UPI సృష్టికర్త ఎవరు.. ఎలా మొదలైంది ఈ డిజిటల్‌ విప్లవం? | UPI History who created UPI how Indias Digital Payment Revolution Began | Sakshi
Sakshi News home page

UPI సృష్టికర్త ఎవరు.. ఎలా మొదలైంది ఈ డిజిటల్‌ విప్లవం?

Aug 9 2026 9:09 AM | Updated on Aug 9 2026 9:34 AM

UPI History who created UPI how Indias Digital Payment Revolution Began

దేశంలో డిజిటల్‌ చెల్లింపులకు పర్యాయపదంగా మారిపోయిన యూపీఐ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. యూపీఐ లావాదేవీలపై భవిష్యత్‌లో ఎంపిక చేసిన కొన్ని వ్యాపార లావాదేవీలకు స్వల్ప ఛార్జీలు విధించే అవకాశం ఉందన్న ప్రభుత్వ తాజా ప్రకటనతో దీనిపై చర్చ మొదలైంది. అయితే యూపీఐపై ఛార్జీల గురించి మాట్లాడుతున్న ఈ సమయంలో.. అసలు యూపీఐ ఎలా పుట్టింది? దీని వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి.. మరి సమాధానాలు తెలుసుకుందామా..

ఒక వ్యక్తి సృష్టి కాదు.. ఒక వ్యవస్థ ఆవిష్కరణ

యూపీఐ (Unified Payments Interface)ని ఒక్క వ్యక్తి సృష్టించలేదు. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసింది. ఆర్‌బీఐ నియంత్రణలో పనిచేసే ఎన్‌పీసీఐ.. దేశంలోని రిటైల్ పేమెంట్ వ్యవస్థలకు మౌలిక వేదికగా ఏర్పడింది. ఇప్పటికే ఉన్న IMPS మౌలిక సదుపాయాలపై ఆధారపడి, వివిధ బ్యాంకు ఖాతాలను ఒకే ఇంటర్‌ఫేస్‌ ద్వారా అనుసంధానించి తక్షణ చెల్లింపులు చేసేలా యూపీఐని రూపొందించారు.

అంటే యూపీఐ అనేది ఒక యాప్ కాదు. బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, వినియోగదారులు, వ్యాపారులను ఒకే వ్యవస్థలో అనుసంధానించే పేమెంట్ ప్రోటోకాల్‌. అందుకే ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు, వేర్వేరు యాప్‌లను ఉపయోగించినా, నేరుగా డబ్బు పంపడం సాధ్యమవుతోంది.

2016లో కీలక అడుగు

యూపీఐ ప్రయోగాత్మకంగా 2016 ఏప్రిల్ 11న ప్రారంభమైంది. ముంబైలో అప్పటి ఆర్‌బీఐ గవర్నర్‌ డాక్టర్ రఘురామ్ రాజన్ దీనిని పైలట్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీసీఐకి అప్పటి సలహాదారుగా ఉన్న నందన్ నీలేకని, ఎన్‌పీసీఐ చైర్మన్ బాలచంద్రన్ ఎం., అప్పటి ఎండీ & సీఈవో ఏపీ హోటా, సీవోవో దిలీప్ అస్బే తదితరులు కీలకంగా పాల్గొన్నారు.

నందన్ నీలేకని పేరు ఎందుకు వినిపిస్తుంది?

యూపీఐ గురించి మాట్లాడినప్పుడు నందన్ నీలేకని పేరు తరచూ వినిపిస్తుంది. అందుకు కారణం ఆయన అప్పట్లో ఎన్‌పీసీఐకి సలహాదారుగా ఉండటం, డిజిటల్ పేమెంట్స్‌కు సంబంధించిన వ్యవస్థల రూపకల్పనలో కీలకంగా సహకరించడం. అదే సమయంలో యూపీఐని డిజైన్ చేయడం, నిర్మించడం, ఆపరేషనల్‌ చేయడంలో దిలీప్ అస్బే కీలక పాత్ర పోషించినట్లు అంతర్జాతీయ టెలికాం యూనియన్‌ (ITU) ప్రొఫైల్‌ కూడా పేర్కొంటుంది. ఆయన అప్పట్లో ఎన్‌పీసీఐ సీవోవోగా ఉండగా యూపీఐ ప్రాజెక్టులో కీలకంగా పనిచేశారు.

