సాక్షి,న్యూఢిల్లీ: యూపీఐ చెల్లింపులపై ఫీజులు వసూలు చేస్తారన్న వదంతులను కేంద్రం కొట్టివేసింది. వినియోగ దారులతోపాటు చిన్న వ్యాపారులకు కూడా యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగనున్నాయని స్పష్టం చేసింది. భవిష్యత్తులో మార్కెట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)ను అమలు చేస్తే మాత్రం కొంతమంది వ్యాపా రులు నామమాత్రపు ఫీజు చెల్లించాల్సి రావచ్చునని కేంద్రం శనివారం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం పార్ల మెంటు వర్షాకాల సమా వేశాల్లో 2007 నాటి పేమెంట్స్ అండ్ సెటిల్ మెంట్స్ సిస్టమ్స్ చట్టానికి మార్పు లు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టడం, లోక్‌సభ దీనికి ఆమోదం తెల పడం తెలిసిన విషయమే. ఈ చట్టం వల్ల బ్యాంకులు, ఇతర సర్వీస్ ప్రొవైడర్స్‌కు యూపీఐ, ఇతర ఎలక్ట్రానిక్ పేమెంట్ పద్ధతుల ద్వారా జరిపే చెల్లింపులపై ఫీజులు వసూలు చేసే అధికారం లభిస్తుంది.
అయితే యూపీఐ సేవలపై ఎలాంటి ఫీజులు ఉండవని కేంద్రం గతంలోనే చెప్పిన విషయాన్ని ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం శనివారం ఆ అనుమానాలను కొట్టివేస్తూ వ్యక్తులకు యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. భవిష్యత్తులో అతి తక్కువ మంది వ్యాపారుల నుంచి మాత్రమే నామమాత్రపు ఎండీఆర్ వసూలు చేస్తారని, అది కూడా నిర్దిష్ట విలువకు మించిన మొత్తాలపై మాత్రమేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా... ఎండీఆర్ ఛార్జీలు క్రెడిట్, డెబిట్ కార్డులకు వర్తించే ఛార్జీల కంటే తక్కువగా ఉంటాయని భరోసానిచ్చింది. పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్‌లోని సెక్షన్ 10ఏను మార్పుల కోసం ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంటు పాస్ చేసిన తరువాత ఎన్‌పీసీఐ నేతృత్వంలోని యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ అవసరమైతే ఎండీఆర్‌పై ఒక నిర్ణయం తీసుకుంటుందని వివరించింది.
చట్టంలో మార్పులు ఎందుకు?
యూపీఐ వ్యవస్థను దీర్ఘకాలం కొనసాగించేందుకు, సాంకేతికత పరంగా ఎదురయ్యే కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు మాత్రమే పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్స్ సిస్టమ్స్ చట్టానికి మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్రం వివరించింది. యూపీఐ లావాదేవీలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన నేపథ్యంలో మోసాలను నివారించేందుకు, హ్యాకర్ల బారి నుంచి వ్యవస్థను రక్షించేందుకు, మౌలిక సదుపాయాల పెంపునకు పెద్ద ఎత్తున డబ్బు అవసరమవుతుందని గుర్తు చేసింది. అంతేకాకుండా... మరిన్ని కంపెనీలు డిజిటల్ పేమెంట్లు చేసేలా ప్రోత్సహించేందుకు కూడా చట్టపరమైన మార్పు అవసరమైందని తెలిపింది. సబ్సిడీలపై ఆధారపడటం యూపీఏ వృద్ధికి అడ్డంకి అని స్పష్టం చేసింది.
యూపీఐ వ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండేందుకు, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా మారేందుకు కూడా చట్ట సవరణ అవసరమైందని తెలిపింది. విదేశీ శక్తుల ప్రభావానికి లోనై ఈ మార్పుల చేస్తున్నారన్న ఆరోపణలను ఖండించింది. 2016–17లో ప్రారంభమైనప్పటి నుంచి యూపీఐ దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చిన్న ప్రయోగంగా మొదలై ఇప్పుడు సామాన్య ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయింది. ప్రతినెల వందల కోట్ల లావాదేవీలను నమోదు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శగా నిలిచిందీ వ్యవస్థ. గత నెలలో యూపీఐ ద్వారా మొత్తం 2366 కోట్ల లావాదేవీలు జరగ్గా వీటి విలువ 29.9 లక్షల కోట్లు! భారత్‌తోపాటు 11 దేశాల్లో అమల్లో ఉంది ఇది.


