ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ అంశం వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ప్రధానికి పంపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సీజేపీ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. సీజేపీ ఉద్యమంతో ధర్మేంద్ర ప్రధాన్ దిగొచ్చారు. ఆయన రాజీనామాతో సీజేపీ పోరాటం ఫలించింది. సీజేపీ విధించిన డెడ్‌లైన్‌లోపే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి. యువత ఆకాంక్షలను గౌరవిస్తున్నా. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేశా. కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధించాయి. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదు’’ అని పేర్కొన్నారు.
‘‘భారత ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎప్పుడూ అచంచల విశ్వాసం ఉంది. దేశ యువత ఆశయాలు, కలలు, ఆకాంక్షల పట్ల నాకు అపార గౌరవం ఉంది. యువత కేవలం దేశ భవిష్యత్తు మాత్రమే కాదు.. వికసిత భారత నిర్మాణానికి వారే ప్రధాన శిల్పులు. గత 10 రోజులుగా జరిగిన పరిణామాలను చూసి నా మనసు తీవ్రంగా కలత చెందింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు. భారత యువశక్తే దేశానికి అసలైన బలం. దేశ యువతను అపోహలు, దుష్ప్రచారాల వలలో పడనివ్వకూడదన్నదే నా సంకల్పం.
..జంతర్-మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమ ప్రయోజనాలకు వినియోగించుకోకుండా చూడాలి. దేశ ఐక్యత దెబ్బతినకూడదు. దేశంలోని ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా న్యాయపరమైన చిక్కుల్లో పడకూడదు. విద్యార్థులు తమ సమయాన్ని చదువుకే కేటాయించి, కెరీర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నా రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపించాను.
..నరేంద్ర మోదీ మార్గదర్శనం, నాపై ఉంచిన విశ్వాసం, నిరంతర సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా సహచర మంత్రులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బంది, నాతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. దేశసేవ నా జీవితంలో అత్యున్నత ప్రాధాన్యం. దానికి నేను ఎప్పటికీ అంకితభావంతో ఉంటాను’’ అని లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026


