ఆస్తి పన్ను నుంచి ట్రాఫిక్ చలాన్ల వరకు
గ్రేటర్‌లో డిజిటల్ చెల్లింపులకు కొత్త దిశ
90 రోజుల్లో అన్ని శాఖల అనుసంధానం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగర ప్రజలు ఇకపై వివిధ ప్రభు త్వ విభాగాలకు చెందిన వివిధ సేవల చెల్లింపులను ఒకే యాప్ (క్యూర్–1) ద్వారా చేయొచ్చు. ఈ మేరకు ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ యాప్ ద్వారా క్యూర్ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో ‘కామన్ యూనిఫైడ్ బిల్లింగ్ అండ్ కలెక్షన్ సిస్టం’ అమలుకు మార్గ దర్శకాలు జారీ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ వ్యవస్థ ద్వారా ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, ట్రాఫిక్ చలాన్లు తదితర ప్రభుత్వ బకాయిలన్నింటినీ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాంలో చెల్లించే అవకాశం కల్పించనున్నారు.
ప్రస్తుతం నగర ప్రజలు వివిధ శాఖలకు సంబంధించిన బిల్లులు, పన్నులు చెల్లించేందుకు వేర్వేరు పోర్టళ్లను వినియోగించాల్సి వస్తోంది. ఈ పరిస్థితి వల్ల ప్రజలకు ఇబ్బందులు, శాఖలకు వసూళ్ల సమన్వయంలో సమస్యలు, ఆదాయ లీకేజీలు చోటుచేసుకుంటున్నాయని గుర్తించిన ప్రభుత్వం.. ఈ యాప్ ద్వారా సమగ్ర చెల్లింపు వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. దీంతో చెల్లింపుల పారదర్శకత, జవాబుదారీతనం, వసూళ్ల సామర్థ్యం పెరగడంతో పాటు విభిన్న చెల్లింపు వ్యవస్థల అవసరం తొలగిపోనుంది.
ఏ సేవలు అందుబాటులోకి?
మొదటి దశలో జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలకు సంబంధించిన ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సులు, సెల్ఫ్ అసెస్‌మెంట్, సూపర్ స్ట్రక్చర్ ఫీజులు, ఖాళీ భూముల పన్ను (వీఎల్‌టీ) చెల్లింపులను అనుసంధానించనున్నారు. అలాగే టీజీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లులు, జలమండలికి సంబంధించిన వాటర్, సివరేజి చార్జీలు, హైదరాబాద్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు కూడా ఈ వేదికలోకి రానున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వం సూచించే ఇతర సేవలను కూడా ఇందులో చేర్చనున్నారు. యాప్ నిర్వహణ బాధ్యతలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కు అప్పగించనున్నారు.
రోజువారీ సెటిల్‌మెంట్
యాప్ ద్వారా జరిగే అన్ని చెల్లింపులు మీ సేవ పేమెంట్ గేట్‌వే ద్వారా ప్రాసెస్ అవుతాయి. వసూలైన మొత్తా లు తాత్కాలికంగా కేంద్ర ఖాతాలో నిల్వ చేసి, టీ+0 లేదా టీ+1 విధానంలో సంబంధిత శాఖలకు బదిలీ చేస్తారు. పేమెంట్ వైఫల్యాలు, రీకన్సిలియేషన్ సమస్యలు, ఇతర సేవా వివాదాల పరిష్కారం కోసం కేంద్రీకృత గ్రీవెన్స్ రెడ్రెస్సల్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
పౌరులు క్యూర్ –1 యాప్,మై క్యూర్ యాప్, ఆయా శాఖల పోర్టళ్ల ద్వారా ఫిర్యాదులు నమో దు చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని శాఖలు 90 రోజుల్లోపు క్యూర్–1 యాప్‌తో చెల్లింపు వ్యవస్థలోకి మారా ల్సి ఉంటుంది. కాగా.. ఒకే డిజిటల్ ఎకో సిస్టమ్ లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం తీసుకొచ్చిన క్యూర్ –1 యాప్ నగర పాలనలో డిజిటల్ సంస్కరణలకు కొత్త మైలురాయిగా నిలవనుందని అధికారులు భావిస్తు న్నారు. 3 కార్పొరేషన్ల పరిధిలోని పౌరులకు సౌకర్యవంతమైన, పారదర్శకమైన సేవలు అందుతాయని పేర్కొంటున్నారు.