21 బ్యాంకులతో ప్రారంభం

2016 ఏప్రిల్‌లో ప్రారంభమైన పైలట్‌లో 21 మెంబర్ బ్యాంకులు పాల్గొన్నాయి. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి యూపీఐ సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి రావడం ప్రారంభమైంది. మొదట్లో యూపీఐ ద్వారా డబ్బు పంపడం, డబ్బు కోరడం వంటి ప్రాథమిక సేవలు మాత్రమే ఉండగా.. కాలక్రమేణా QR చెల్లింపులు, ఆటోపే, యూపీఐ లైట్‌, 123పే వంటి అనేక సేవలు జతయ్యాయి.

ఇక్కడే యూపీఐ ప్రత్యేకత బయటపడింది. బ్యాంకు ఖాతా నంబర్, IFSC వంటి వివరాలు ప్రతిసారీ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా యూపీఐ ID, మొబైల్ నంబర్ లేదా QR కోడ్‌ ద్వారా చెల్లింపులు చేయగలిగే విధానాన్ని ఇది తీసుకొచ్చింది.

యూపీఐకి అసలు బలం.. ఇంటర్‌ఆపరబిలిటీ

యూపీఐ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి దాని ఇంటర్‌ఆపరబిలిటీ. అంటే ఒకే యాప్‌కు లేదా ఒకే బ్యాంకుకు వినియోగదారు పరిమితం కాకుండా.. వివిధ బ్యాంకు ఖాతాలను వివిధ యూపీఐ యాప్‌లతో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇదే విధానం భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల స్వరూపాన్ని మార్చింది. నగదు, కార్డు, నెట్‌ బ్యాంకింగ్ వంటి పద్ధతుల మధ్య ఉన్న గ్యాప్‌ను యూపీఐ తగ్గించింది. ముఖ్యంగా చిన్న దుకాణాలు, వీధి వ్యాపారులు, క్యాబ్ డ్రైవర్లు, స్వయం ఉపాధి చేసుకునేవారికి QR కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరించడం సులభమైంది.

నేడు ఎక్కడికి చేరింది?

యూపీఐ ఇప్పుడు కోట్లాది భారతీయుల రోజువారీ చెల్లింపు సాధనంగా మారింది. 2026 జూన్ నాటికి యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై 55.49 కోట్ల మంది వినియోగదారులు నమోదయ్యారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. FY 2025-26లో యూపీఐ ద్వారా 24,162 కోట్ల లావాదేవీలు, మొత్తం రూ.314 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఎన్‌పీసీఐ గణాంకాల ప్రకారం 2026 మేలోనే యూపీఐ ద్వారా సుమారు రూ.29.90 లక్షల కోట్ల విలువైన 2,320.19 కోట్ల లావాదేవీలు జరిగాయి.

ఇప్పుడు ఛార్జీల చర్చ ఎందుకు?

యూపీఐ ఇంత పెద్ద స్థాయికి చేరడంతో దాని మౌలిక సదుపాయాలను నిర్వహించే బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఫిన్‌టెక్ సంస్థల ఆదాయ నమూనాపై చర్చ పెరిగింది. ప్రస్తుతం సాధారణ వినియోగదారుల యూపీఐ చెల్లింపులపై ఛార్జీ లేదు. గతంలోనూ రూ.2,000కు పైబడిన యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధిస్తారన్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది.

తాజాగా ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసిన విషయం ఏమిటంటే.. వ్యక్తి నుంచి వ్యక్తికి (P2P) యూపీఐ లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతాయి. భవిష్యత్‌లో ఎండీఆర్‌ (Merchant Discount Rate -MDR) తీసుకొచ్చినా అది పరిమిత సంఖ్యలో, నిర్దిష్ట పరిమితికి మించిన కొన్ని వ్యాపార లావాదేవీలకే వర్తించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. సాధారణ వినియోగదారుడిపై నేరుగా ఛార్జీ విధించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement