిని అందించే పానీయాలను తీసుకొచ్చారు. ఓపిక, నిశిత పరిశీలన ఉంటే..ఎప్పటికైనా గెలుపు తథ్యం అంటాడు కర్ణాటకకు చెందిన సత్య శంకర్‌.

(చదవండి: అమ్మ కలను నెరవేర్చిన కూతురు..! 73 ఏళ్ల​ వయసులో ఆమె ..)

 

Advertisement
 
Advertisement
Advertisement