న్యూఢిల్లీ: 2026 ఆగస్టు నెలలో సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం రెండు కూడా సంభవించనున్నాయి. ఆగస్టు 12న అమావాస్య రోజున సంపూర్ణ సూర్య గ్రహణం ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం ఆగస్టు 12 రాత్రి 9:04 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 13 తెల్లవారుజామున 4:25 గంటల వరకు ఇది కొనసాగుతుంది. ఈ గ్రహణం యూరప్, స్పెయిన్, గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, రష్యా దేశాలలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఇక రెండోది చంద్ర గ్రహణం.. ఇది ఆగస్టు 28న రక్షాబంధన్ పండుగ రోజున వస్తుంది. ఇది ఉదయం 8:04 గంటలకు ప్రారంభమై ఉదయం 11:22 గంటలకు ముగుస్తుంది. ఈ చంద్ర గ్రహణం ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, సౌదీ అరేబియాలలో కనిపించనుంది.
ఈ రెండు గ్రహణాలు భారత్‌లో కనిపించవు. జ్యోతిష్య శాస్త్ర నమ్మకాల ప్రకారం, ఏ ప్రాంతంలోనైనా గ్రహణాలు కనిపిస్తేనే వాటికి మతపరమైన ప్రాముఖ్యత ఉంటుంది. భారత్‌లో ఈ రెండు గ్రహణాలు కనిపించకపోవడం వల్ల ఇక్కడ సూతక కాలం వర్తించదు. దీనివల్ల పండుగ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికైనా ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఆలయాల తలుపులు కూడా యథావిధిగా తెరిచే ఉంటాయి. రక్షాబంధన్ పండుగతో పాటు ఇతర పండుగలపై గ్రహణాల వల్ల ఎలాంటి అశుభ ప్రభావం ఉండదని జ్యోతిష్య నిపుణులు తెలిపారు. హిందూ నమ్మకాల ప్రకారం గ్రహణానికి ముందు వచ్చే అశుభ కాలాన్ని సూతకకాలం అంటారు. చంద్ర గ్రహణానికి 9 గంటలు, సూర్య గ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అయితే భారత్‌లో ఈ గ్రహణాలు దృశ్యమానం కానందున సూతకకాల నియమాలు ఇక్కడ పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: పండుగల పర్వానికి నాంది.. తొలి ఏకాదశి వైభవం!


