కంపెనీల ఆదాయాలపై పశ్చిమాసియా ఎఫెక్ట్‌ | Iran war and El Nino will jolt Q1 earnings for companies says ICRA | Sakshi
Sakshi News home page

కంపెనీల ఆదాయాలపై పశ్చిమాసియా ఎఫెక్ట్‌

Jun 21 2026 5:47 AM | Updated on Jun 21 2026 6:30 AM

Iran war and El Nino will jolt Q1 earnings for companies says ICRA

క్యూ1లో ఫలితాలపై ఎల్‌ నినో ప్రభావం కూడా 

100–150 బీపీఎస్‌ మేర తగ్గనున్న లాభాల మార్జిన్లు 

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా నివేదిక 

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీ కార్పొరేట్ల ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపనున్నాయి. వీటికి ఎల్‌నినో ఎఫెక్ట్‌ కూడా తోడు కావడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీల నిర్వహణ లాభాల మార్జిన్లు దెబ్బతినే అవకాశం ఉంది. సుమారు 100–150 బీపీఎస్‌ మేర తగ్గొచ్చని అంచనాలు నెలకొన్నాయి. రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఎల్‌ నినో పరిస్థితుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ దెబ్బతినవచ్చు. అలాగే కార్పొరేట్‌ రంగంలో పలు సంస్థల ఆదాయాలపైనా ప్రభావం పడొచ్చు. 

‘క్రూడాయిల్‌ రేట్లు భగ్గుమనడం, రూపాయి క్షీణత వల్ల దిగుమతుల వ్యయాలు పెరిగిపోవడం కారణంగా 2026–27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) నిర్వహణ లాభాల మార్జిన్‌ (ఓపీఎం) 100–150 బేసిస్‌ పాయింట్ల (ఒకటి–ఒకటిన్నర శాతం) మేర తగ్గే అవకాశం ఉంది‘ అని ఇక్రా వెల్లడించింది. సమీప భవిష్యత్తులో కూడా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఎల్‌నినోపరంగా డిమాండ్‌కి రిసు్కలు పొంచి ఉన్నాయని పేర్కొంది. దీనితో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా తోడై కార్పొరేట్ల ఆదాయాల మీద ప్రభావం పడొచ్చని వివరించింది. 2026–27లో కార్పొరేట్‌ ఇండియా ఆదాయ వృద్ధి సింగిల్‌ డిజిట్‌కి పరిమితం కావొచ్చని తెలిపింది. 2025–26 క్యూ4లో వార్షిక ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 13.2 శాతంగా నమోదైంది.

ధరల పెంపుతో కాస్త ఊరట..
పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఇంధనాలు, లాజిస్టిక్స్, ప్యాకేజింగ్‌ వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. అలాగే రూపాయి పతనంతో దిగుమతి చేసుకునే ముడి వస్తువుల ధరలూ పెరిగాయి. ఇవన్నీ వెరసి సమీప భవిష్యత్తులో లాభాల మార్జిన్లపై ప్రభావం చూపవచ్చు. అయితే, పాక్షికంగానే అయినప్పటికీ ధరలను పెంచడం వల్ల మార్జిన్లపై ఒత్తిడిని కంపెనీలు కొంత మేర అధిగమించవచ్చు. కాకపోతే, హఠాత్తుగా ధరలను పెంచేస్తే డిమాండ్‌ దెబ్బతిని, పోటీ సంస్థలతో పోలిస్తే వెనుకబడిపోయే అవకాశాలూ ఉన్నాయి. 

వేతన జీవుల ఆదాయాలు స్థిరంగా ఉండటం వల్ల పట్టణ ప్రాంతాల్లో వినియోగం కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం కారణంగా ఓవరాల్‌ డిమాండ్‌కి  మాత్రం సవాళ్లు తప్పేలా లేవు. క్రూడాయిల్‌ ధరలు ఎగియడం, రూపాయి క్షీణించడంలాంటి అంశాల వల్ల వినియోగ ఆధారిత రంగాల్లో అమ్మకాల పరిమాణం.. ఆశించినంత స్థాయిలో పెరగకపోవచ్చు. ‘బ్యాలెన్స్‌ షీట్లు పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ, పశ్చిమాసియా సంక్షోభం వల్ల నిర్వహణ పరిస్థితులనేవి పెట్టుబడులకు అనువైనవిగా ఉండటం లేదు. 

తయారీ (డిఫెన్స్, ఎల్రక్టానిక్స్, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, ఇతరత్రా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు వర్తించే సెగ్మెంట్లు), పవర్‌ పరికరాలు, రియల్‌ ఎస్టేట్, డేటా సెంటర్లలాంటి కొన్ని నిర్దిష్ట రంగాల్లో మాత్రమే ప్రైవేట్‌ రంగం పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి‘ అని ఇక్రా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, కో–గ్రూప్‌ హెడ్‌ (కార్పొరేట్‌ రేటింగ్స్‌) కింజల్‌ షా తెలిపారు. మధ్యకాలికంగా చూస్తే, అంతర్జాతీయ వాణిజ్యం, కమోడిటీల ధరలపరమైన హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ రిసు్కలు మొదలైన అనిశ్చితులను ఎదుర్కొనేందుకు రంగాలవారీ పరిణామాలు, విధానపరమైన చర్యలు ఎంత సమర్ధవంతంగా పని చేస్తున్నాయనే దానిపై దేశీ కార్పొరేట్ల రుణ పరపతి ఆధారపడి ఉంటుందని షా చెప్పారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement