దేశంలో డిజిటల్ విప్లవానికి మారుపేరుగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీల నిర్వహణలో త్వరలోనే ఒక కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. గత ఐదేళ్లుగా ‘జీరో’గా ఉన్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) లేదా మర్చంట్ ఫీజును పెద్ద వ్యాపార సంస్థల లావాదేవీలపై తిరిగి పునరుద్ధరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బీఐ కసరత్తు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం వద్ద తుది ఆమోదం కోసం వేచి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఏమిటీ ప్రతిపాదన? ఎవరిపై ప్రభావం?
పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)తో పాటు బ్యాంకింగ్ రంగానికి చెందిన ప్రముఖులు కేంద్ర ప్రభుత్వానికి అందించిన సిఫార్సుల ప్రకారం.. ఈ కొత్త మర్చంట్ ఫీజు పరిధిలోకి కేవలం పెద్ద వ్యాపారాలు, ఈ-కామర్స్ దిగ్గజాలు మాత్రమే రానున్నాయి.
వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ (జీఎస్టీ ఫైలింగ్స్ ఆధారంగా) ఉన్న పెద్ద మర్చంట్లు, లేదా రోజువారీ భారీ లావాదేవీలు జరిపే సంస్థలపైనే ఈ ఫీజు విధించే అవకాశం ఉంది.
వార్షిక టర్నోవర్ రూ.40 లక్షల లోపు ఉండే చిన్న కిరాణా దుకాణాలు, వీధి వ్యాపారులకు దీని నుంచి పూర్తిగా మినహాయింపు ఉంటుంది.
ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి బదిలీ చేసుకునే(పీర్-టు-పీర్) సాధారణ యూపీఐ లావాదేవీలు ఎప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయి.
గమనిక: ఈ విధానంలో ఒక కఠినమైన నిబంధనను కూడా చేర్చనున్నారు. పెద్ద వ్యాపారులు ఈ ఎండీఆర్ భారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారులపై రుద్దకూడదు. వ్యాపార నిర్వహణ వ్యయం కింద మర్చంట్లే దీన్ని భరించాల్సి ఉంటుంది.
ఫీజు పునరుద్ధరణకు దారితీసిన కారణాలు
కేంద్ర ప్రభుత్వం జనవరి 2020 నుంచి యూపీఐ, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై ఎండీఆర్‌ను పూర్తిగా రద్దు చేసింది. దీనివల్ల డిజిటల్ లావాదేవీలు ఊహించని స్థాయికి పెరిగినప్పటికీ ఫిన్‌టెక్ రంగానికి, బ్యాంకుల మౌలిక వసతుల నిర్వహణకు ఇది తీవ్ర ఆర్థిక భారంగా మారింది.
నిపుణుల అంచనాల ప్రకారం.. యూపీఐ వ్యవస్థను సమర్థవంతంగా నడపడానికి, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి ఏడాదికి దాదాపు రూ.10,000 కోట్లు అవసరం అవుతుండగా ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కేవలం కొంత భాగాన్ని మాత్రమే భర్తీ చేస్తోంది.
జీరో-ఎండీఆర్ విధానం వల్ల పేమెంట్ గేట్‌వేలు, బ్యాంకులు, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యాప్‌లకు స్థిరమైన ఆదాయం కరువైంది. ఇది కొత్త ఆవిష్కరణలకు అడ్డుకట్ట వేస్తోందని పార్లమెంటరీ కమిటీ కూడా గతంలో అభిప్రాయపడింది.
పెద్ద వ్యాపారాలపై కనీసం 0.25-0.3% వరకు నామమాత్రపు ఎండీఆర్ విధించడం ద్వారా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత పటిష్టం చేయవచ్చని పరిశ్రమ వర్గాలు ప్రధాని నరేంద్ర మోదీకి సైతం లేఖ రాశాయి.
పరిశ్రమపై పడే ప్రభావం
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, స్విగ్గీ, జెప్టో వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే వీసా, మాస్టర్‌కార్డ్ డెబిట్/ క్రెడిట్ కార్డ్ లావాదేవీల కోసం మర్చంట్ ఫీజులు చెల్లిస్తున్నాయి. కాబట్టి యూపీఐపై కూడా నామమాత్రపు ఫీజు విధిస్తే వారి వ్యాపారాలపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా, దీనివల్ల బ్యాంకులకు, థర్డ్ పార్టీ యాప్‌లకు తగిన ఆదాయం సమకూరి మరింత మెరుగైన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చే వీలుంటుంది. ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాల నుంచి దీనిపై అధికారిక ప్రటకన రావడమే తరువాయి ఈ నిబంధనలు ఎప్పటి నుంచి అమలులోకి వస్తాయనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.
ఇదీ చదవండి: IRCTC వెబ్‌సైట్ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు


